బెల్లం రైతు ఆందోళన

ABN , First Publish Date - 2022-05-21T06:31:38+05:30 IST

‘ఉరుమురుమి మంగలం మీద పడినట్టుగా’ వుంది పోలీసులు, ఎస్‌ఈబీ అధికారులు తీరు.

బెల్లం రైతు ఆందోళన
ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో నల్లబెల్లం (ఫైల్‌ ఫొటో)

పోలీసులు ఆంక్షలు, దాడులతో గుబులు

సారా తయారీదారులపై కోపాన్ని తమపై చూపుతున్నారని ఆవేదన

నేల స్వభావాన్నిబట్టి నల్లబెల్లం తయారవుందని వెల్లడి

పోలీసు అధికారుల హెచ్చరికలతో సందిగ్ధంలో బెల్లం తయారీ

అయోమయంలో రైతులు, వర్తకులు


అనకాపల్లి అర్బన్‌, మే 20: ‘ఉరుమురుమి మంగలం మీద పడినట్టుగా’ వుంది పోలీసులు, ఎస్‌ఈబీ అధికారులు తీరు.  నాటుసారా తయారీని పూర్తిస్థాయిలో కట్టడి చేయలేక... బెల్లం రైతులు, వర్తకులపై ఆంక్షలు విధించారు. కొద్ది రోజుల నుంచి బెల్లం రైతులు, వ్యాపారులపై దాడులను ముమ్మరం చేశారు. దీంతో  వారు బెంబేలెత్తిపోతున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో రెండు రోజుల నుంచి బెల్లం లావాదేవీలు నిలిపివేశారు. ప్రస్తుతం బెల్లం సీజన్‌ ముగింపు దశలో ఉన్నప్పటికీ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

దశాబ్దాల నుంచి నల్ల బెల్లం ఉత్పత్తి అవుతున్నది. నల్లబెల్లాన్ని రైతులు ఉద్దేశ పూర్వకంగా తయారు చేయరు. చెరకు సాగు చేసే నేల స్వభావాన్నిబట్టి బెల్లం రంగు వుంటుంది. కొన్ని ప్రాంతాల్లో పండించే చెరకు రసం నుంచి తయారు చేసే బెల్లం మంచి రంగుతోను, మరి కొన్ని నేలల్లో పండించిన చెరకు రసంతో తయారు చేసిన బెల్లం నల్లగాను వుంటుంది.  నల్లరేగడి నేలలతోపాటు చెరకు రసం పాకం పట్టేనప్పుడు రసాయనాలు కలపకపోతే బెల్లం నల్ల రంగులో వుంటుంది. మొదటి రెండు రకాలతో పోలిస్తే నల్ల బెల్లం ధర తక్కువ వుంటుంది. దీనిని ఒడిశా, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో అధికంగా వినియోగిస్తుంటారు. రైతులు ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో విక్రయిస్తే.. వ్యాపారాలు కొనుగోలు చేసి ఆయా రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. 

ఇదిలావుండగా కొణతాల రామకృష్ణ మంత్రిగా వున్నప్పుడు కూడా నల్లబెల్లం సమస్య ఏర్పడింది. అప్పట్లో ఆయన ప్రభుత్వం నుంచి చెరకు రైతులకు అనుకూలంగా జీవో తీసుకొచ్చారు. అలాగే మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కూడా గత టీడీపీ ప్రభుత్వాన్ని ఒప్పించి నల్లబెల్లం అమ్మకాలపై నిషేధాన్ని రద్దు చేస్తూ జీవో తీసుకొచ్చారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా నల్లబెల్లం సమస్య తెరమీదికి వస్తూనే ఉంది. ఆయా సందర్భాల్లో అప్పటి ఎమ్మెల్యే లేదా మంత్రి జోక్యం చేసుకుని, ప్రభుత్వాన్ని ఒప్పించి నల్లబెల్లంపై నిషేధాన్ని ఎత్తివేసేలా జీవోలు జారీ చేయించారు. 

