కృతజ్ఞత పవిత్రమైన విధి

ABN , First Publish Date - 2021-09-17T05:30:00+05:30 IST

కృతజ్ఞత అంటే చేసిన మేలు మరువకపోవడం. ఒక వ్యక్తి మనకు సహాయం చేసినప్పుడు అతనికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతాం. మరి ఈ సువిశాల విశ్వాన్ని మనకు ప్రసాదించి, మనకు కావలసిన జీవితావసరాలను సమకూరుస్తున్న సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటే... హృదయం కృతజ్ఞతాభావంతో...

కృతజ్ఞత పవిత్రమైన విధి

కృతజ్ఞత అంటే చేసిన మేలు మరువకపోవడం. ఒక వ్యక్తి మనకు సహాయం చేసినప్పుడు అతనికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతాం. మరి ఈ సువిశాల విశ్వాన్ని మనకు ప్రసాదించి, మనకు కావలసిన జీవితావసరాలను సమకూరుస్తున్న సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటే... హృదయం కృతజ్ఞతాభావంతో నిండిపోవాలి కదా! అనుక్షణం మనకు అవసరమయ్యే అసంఖ్యాకమైన వస్తువులను ఆ విశ్వప్రభువు ప్రసాదిస్తున్నాడు. కాబట్టి అల్లాహ్‌ పట్ల కృతజ్ఞతతో ఉండడం మన పవిత్రమైన విధి. 


‘‘నన్ను స్మరించండి. నేను మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటాను. నాకు కృతజ్ఞులై ఉండండి... ఓ విశ్వాసులారా! మీరు కేవలం అల్లా్‌హను ఆరాధించేవారే అయితే, మేము మీకు ప్రసాదించిన పవిత్రమైన వస్తువులను తినండి, తాగండి. అల్లా్‌హకు కృతజ్ఞతలు తెలపండి. కృతజ్ఞతలు తెలిపేవారికి అల్లాహ్‌ త్వరలోనే మంచి ప్రతిఫలం అందిస్తాడు. మీరు కృతజ్ఞులుగా మసలుకుంటూ, విశ్వాసులుగా ఉన్నప్పుడు అల్లాహ్‌ మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తాడు? అల్లాహ్‌ అన్నీ ఇచ్చేవాడు, అన్నీ తెలిసినవాడు’’ అని దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ పేర్కొన్నారు. కృతజ్ఞతాభావంతో మెలిగేవారిని మరింత అధికంగా అనుగ్రహిస్తానని చెప్పారు. 


‘‘భోజనం చేసిన తరువాత, ‘‘అల్లా్‌హకు అభివందనాలు. నా కృషి, శక్తి సామర్థ్యాల ప్రసక్తి లేకుండా ఈ భోజనాన్ని ఆయనే ప్రసాదించాడు’’ అని ఎవరైతే కృతజ్ఞతా భావంతో అంటారో వారు గతంలో చేసిన తప్పులన్నీ మన్నింపు పొందుతాయి’’ అని దైవ ప్రవక్త మహమ్మద్‌ తెలిపారు. మహా ప్రవక్త కొత్త దుస్తులు వేసుకున్నప్పుడు... అది తలపాగా అయినా, చొక్కా అయినా, లేదా కప్పుకొనే దుప్పటి అయినా... దాని పేరు చెబుతూ ‘‘అల్లాహ్‌! అభివందనాలు. నీకు కృతజ్ఞుణ్ణి. నేను దీన్ని ధరించేలా చేసింది నీవే. దీనిలోని మేలునూ, దీన్ని తయారు చేసిన లక్ష్యంలోని మేలునూ కోరుకుంటున్నాను. ఎలాంటి చెడయినా ఉన్నట్టయితే... నీ రక్షణును అర్థిస్తున్నాను’’ అని ప్రార్థించేవారు. 


‘‘విశ్వాసి వ్యవహారం వింతగా ఉంటుంది. అతను ఏ స్థితిలో ఉన్నా దానినుంచి శుభాన్నే గ్రహిస్తాడు. ఈ మహాభాగ్యం విశ్వాసికి తప్ప మరెవరికీ లేదు. అతను కష్టాలకూ, వ్యాధులకూ, వ్యధలకూ లోనైనప్పుడు... వాటిని సహనంతో ఎదుర్కొంటాడు. అది అతనికి శుభాన్ని చేకూరుస్తుంది అలాగే సుఖ సంపదలు వరించినప్పుడు కృతజ్ఞతతో మెలుగుతాడు. అది అతనికి శుభప్రదమవుతుంది’’ అని హదీస్‌ గ్రంథం చెబుతోంది. 

బిడ్డను కోల్పోయిన ఒక విశ్వాసి ‘‘మేమందరం అల్లాహ్‌ కోసం ఆయన వైపు మరలిపోవాల్సినవాళ్లమే! అంటూ తనకు అభివందనాలు అర్పించినట్టు... తన దూతల ద్వారా తెలుసుకున్న అల్లాహ్‌... 

తన దాసులలో ఒకరి బిడ్డ మరణించినప్పుడు...‘‘మీరు నా దాసుని బిడ్డ ప్రాణం తీశారా? అని తన దూతలను అల్లాహ్‌ అడుగుతారు. నా దాసుడి కోసం స్వర్గంలో ఒక ఇల్లు నిర్మించండి. దానికి కృతజ్ఞతా గృహం అని పేరు పెట్టండి’’ అని వారిని ఆదేశిస్తారు.

- మహమ్మద్‌ వహీదుద్దీన్‌


Updated Date - 2021-09-17T05:30:00+05:30 IST