Abn logo
Sep 26 2021 @ 00:49AM

బెల్టుషాపునకు రూ.6.02 లక్షల వేలం

గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట వేలం పాటలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ప్రజలు

ఎల్లారెడ్డిపేట, సెప్టెంబరు 25: గ్రామాభివృద్ధి ముసుగులో ప్రజాప్రతినిధులు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. పల్లెల్లో బెల్టుషాపుల నిషేధం ఉన్నా గ్రామ సచివాలయం సాక్షిగా ఉల్లంఘించారు.  రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో శనివారం బెల్టుషాపు నిర్వహణకు వేలం పాడారు. గ్రామంలో ఒక్కరే బెల్టు దుకాణం కొనసాగించాలని అందుకు గ్రామసభ ఏర్పాటు చేసి వేలం నిర్వహించారు. ఆరుగురు వేలం పాటల్లో పోటాపోటీగా పాల్గొన్నారు. బాలయ్య అనే వ్యక్తి రూ.6.02 లక్షలకు బెల్టు దుకాణం దక్కించుకున్నాడు. అతను తప్ప గ్రామంలో ఎవరూ మద్యం అమ్మకాలు సాగించినా జరిమానా విధిస్తామని తీర్మానించారు. గ్రామంలో కూరగాయాల మార్కెట్‌ను రూ.21 వేలకు లింగయ్య, గొర్రెల మార్కెట్‌ రూ.41 వేలకు దేవయ్య దక్కించు కున్నారు. ఈ విషయంపై సర్పంచ్‌ కోల అంజవ్వనర్సయ్యను వివరణ కోరగా వేలం పాటల ద్వారా సమకూరిన ఆదాయాన్ని గ్రామాభివృద్ధికి వెచ్చిస్తామని పేర్కొన్నారు. ఎక్సైజ్‌ సీఐ ఎంపీఆర్‌ చంద్రశేఖర్‌ను సంప్రదించగా గ్రామంలో మద్యం దుకాణానికి వేలం పాటలు నిర్వహించారనే విషయం మా దృష్టికి రాలేదని అన్నారు. విచారణ జరిపి వేలం పాటలు నిర్వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని వివరించారు. గ్రామాల్లో బెల్టు షాపులకు వేలం పాటలు నిర్వహించి మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తే కేసులు నమోదు చేస్తామని సీఐ ఎంపీఆర్‌ చంద్రశేఖర్‌ హెచ్చరించారు.