మనో నాశమే మనో జయం

ABN , First Publish Date - 2020-03-19T08:40:50+05:30 IST

‘అర్జునా! మనస్సు నిగ్రహింపశక్యం కానిది, మిక్కిలి చంచలమైనది అనే విషయంలో సందేహం లేదు. అయినప్పటికీ ఆ మనసును అభ్యాస, వైరాగ్యాల చేత నిగ్రహించవచ్చు’ అని గీతాచార్యుడు...

మనో నాశమే మనో జయం

  • అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్‌
  • అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే


‘అర్జునా! మనస్సు నిగ్రహింపశక్యం కానిది, మిక్కిలి చంచలమైనది అనే విషయంలో సందేహం లేదు. అయినప్పటికీ ఆ మనసును అభ్యాస, వైరాగ్యాల చేత నిగ్రహించవచ్చు’ అని గీతాచార్యుడు చెప్పాడు. తలపే మనసు యొక్క స్వరూపం. తలంపును వదలి ఈ ప్రపంచంలో ఏ వస్తువూ వేరేగా లేదు. ఈ శరీరంలో ‘నేను’ అని భావించేది ఏదో అదే మనసు. మనసు లేనిది ప్రపంచమే లేదు. ‘మనసు వల్ల తలంపులు పుడుతున్నాయి. అలాంటి సందర్భాల్లో వెంటనే ‘నేనెవరు’ అనే విచారం చేయాలి. దానివల్లనే మనసు అణుగుతుంది. తలంపులు లేకపోతే మనసు ఆనందం అనుభవిస్తుంది’ అని భగవాన్‌ రమణులు చెప్పారు. మనసును చలింపజేసే అవలక్షణాలన్నింటినీ ఎప్పుడు మనం దూరం చేస్తామో.. అప్పుడు ఆ ఆనంద సాధనలో మార్గం సుగమమవుతుంది. చిత్తం నిశ్చలత్వం పొందితే సుఖదుఃఖాలకు అతీతంగా మేరు పర్వతం లాగా ఉంటుంది. దేహమెంత అశాశ్వతమో, దేహం ద్వారా అనుభవించే ఆనందాలు కూడా అంతే అశాశ్వతమైనవి. సూక్ష్మ స్వరూపమైన ప్రాణ, మనో, విజ్ఞానమయతత్వాన్ని స్థూలదేహంలో ఇమడ్చాలి. జీవిత తత్వాన్నే దైవతత్వంగా మార్చుకోగలగాలి. ‘‘విషయ సుఖాల పట్ల కొంచెమైనా సంబంధం పెట్టుకోని మనసు ఈశ్వరునిలో లీనమవుతుంది. అలాగే బంధం నుండి కూడా ఆత్మ విముక్తి పొందుతుంది. అందుకు విరుద్ధమైతే ఈశ్వరుని వద్దకు వెళ్లే దారికి అడ్డుపడే బంధాల్లో చిక్కుకుంటుంది’’ అని రామకృష్ణ పరమహంస చెప్పేవారు.


చాంచల్యం లేని మనసు ఎక్కడా కనిపించదు. అగ్నికి వేడి స్వాభావికమైనట్లు.. మనసుకు చపలత్వం స్వాభావికం. వాస్తవస్థితిలో మనసునకు వాసనయే స్వరూపం. మనోజయానికి ఉపాయంగా అభ్యాస, వైరాగ్యాలు చెప్పారు. చంచలమై ఉండే భావాలు చేసే సంకల్పాలకు మనం బద్ధులమై ఉన్నాం. పట్టుపురుగు తన లాలాజలాన్ని స్రవించి ఆ దారంతో ఒక ఆవరణాన్ని ఏర్పరచి దాంట్లో తానే బందీ అయ్యి.. అందులోంచి బయటకు వచ్చే ఉపాయం లేక లోపల చిక్కుపడిపోయినట్లు మనసు కూడా తన నుంచి పుట్టే సంకల్పాల వాసనలతో బంధింపబడుతోంది. దాన్నుంచి తప్పించుకోవాలంటే.. విషయభోగాలన్నీ నిస్సారమైనవి, దుఃఖరూపమైనవని తెలుసుకోవాలి. అప్పుడు మనసుకు వైరాగ్యం అలవడుతుంది. ఈ వివేక వైరాగ్యాలనే జ్యోతులు మనసులో వెలిగినప్పుడు మనసు అంతర్ముఖమై పరమాత్మయందు లీనమవుతుంది. అలాకాకుండా మనసు విషయభోగాల కోసం పాకులాడినంతకాలం ఆత్మదర్శనం లభించదు. ఆశ లేకపోవడమే మోక్షం. ఆశ కలిగి ఉండడం బంధం. ‘మనోనాశమే మనోజయం’. అభీష్ట వస్తువులను విడిచిపెట్టడం వల్లనే మనోజయం కలుగుతుంది.


మనసుకు సాక్షిగా ఉన్న చైతన్యాన్ని ధ్యానము చేస్తూ.. ‘‘అదే ‘నేను’, అదే సర్వజీవుల యందూ ఉంది. సమస్త నామరూపాలూ దాని స్వరూపాలే. అదే పరబ్రహ్మం అని నిశ్చయించుకుంటే హృదయం విశాలమవుతుంటుంది’’ అని యాజ్ఞవల్క్యుడు తన ధర్మపత్నికి ఉపదేశించాడు. ‘‘ఆత్మవారే ద్రష్టవ్య శ్రోత్రవ్యో మన్తనవ్యో నిధి ధ్యాసి తవః’’ ..ఆత్మయే దర్శింపతగింది, వినదగింది. ఆత్మ ఆనంద స్వరూపం. దాన్ని చూడడం, వినడం, ధ్యానం చేయడం ద్వారానే అన్నీ తెలుస్తాయి.

- మేఘశ్యామ (ఈమని), 83329 31376


Updated Date - 2020-03-19T08:40:50+05:30 IST