వ్యూహాత్మకంగా హరీష్ రావత్ సీటు మార్పు

ABN , First Publish Date - 2022-01-29T00:04:15+05:30 IST

ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ ప్రచార కమిటీ చీఫ్ హరీష్ రావత్‌‌ సీటు విషయంలో మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రకటించిన ..

వ్యూహాత్మకంగా హరీష్ రావత్ సీటు మార్పు

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ ప్రచార కమిటీ చీఫ్ హరీష్ రావత్‌‌ సీటు విషయంలో మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రకటించిన రామ్‌నగర్ సీటు కాకుండా లాల్‌కువా నియోజవర్గం కేటాయించడం ద్వారా పార్టీ అధిష్ఠానం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పార్టీ నేతల మధ్య ఎలాంటి అసమ్మతులకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంది. తాజాగా విడుదల చేసిన 10 మంది అభ్యర్థుల జాబితాలో ఈ మార్పు చోటుచేసుకుంది. 70 మంది సభ్యుల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా హరీష్ రావత్ పగ్గాలు చేపడతారనే విస్తృత ప్రచారం ఉంది.


కాగా, రామ్‌నగర్ నియోజకవర్గం నుంచి లాల్‌కువా నియోజకవర్గానికి హరీష్ రావత్‌ సీటులో మార్పు చోటుచేసుకోవడంపై కాంగ్రెస్ రాష్ట్ర మీడియా ఇన్‌చార్జి రాజీవ్ మహర్షి మాట్లాడుతూ... ''లాల్‌కువాలో హరీష్‌కు మంచి ఛాన్సులు ఉన్నాయి. రామ్‌నగర్‌లోనూ ఆయన గెలుస్తారు. అయితే లాల్‌కువా ఆయనకు మరింత మంచి సీటు. అయితే రామ్‌నగర్ సీటును బలంగా కోరుకుంటున్న రంజిత్ రావత్‌కు గతంలో ఆయన పోటీచేసిన సాల్ట్ నియోజవర్గం ఇచ్చారు'' అని చెప్పారు. కాగా, టిక్కెట్ల పంపిణీ విషయంలో సీనియర్ నేతల మధ్య తలెత్తిన అసంతృప్తులను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ అధిష్ఠానం హరీష్ రావత్‌ సీటులో మార్పు చేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


హరీష్-రింజిత్ రావత్ మధ్య పోరు..!

ఈనెల 24న 11 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల చేసింది. రామ్‌నగర్ సీటు నుంచి హరీష్ రావత్ పేరు ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా వివాదం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రంజిత్ రావత్ బహిరంగంగానే ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. వేరే సీటును తాను సవాలుగా తీసుకుని పోటీ చేయవచ్చని, కానీ అందువల్ల వచ్చే నష్టం కూడా తోసిపుచ్చలేమని అన్నారు. ఒక వ్యక్తి సీటును చివరి నిమిషంలో మార్చడమంటే, ఈసారి అతనికి నెగ్గే ఛాన్స్ తక్కువ కాబట్టే మార్పు చోటుచేసుకుందనే అభిప్రాయాలకు తావివ్విచినట్టు అవుతుందని అన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత కూడా ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాల తలెత్తాయి.


రంజిత్ 1989లో సాల్ట్ ‌నియోజకవర్గం పంచాయతీ మెంబర్‌గా తన కెరీర్ ప్రారంభించారు. 2002, 2007లో సాల్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో జీనా నుంచి ఓడిపోయారు. 2017లో రామ్‌నగర్‌ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి దివాన్ సింగ్ బిష్ట్ చేతిలో ఓటమి పాలయ్యారు.



Updated Date - 2022-01-29T00:04:15+05:30 IST