మద్యం ధరల పెంపుతో ఊపందుకున్న సారా తయారీ

ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. సొంతంగా మద్యం అమ్మకాలు చేపట్టింది. అంతేకాక ధరలను రెండు మూడు రెట్లు పెంచేసింది. దీంతో మందుబాబు నాటుసారాను ఆశ్రయించడం మొదలుపెట్టారు. గ్రామాల్లో పుట్టగొడుగుల్లో సారా బట్టీలు వెలిశాయి. నాటుసారా తయారీకి ప్రధాన ముడిసరుకు నల్లబెల్లం. దీంతో నల్లబెల్లానికి గిరాకీ ఏర్పడింది. పోలీసులు, ఎస్‌ఈబీ అధికారులు ఎన్ని దాడులు చేసినా సారా తయారీ అగడంలేదు. దీంతో నల్లం బెల్లంపై దృష్టి సారించారు.  నాటుసారా తయారీకి ముడిసరుకుగా వినియోగిస్తున్న నల్లబెల్లం విక్రయాలపై పోలీసు నిఘా ఉంటుందని డీఐజీ హరికృష్ణ ఇటీవల స్పష్టం చేశారు. నాటుసారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం విక్రయించిన వ్యాపారులపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గౌతమిశాలి హెచ్చరించారు. దీంతో రైతులు, వర్తకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఆ జీవోలు ఇప్పుడు అమలులో ఉండవా?

కొణతాల లక్ష్మీనారాయణ, వర్తక సంఘం కార్యదర్శి 

చెరకు రైతులు తరతరాలుగా బెల్లం తయారు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అటువంటిది నల్లబెల్లంపై నిషేధం విధించడం దురదృష్టకరం.  ఈ సమస్య కొన్ని దశాబ్దాలుగా ఉంది. ప్రభుత్వం మారినప్పుడల్లా నల్లబెల్లం సమస్య తెరమీదికి వస్తోంది. ఎన్టీఆర్‌, రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రులుగా వున్నప్పుడు నల్లబెల్లంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ జీవోలు జారీ చేశారు. ఆ జీవోలు ఇప్పుడు అమలులో ఉండవా? ఇప్పుడు పోలీసు అధికారులు బెల్లం రైతులు, వర్తకులతోపాటు చిన్నపాటి కిరాణా వ్యాపారులను కూడా వదలకుండా కేసులు పెడుతున్నారు. 


పోలీసుల వేధింపులు సరికాదు

కె.లోకనాథం, సీపీఎం జిల్లా కార్యదర్శి

జిల్లా మూడు సహరాక చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. మిగిలిన ఒక్క ఫ్యాక్టరీ చెరకు డబ్బులు ఎప్పుడు చెల్లిస్తుందో తెలియదు. దీంతో చెరకు రైతులు గత్యంతరం లేక బెల్లం తయారుచేసి అనకాపల్లి మార్కెట్‌ యార్డులో అమ్ముకుంటున్నారు. నాటుసారా తయారీని నియంత్రించడానికి చర్యలు చేపట్టకుండా బెల్లం రైతులు, వర్తకులను పోలీసులు వేధించడం సరికాదు.



రెండో రోజూ లావాదేవీలు నిలిపివేత

అనకాపల్లిటౌన్‌, మే 20ః ఎన్టీఆర్‌ మార్కెట్‌యార్డులో బెల్లం లావాదేవీల నిలిపివేత రెండో రోజైన శుక్రవారం కూడా కొనసాగింది. నల్లబెల్లంపై ఆంక్షల సడలింపు విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడంతో వర్తకులు లావాదేవీలు నిలిపివేశారు. అయితే ఈ విషయం తెలియక కొంతమంది రైతులు బెల్లం దిమ్మలను మార్కెట్‌కు తీసుకువచ్చారు. లావాదేవీలను నిలిపివేయడంతో బెల్లాన్ని కొలగార్లు ప్లాట్‌ఫారాలపై భద్రపరిచారు. కాగా ప్రభుత్వం తక్షణమే స్పందించి నల్లబెల్లంపై ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా మార్కెట్‌ యార్డులో యథావిధిగా లావాదేవీలు కొనసాగేలా చొరవ తీసుకోవాలని సీపీఐ నాయకుడు వైఎన్‌ భద్రం కోరారు. 


Updated Date - 2022-05-21T06:31:38+05:30 IST