సరైన యాజమాన్య పద్ధతులతో గంటి సాగు లాభదాయం

ABN , First Publish Date - 2021-06-18T05:25:24+05:30 IST

చిరుధాన్యాల వినియోగం పెరుగుతుండడంతో చోడి, గంటి, కొర్ర, సామ పంటలను సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయి.

సరైన యాజమాన్య పద్ధతులతో గంటి సాగు లాభదాయం
గంటి పంట కంకులను పరిశీలిస్తున్న సస్యసేద్య శాస్త్రవేత్త డాక్టర్‌ ప్రసాదరావు (ఫైల్‌ ఫొటో)


ఖరీఫ్‌లో జూలై రెండో వారం వరకు విత్తుకోవచ్చు

బీసీటీ కేవీకే సస్యసేద్య శాస్త్రవేత్త డాక్టర్‌ వానా ప్రసాదరావు 


రాంబిల్లి, జూన్‌ 17: చిరుధాన్యాల వినియోగం పెరుగుతుండడంతో చోడి, గంటి, కొర్ర, సామ పంటలను సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయి. దీంతో జిల్లాలో ఈ పంటల సాగు విస్తీర్ణం ఏటేటా పెరుగుతున్నది. ముఖ్యంగా గంటి (సజ్జ) పంట తక్కువ ఖర్చుతో ఏ కాలంలో అయినా సాగుకు అనుకూలంగా వుండడంతో రైతులు ఈ పంటను వేయడానికి ఆసక్తి చూపుతున్నారు. సరైన యాజమాన్య పద్ధతులు, నాణ్యమైన విత్తనాన్ని వినియోగిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని బీసీటీ కేవీకే సస్యసేద్య శాస్త్రవేత్త డాక్టర్‌ వానా ప్రసాదరావు చెబుతున్నారు. గంటి సాగు గురించి ఆయన తెలిపిన సమాచారం....

ఖరీఫ్‌లో తేలికపాటి ఎర్రనేలలు అనుకూలం. తొలకరి వర్షాలు పడిన వెంటనే జూన్‌ మొదటివారం నుంచి జూలై రెండో వారంలోపు విత్తుకోవాలి. ఎకరాకు 1.6 కిలోల విత్తనం అవసరం. పీహెచ్‌బీ-3, పీహెచ్‌బీ-67, ఐసీఎంహెచ్‌-356, ఐసీటీసీ 8303, ఏవీబీ 04 రకాలు అనువైనవి. 80 నుంచి 85 రోజుల్లో పంట కోతకు వస్తుంది. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి ఇస్తాయి.  8 నుంచి 10 కింటాళ్ల వరకు ఎండు పశుగ్రాసం కూడా లభిస్తుంది. విత్తే ముందు 2 శాతం ఉప్పనీటి ద్రావణంలో విత్తనాలను పది నిమిషాలు ముంచి తీయాలి. తడి ఆరిన తరువాత కిలో విత్తనానికి 6 గ్రాముల మెటలాక్సిల్‌తో విత్తనశుద్ధి చేయాలి. పొలాన్ని నాగలితో దున్ని వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 16 సెంటీమీటర్ల దూరం వుండేలా బోదెలపై గొర్రుతో విత్తుకోవాలి. దీనివల్ల అధిక వర్షం కురిసినా... మొలక దెబ్బతినకుండా ఉంటుంది. మడిలో విత్తనాలు చల్లి, 15 రోజుల తరువాత నారు మొక్కలను ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. విత్తిన మూడు వారాలలోపు కుదురుకు 1-2 మొక్కలు ఉంచి మిగిలిన వాటిని పీకివేయాలి. పూత, గింజ దశల్లో నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలి.

సజ్జ పంటకు వెర్రికంకి తెగులు సోకే అవకాశాలు ఎక్కువ. విత్తిన 21 రోజులకు తెగులు సోకిన మొక్కలు పొలంలో 5 శాతానికి మించి ఉంటే మెటలాక్సిల్‌ 35డబ్ల్యూఎస్‌ మందును లీటరు నీటికి రెండు గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

పూత దశలో తేనెబంక తెగులు సోకుతుంది. మబ్బులతో కూడిన వాతావరణం, వర్షపు తుంపరలతో ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. దీని నివారణకు కార్బండిజమ్‌ మందును లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. మరింత సమాచారం కోసం 89784 51144 నంబర్‌కు ఫోన్‌ చేసి సంప్రదించాలని బీసీటీ కేవీకే సస్యసేద్య శాస్త్రవేత్త డాక్టర్‌ వానా ప్రసాదరావు తెలిపారు.


Updated Date - 2021-06-18T05:25:24+05:30 IST