జస్టిస్‌ ఈశ్వరయ్య వెనుక.. ఎవరున్నారో తేలాలి

ABN , First Publish Date - 2020-08-08T08:30:32+05:30 IST

న్యాయ వ్యవస్థను, న్యాయమూర్తులను కించపరిచేలా మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఈశ్వరయ్య చేసిన వ్యాఖ్యల వెనుక ఎవరున్నారో..

జస్టిస్‌ ఈశ్వరయ్య వెనుక.. ఎవరున్నారో తేలాలి

  • దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలి
  • ఆయన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థకు మచ్చ
  • ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోదేం?: కళా

అమరావతి, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): న్యాయ వ్యవస్థను, న్యాయమూర్తులను కించపరిచేలా మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఈశ్వరయ్య చేసిన వ్యాఖ్యల వెనుక ఎవరున్నారో.. ఆయనతో ఎవరు మాట్లాడిస్తున్నారో సమగ్ర దర్యాప్తు జరిపి తేల్చాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఎజెండాను, ఒక రాజకీయ పార్టీ ఎజెండాను జస్టిస్‌ ఈశ్వరయ్య మోస్తూ న్యాయవ్యవస్ధను కించపరుస్తున్నారని విమర్శించారు. ఒక ప్రభుత్వ విభాగానికి చైర్మన్‌గా ఉంటూ న్యాయ వ్యవస్ధను, రాజ్యాంగాన్ని ఆయన తూలనాడడం విచారకరమని, న్యాయవ్యవస్థ గౌరవానికి భంగకరంగా పరిణమించిన శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంద న్నారు. గతంలో న్యాయస్థానాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, చీఫ్‌ విప్‌, స్పీకర్‌ తప్పుడు వ్యాఖ్యలు చేశారని.. ఇప్పుడు న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తే న్యాయవ్యవస్థను తూలనాడడం ద్వారా దేశానికేం సంకేతం ఇస్తున్నారని ప్రశ్నించారు.


‘జస్టిస్‌ ఈశ్వరయ్య వ్యాఖ్యలు న్యాయవ్యవస్థకు మాయని మచ్చ. అధికారపక్షం తన రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ మసకబారేలా చేయడం దుర్మార్గం. స్వతంత్ర భారతంలో న్యాయవ్యవస్థ ఏనాడూ ఎదుర్కోని పరిణామాలు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయి. జస్టిస్‌ ఈశ్వరయ్య వ్యాఖ్యలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? న్యాయవ్యవస్థ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? స్వార్థ్ధపూరిత రాజకీయాల నుంచి న్యాయమూర్తులు, న్యాయవ్యవస్ధను కాపాడేందుకు బలమైన చర్యలు అవసరం’ అని ఆయన అభిప్రాయపడ్డారు. 


రాజధాని మార్పుపై తొందరెందుకు?

రాజధాని మార్పుపై కోర్టుల్లో విచారణ జరుగుతున్నప్పుడు అది తేలకుండానే మార్చాలని ప్రభుత్వం ఎందుకు హడావుడి చేస్తోందని కళా వెంకట్రావు ప్రశ్నించారు. దీనిపై ప్రజాభిప్రాయం సేకరించడానికి కూడా జగన్‌ ప్రభుత్వం ముందుకు రావడం లేదని, దాని భయానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. విచ్ఛిన్నకర విధానాలతో రాష్ట్రాన్ని వినాశనం వైపు నడిపించడం సరికాదని స్పష్టం చేశారు.

Updated Date - 2020-08-08T08:30:32+05:30 IST