పిల్లలకు దూరంగా ఉండడం..భరించలేకపోయా

ABN , First Publish Date - 2020-08-15T09:11:46+05:30 IST

పెళ్లయి ఏడేళ్లయింది. ఇద్దరు పిల్లలున్నారు. బాబుకు ఐదేళ్లు, పాపకు మూడేళ్లు.

పిల్లలకు దూరంగా ఉండడం..భరించలేకపోయా

కరోనా నుంచి కోలుకున్న 

వ్యాపారి అనుభవం


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): పెళ్లయి ఏడేళ్లయింది. ఇద్దరు పిల్లలున్నారు. బాబుకు ఐదేళ్లు, పాపకు మూడేళ్లు. ఉమ్మడి కుటుంబం. ఎవరి పోర్షన్‌లో వారు ఉంటాము. అమ్మ, నాన్న, తమ్ముడు, అతడి భార్య కింది అంతస్తులో ఉంటారు. ఫస్ట్‌ఫ్లోర్‌లో నేను, నా భార్య, ఇద్దరు పిల్లలం ఉంటాము. అందరి పోర్షన్‌లు సువిశాలంగానే ఉన్నా.. వంట, తినడం ఒకేచోట. అంతా గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే. రాత్రి భోజనం కుటుంబమంతా కలిసి తినడం ఆచారం. ముగ్గురు అన్నదమ్ములం. నాన్నతో కలిసి అందరం వ్యాపారం చేస్తాం. కేటరింగ్‌తోపాటు ఫంక్షన్ల వంట సామగ్రికి సంబంధించిన హోల్‌సేల్‌ వ్యాపారం ఉంది.


లాక్‌డౌన్‌లో హాయిగా గడిపాం. లాక్‌డౌన్‌ తర్వాత ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. తిరిగి యథాతథంగా వ్యాపారాలు ప్రారంభం కావడం... నేను నా పాత్ర పోషించడం సాధారణమే. జూన్‌ 19న నాకు ఆకస్మికంగా వాంతులు ప్రారంభమయ్యాయి. క్రమంగా జ్వరం. పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్‌ రావడంతో ఐసొలేషన్‌లో ఉన్నాను. పిల్లలకు నాతో అటాచ్‌మెంట్‌ ఎక్కువ. గదిలో ఐసొలేషన్‌లో ఉన్న సమయంలో వారు రావడినికి ప్రయత్నిస్తే వారించడం ఇబ్బంది అనిపించేది. పిల్లలను చూడకుండా, వారిని టచ్‌ చేయకుండా మొత్తం 25 రోజులు గడిపాను. ఆ సమయంలో నాకు పాజిటివ్‌ వచ్చిందన్న బాధకన్నా.. పిల్లలకు దూరంగా ఉన్నాననే బాధ ఎక్కువ అనిపించేంది. జాగ్రత్తలు తీసుకోవడంతో కోలుకున్నాను. పరీక్ష చేస్తే నెగెటివ్‌ వచ్చింది. ఆసి్‌ఫనగర్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి (29) పిల్లలతో దూరంగా ఉంటూ... కరోనాను జయించిన అనుభవం తన మాటల్లో.. 


జూన్‌ 19న షాపులో ఉండగా..

పగటి పూట లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత చిన్నా, పెద్ద ఫంక్షన్లకు సంబంధించిన ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. నలుగురం బిజీ అయ్యాం. వ్యాపారంలో భాగంగా నేను  కౌంటర్‌ వద్ద ఎక్కువ సమయం ఉంటాను. జూన్‌ 19న షాపులో ఉండగానే కడుపులో తిప్పినట్లు కనిపించింది. వెంటనే ఇంటికి వెళ్లాను. వరుసగా రెండుసార్లు వాంతులు అయ్యాయి. ఏమీ తినాలనిపించలేదు. నిద్రపోయే ప్రయత్నం చేసినా పట్టలేదు. రాత్రయ్యే సరికి శరీరం వేడెక్కింది. జ్వరం వస్తుందనే అనుమానాలు ఎక్కువయ్యాయి. నాన్నకు ఫోన్‌ చేసి విషయం చెప్పాను.


వెంటనే నాంపల్లిలో ఉన్న ఓ ఆస్పత్రికి కారులో తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మందులు ఇచ్చారు. తగ్గకపోమే మరుసటి రోజు రమ్మన్నారు. మరుసటి ఉదయం నుంచే ఒళ్లు నొప్పులు ప్రారంభమయ్యాయి. జ్వరం తగ్గలేదు. మఽధ్యాహ్నం నాన్న వచ్చి మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అనుమానంతో గంటసేపు పలు పరీక్షలు చేశారు. మరుసటిరోజు నాన్న వెళ్లి రిపోర్టులు తీసుకొచ్చారు. పాజిటివ్‌ వచ్చిందని.. భయపడవద్దని ధైర్యం చెప్పారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి డాక్టర్లు రాసిన మందులు తెప్పించారు. 


20 రోజులు గదిలోనే..

తన పోర్షన్‌లో అటాచ్‌ బాత్‌రూం ఉన్న గదిలో ఐసొలేషన్‌లో ఉన్నాను. అందరం కలిసి భోజనం చేసే పద్ధతిని తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. ఎవరి పోర్షన్‌లో వాళ్లే వండుకుని తినసాగారు. నా భార్య భోజనం వండి గది బయట వరకు తీసుకొచ్చి ఇచ్చేది. జూన్‌ 22న ఆరోగ్యం కాస్త కుదుటపడినట్లు అనిపించింది. జ్వరం పూర్తిగా తగ్గలేదు. నాకు కాస్త భయం అనిపించింది.


అమ్మ, నాన్నతోపాటు తమ్ముళ్లు తరచూ వీడియో కాల్‌ చేసి ధైర్యం చెప్పేవారు. జూన్‌ 26 నాటికి జ్వరం పూర్తిగా తగ్గింది. ఆకలి ఎక్కువైంది. రోజుకు నాలుగుసార్లు, కొన్ని సందర్భాల్లో ఐదుసార్లు కూడా తినేవాణ్ణి. నన్ను కలవడానికి పాప, బాబు పడే ఆరాటం కలిచివేసేది. వారు చేసే అల్లరి చూసి తట్టుకోలేకపోయా. గది బయట పిల్లలు ఉంటే.. గదిలోపల పది అడుగుల దూరంలో ఉండి చేతులు ఊపుతూ వారించేవాణ్ణి. ఈ పరిస్థితి నన్ను కలిచివేసింది. 

Updated Date - 2020-08-15T09:11:46+05:30 IST