గుట్టుగా Gambling.. స్వయాన మంత్రి కుమారుడి ప్రమేయం.. పోలీసుల వెనుకడుగు.. బేగంపేటలో అసలేం జరిగింది..!

ABN , First Publish Date - 2021-11-08T17:38:42+05:30 IST

పేకాట, గాంబ్లింగ్‌, జూదం పేరు ఏదైనా ఆట ఒక్కటే..

గుట్టుగా Gambling.. స్వయాన మంత్రి కుమారుడి ప్రమేయం.. పోలీసుల వెనుకడుగు.. బేగంపేటలో అసలేం జరిగింది..!

  • వెనుక పెద్దల హస్తం..?
  • ప్రజాప్రతినిధులు.. ప్రముఖులను తప్పించే యత్నం
  • నగరానికి చెందిన పెద్దలీడర్‌ ప్రమేయం? 
  • పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం..?


హైదరాబాద్‌ సిటీ/బేగంపేట : పేకాట, గాంబ్లింగ్‌, జూదం పేరు ఏదైనా ఆట ఒక్కటే.. నగరంలో కొందరు పెద్దల ఆశీస్సులతో గుట్టుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. వారం క్రితం నార్సింగ్‌లో చిక్కిన పేకాట రాయుళ్ల ఉదంతం మరవక ముందే బేగంపేటలో ఇదే తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. పెద్దస్థాయిలో సాగిన గ్యాంబ్లింగ్‌లో ప్రజాప్రతినిధులతోపాటు స్వయాన ఓ మంత్రి కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.


నిర్వాహకుడు బడా వ్యాపారి..

బేగంపేటలోని మోతీలాల్‌ నెహ్రూనగర్‌ మారుతీ బషీరా అపార్ట్‌మెంటులో ఈనెల 4న దీపావళి  సందర్భంగా అరవింద్‌ అగర్వాల్‌ అనే బడా వ్యాపారి ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిసింది. స్థానికుల ఫిర్యాదుతో బేగంపేట పోలీసులు, నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అర్ధరాత్రి సదరు అపార్ట్‌మెంటుపై దాడి చేశారు. పోలీసులను చూసిన సదరు నిర్వాహకుడు పరుష పదజాలంతో బెదిరించినట్లు సమాచారం. అక్కడ అధికార పార్టీకి చెందిన ముగ్గురు ప్రజా ప్రతినిధులు, సంపన్నులు, బడా వ్యాపారులు ఉండటంతో పోలీసులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎదురైనట్లు సమాచారం. విషయం నగరానికి చెందిన ఓ కీలక నేత వరకు వెళ్లడంతో ఆయన రంగంలోకి దిగి విషయం రచ్చ కాకుండా చూసినట్లు తెలిసింది. పోలీసులూ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.


పోలీసుల వెనకడుగు..?

భారీ స్థాయిలో జూదం నడుస్తోందని అందిన ఫిర్యాదు మేరకు హడావిడిగా పరుగెత్తిన పోలీసులు అదే వేగంతో వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నేతలు ఉండటంతో వారిని అక్కడ నుంచి పంపించి వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ భారీ ఎత్తున రూ. కోటిన్నరకు పైగా డబ్బు, 30 మందికి పైగా సభ్యులున్నప్పటికీ  కేవలం రూ.12లక్షల వరకు స్వాధీనం చేసుకుని, ఐదుగురిపై మాత్రమే కేసులు నమోదు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


500 వాటర్‌ బాటిళ్లు లభ్యం.. 

అపార్ట్‌మెంటుకు చెందిన అరవింద్‌ అగర్వాల్‌తోపాటు జాఫర్‌ యూసఫ్‌, సిద్ధార్థ అగర్వాల్‌, బి. సూర్యకాంత్‌, అబ్దుల్‌ అలీ జిలానీపై కేసులు నమోదు చేసి రూ. 12లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు దాడులు జరిపే సమయానికే అక్కడ ఉన్న కీలక వ్యక్తులు వెళ్లిపోగా, ఆ కేంద్రంలో 500 వాటర్‌ బాటిళ్లు కనిపించాయంటే... ఏ స్థాయిలో అక్కడ కార్యకలాపాలు జరిగాయో ఊహించవచ్చు. 


ఏం జరుగుతోంది..?

నార్సింగి ఘటన వెంటనే బేగంపేట్‌లో అంతకు మించిన స్థాయిలో పేకాటరాయుళ్లు చిక్కడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.  చర్యలు ప్రారంభించిన వెంటనే పెరుగుతున్న ఒత్తిడి, కేసులను తప్పించడానికి చేసే ప్రయత్నాలతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. నార్సింగ్‌ కేసులో ఇలాంటి ఒత్తిళ్లు రాగా, బేగంపేటలో మాత్రం అంతకు మించి పోలీసులపై ఒత్తిడి ఉందని సమాచారం. అసలు ఈ కేసు అందరిపై నమోదు చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

Updated Date - 2021-11-08T17:38:42+05:30 IST