భారతీయుల ప్రియతముడు

ABN , First Publish Date - 2021-06-22T06:06:55+05:30 IST

ప్రపంచంలో వివిధ దేశాధినేతల ఆమోదయోగ్యత ఆయా దేశాల ప్రజల్లో ఎంతమేరకు ఉన్నది అన్న అంశంపై తరుచూ సర్వే నిర్వహించే అమెరికా డేటా ఇంటెలిజెన్స్ సంస్థ ‘మార్నింగ్ కన్ సల్ట్’ ప్రకారం...

భారతీయుల ప్రియతముడు

ప్రపంచంలో వివిధ దేశాధినేతల ఆమోదయోగ్యత ఆయా దేశాల ప్రజల్లో ఎంతమేరకు ఉన్నది అన్న అంశంపై తరుచూ సర్వే నిర్వహించే అమెరికా డేటా ఇంటెలిజెన్స్ సంస్థ ‘మార్నింగ్ కన్ సల్ట్’ ప్రకారం భారత ప్రధాని నరేంద్రమోదీ ఆమోదయోగ్యత 66 శాతం ఉన్నదని తేలింది. అమెరికా, బ్రిటన్, రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్, ప్రాన్స్, జర్మనీ దేశాల అధినేతలతో పోలిస్తే మోదీ ఆమోదయోగ్యతే ఎక్కువ ఉన్నదని ఈ సంస్థ స్పష్టం చేసింది. కరోనా రెండో ప్రభంజనం సృష్టించిన అతలాకుతల పరిస్థితుల మధ్య కూడా భారత్‌లో మెజారిటీ ప్రజలు మోదీని తప్ప మరే నేతను ఆమోదించే పరిస్థితిలో లేరని ఆ సర్వే స్పష్టం చేసింది. దీన్ని బట్టి గత ఏడేళ్లలో మోదీ తీసుకున్న అనేక కీలక నిర్ణయాలను ప్రజలు అత్యంత హర్షాతిరేకంతో ఆమోదించారని కూడా అనుకోవడానికి ఆస్కారం ఉన్నది. 


ఒకవైపు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పటికీ ప్రభుత్వం కరోనా మూలంగా నెలకొన్న పరిస్థితులను ఎదుర్కోవడంపైనే అధికంగా దృష్టి సారించింది. తొలి విడత లాక్‌డౌన్‌ మూలంగా దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థను కోలుకునేలా చేయడం, చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల రంగానికి చేయూత నివ్వడం, అసంఘటిత కార్మికులకు ఆసరా కల్పించడంతో పాటు ఆరోగ్య మౌలిక సదుపాయాలు, వాక్సినేషన్‌పై దృష్టి కేంద్రీకరించాల్సి వచ్చింది. ముఖ్యంగా ప్రధాని దేశానికి స్వావలంబన కల్పించేందుకు ఆత్మనిర్భర్ పేరిట మోదీ తీసుకున్న చర్యల వల్లనే ఇవాళ కేవలం ఏడాదిన్నరలోనే అనేక వైద్య ఉపకరణాలు భారత దేశంలో లభ్యమవుతున్నాయి. కరోనాకు ముందు మన దేశంలో ఒక్క పీపీఈ కిట్ కూడా ఉత్పత్తి అయ్యేది కాదు, ఇవాళ రోజుకు 5లక్షల పీపీఈ కిట్స్‌ను ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం. మనమే ఇతర దేశాలకు అత్యవసర మందులు ఎగుమతి చేయగలుగుతున్నాం. అనూహ్యమైన రీతిలో కరోనా రెండో ప్రభంజనం రావడంతో గత వందేళ్లలో ఎన్నడూ ఎదుర్కోని విధంగా ఆక్సిజన్ సిలిండర్, అత్యవసర మందుల కొరత స్పష్టంగా బయటపడింది. ఈ సమస్యనూ మోదీ నాయకత్వంలో అతి వేగంగా ఎదుర్కోవడం వల్లనే ఇవాళ పరిస్థితులు కొలిక్కి వచ్చాయి. దేశంలో వందలాది ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొంటున్నాయి. డీఆర్‌డీవో లాంటి సంస్థలు కూడా తమ రక్షణ సాంకేతికతను ఉపయోగించి తీవ్ర కరోనా లక్షణాలున్న వారికి ఆక్సిజన్ అవసరం లేకుండా చేసేందుకు 2డీజీ వంటి అద్బుతమైన ఔషధాలను ఉత్పత్తి చేసింది. కోట్లాది ప్రజలకు ఉచితంగా వాక్సినేషన్ ఇచ్చే బృహత్తర కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అంతేకాదు. కరోనా థర్డ్ వేవ్ వచ్చినా మనం ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామంటే అది మోదీ కల్పించిన ఆత్మవిశ్వాసం వల్లే అనడంలో అతిశయోక్తి లేదు. 


