బార్స్, రెస్టారెంట్స్‌ను కాపాడేందుకు.. బెల్జియంలో వినూత్నంగా..

ABN , First Publish Date - 2020-06-07T04:58:35+05:30 IST

బై వన్ గెట్ టూ గురించి వింటూనే ఉంటాం. కానీ.. బై టూ గెట్ వన్ గురించి ఎప్పుడైనా విన్నారా?

బార్స్, రెస్టారెంట్స్‌ను కాపాడేందుకు.. బెల్జియంలో వినూత్నంగా..

బ్రస్సెల్స్: బై వన్ గెట్ టూ గురించి వింటూనే ఉంటాం. కానీ.. బై టూ గెట్ వన్ గురించి ఎప్పుడైనా విన్నారా? అదేంటి రెండు కొంటే ఒకటి రావడం ఏంటని అనుకుంటున్నారా? బెల్జియంలోని ఫెడరేషన్ ఆఫ్ బెల్జియన్ కేఫ్స్ అక్కడి బార్స్, రెస్టారెంట్లను ఆదుకోవడానికి ‘హెల్పీ హవర్’ పేరిట కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది.  కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. బెల్జియాంలోనూ దాదాపు మూడు నెలల నుంచి లాక్‌డౌన్ అమల్లో ఉంది. దీంతో వ్యాపారస్థులు భారీగా నష్టపోయారు. ముఖ్యంగా బెల్జియం వ్యాప్తంగా బార్స్, రెస్టారెంట్స్, కేఫ్స్ నడిపే వారు ఎక్కువగా నష్టపోయారు. ఇదిలా ఉంటే.. దాదాపు మూడు నెలల తరువాత బెల్జియం ప్రభుత్వం బార్, రెస్టారెంట్స్ తెరిచేందుకు అనుమతులిచ్చింది. సోమవారం నుంచి బార్స్, రెస్టారెంట్స్ తిరిగి తెరుచుకోనున్నాయి. అయితే వారిని కాపాడేందుకు ఫెడరేషన్ ఆఫ్ బెల్జియం కేఫ్స్ ప్రజల సహాయం కోరింది. బెల్జియం వ్యాప్తంగా ఏ రెస్టారెంట్, బార్‌లోనైనా బీర్ కొంటే రెట్టింపు డబ్బు చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. కొంతకాలం పాటు ఇలా చేస్తే తప్ప బెల్జియంలోని బార్స్, రెస్టారెంట్స్ వ్యాపారాలను కొనసాగించలేవని తెలిపింది. ఇప్పటికే బెల్జియం వ్యాప్తంగా 12 వేల కేఫ్‌లు మూతపడటానికి సిద్దంగా ఉన్నాయని పేర్కొంది. తమకు ఎంతో ఇష్టమైన కేఫ్‌లు మూతపడటాన్ని బెల్జియం ప్రజలు కూడా ఆనందించరని ఈ సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ బెల్జియం కేఫ్స్ తెలిపింది.

Updated Date - 2020-06-07T04:58:35+05:30 IST