కరోనా మహమ్మారి ఎంత తీవ్రమైన సంక్షోభ పరిస్థితులు సృష్టించినప్పటికీ కాలం ఒకే చోట ఆగిపోకూడదని మోదీ విశ్వసించినందువల్లే ఆయన గత రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న అంశాలను పరిష్కరించేందుకు మళ్ళీ పూనుకుంటున్నారు. అందులో ముఖ్యమైనది కశ్మీర్ సమస్య. ఆ రాష్ట్రంలో స్తంభించిపోయిన పరిస్థితులు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నాయి. అనేక జిల్లాల్లో కర్ఫ్యూను ఎత్తి వేశారు. తీవ్ర ఉగ్రవాద పరిస్థితులున్నప్పటికీ జమ్ము, కశ్మీర్ లలో పంచాయతీ ఎన్నికలను దిగ్విజయంగా నిర్వహించి అక్కడ ప్రజలకు స్వయంపాలన అప్పజెప్పారు. ఇప్పుడు రాష్ట్రస్థాయిలో ప్రజాస్వామిక ప్రక్రియను నెలకొల్పేందుకు సమయం ఆసన్నమవుతున్నది కనుకనే ఆ రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల నేతలతో మాట్లాడాలని ప్రధానమంత్రి నిర్ణయించారు. నియోజకవర్గాల పునర్విభజన నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేంత వరకూ దశల వారీగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సంకల్పించింది. కశ్మీర్‌లో 370 అధికరణను రద్దు చేయడం, లద్దాఖ్‌లో స్థానిక ప్రజల మనోభీష్టం ప్రకారం ఆ ప్రాంతాన్ని జమ్ము, కశ్మీర్‌ల నుంచి వేరు చేయడం వంటి సాహసోపేత చర్యలతో మోదీ ప్రభుత్వం ఈ దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చింది. గత రెండేళ్లలో జమ్ముకశ్మీర్‌లో రోడ్డు, రైల్వే అనుసంధానం, ఆరోగ్య, విద్యా రంగాలకు చెందిన భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అమలయ్యాయి. అభివృద్ధికి దోహదం చేసే 890 కేంద్ర చట్టాలు ఇప్పుడు జమ్ము, కశ్మీర్లలో అమలవుతున్నాయి. ఆయుష్మాన్ భారత్‌తో సహా అనేక అభివృద్ధి పథకాల ఫలాలను అక్కడి ప్రజలు ఇప్పుడు అనుభవించగలుగుతున్నారు. యువత ఉగ్రవాద ప్రభావం నుంచి బయటపడి ఉపాధి పొందేందుకు అనేక అవకాశాలు అక్కడ లభ్యమవుతున్నాయి.


ఇతర దేశాల్లో శరణార్థులుగా, అనేక హింసలకు గురవుతున్న భారతీయులకు పౌరసత్వం కల్పించడం కోసమే పౌరసత్వ చట్టాన్ని ప్రవేశపెట్టామని మోదీ ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ ముస్లింలలో అభద్రతను కల్పించేందుకు ఆ చట్టాన్ని ప్రతిపక్షాలు ఉపయోగించుకున్నాయి. నిరసన ప్రదర్శనలను ప్రోత్సహించాయి. యూనివర్సిటీలలో, ఢిల్లీ వీధుల్లో మతకల్లోలాలను రెచ్చగొట్టాయి. వీటన్నింటినీ మోదీ ప్రభుత్వం అత్యంత సంయమనంతో తిప్పిగొట్టినందువల్లే ఇవాళ ప్రజలు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోగలుగుతున్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ సాహసించని విధంగా మోదీ ప్రభుత్వం సీమాంతర ఉగ్రవాదాన్ని అణిచివేయడమే కాక, సర్జికల్ దాడులను చేసి పాక్ స్థావరాలను ధ్వంసం చేయడంతో ఆ దేశం ఆత్మరక్షణలో పడింది. గత ప్రభుత్వాల మాదిరి ప్రస్తుత ప్రభుత్వం భీరువులా వెనక్కు తగ్గదని చైనాకు కూడాతెలిసేలా చేయడంలో మోదీ సఫలమయ్యారు. భారత్, భూటాన్‌లలో తప్ప అనేక దేశాల్లో బెల్ట్, రోడ్ ప్రాజెక్టుల ద్వారా విస్తరిస్తున్న చైనాకు దీటుగా మెరుగైన ప్రపంచాన్ని తిరిగి నిర్మించాలన్న జీ-7 దేశాల లక్ష్యంలో భారత్ భాగస్వామి కావడం తాజా పరిణామం.


నిజానికి కరోనా మహమ్మారి కాలంలో కూడా మోదీ ప్రభుత్వం దేశంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఎక్కడా నిలిపివేయలేదు. వలసవాద పాలనకు చిహ్నంగా ఉన్న వందేళ్ల పూర్వపు కట్టడాల నుంచి విముక్తి కలిగించి భారత వైభవాన్ని చాటిచెప్పే సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డుపడినా మోదీ ప్రభుత్వం వెనుకంజ వేయలేదు. అంతేకాదు, ఇవాళ దేశం నలుమూలలా ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది. అనేక పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చెందుతున్నాయి. విశాలమైన రహదారులు, ఆధునిక రైల్వేవ్యవస్థలు, జలమార్గాలు, సొరంగాలు నిరంతరం నిర్మాణమవుతున్నాయి. 2014లో కేవలం అయిదునగరాల్లో మెట్రోరైలు సౌకర్యం ఉంటే ఇవాళ 18 నగరాల్లో మెట్రో సౌకర్యం లభిస్తోంది. ఎన్ని తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డా, ఎన్ని దుష్ప్రచారాలు, వ్యక్తిత్వ హనన ప్రచారాలు ఎదుర్కొన్నా దేశ ప్రజల సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్న ఏకైక నాయకుడుగా మోదీ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. 


వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Updated Date - 2021-06-22T06:06:55+05:30 IST