కలెక్టరేట్‌ ప్రారంభంపై సందిగ్ధత

ABN , First Publish Date - 2022-05-21T04:49:10+05:30 IST

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌లకు శ్రీకారం చుట్టింది. అయితే ఐదున్నరేళ్ల కింద చేపట్టిన మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం పూర్తయినా ప్రారంభోత్సవ తేదీపై సందిగ్ధత నెలకొంది.

కలెక్టరేట్‌ ప్రారంభంపై సందిగ్ధత
తూంకుంట పరిధిలో నిర్మాణమైన మేడ్చల్‌ కలెక్టరేట్‌ సముదాయం

  • మే 15లోపే సీఎం ప్రారంభిస్తారని గతంలో అన్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
  • జూన్‌ 2నే సీఎం కేసీఆర్‌ ప్రారంభించే అవకాశాలున్నాయంటున్న అధికారులు

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌లకు శ్రీకారం చుట్టింది.  అయితే ఐదున్నరేళ్ల కింద చేపట్టిన మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం పూర్తయినా ప్రారంభోత్సవ తేదీపై సందిగ్ధత నెలకొంది. ఆరు నెలలుగా నేడు, రేపు అంటూ అధికారులు వాయిదా వేస్తున్నారు. మే 25, అలాగే రాష్ట్రావతరణ దినోత్సవమైన జూన్‌ 2న మంచి ఘడియలు ఉన్నాయని.. వాటిల్లో ఏదో ఒక రోజు సీఎం కేసీఆర్‌తో ప్రారంభింపజేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

మేడ్చల్‌, మే 20(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా కొత్త ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ సముదాయ ప్రారంభంపై సందిగ్దత నెలకొంది. కలెక్టరేట్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. తూంకుంట పరిధిలో నిర్మించిన కలెక్టరేట్‌ సముదాయాన్ని ఏప్రిల్‌ చివర వారంలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, అదనపు కలెక్టర్‌ నర్సింహారెడ్డి సందర్శించారు. మే 15కల్లా కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని ప్రకటించారు. మంత్రి చెప్పిన తేదీ దాటినా ఇంతవరకు కలెక్టరేట్‌ సముదాయం ప్రారంభించలేదు. కొత్త తేదీని ప్రకటించ లేదు. మరో పక్క మల్కాజ్‌గిరి ప్రాంతంలో కొనసాగుతున్న జిల్లా కోర్టును ప్రస్తుత కలెక్టరేట్‌ భవనంలోకి మార్చుతారన్న వార్తల నేపథ్యంలో జడ్జిలు, కోర్టు యంత్రాంగం రెండు సార్లు వచ్చి భవనాన్ని పరిశీలించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్‌ 2న కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారని, 12 లోపు అన్ని శాఖల కార్యాలయాలు కొత్త కలెక్టరేట్‌కు వెళ్తాయని ప్రచారం జరుగుతోంది. కొత్త కలెక్టరేట్‌లో వివిధ శాఖల విభాగాలను, కాంప్లెక్స్‌లను టీఎన్జీవో నాయకులు వచ్చి పరిశీలించారు. ఇదిలా ఉంటే మేడ్చల్‌ ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీష్‌ కూడా ఒకసారి కలెక్టరేట్‌ ప్రాంగణాన్ని పరిశీలించి పనులపై ప్రభుత్వానికి నివేదిక పంపారు.


  • ఐదున్నరేళ్లలో నిర్మాణం

మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టరేట్‌ భవన నిర్మాణానికి 2017 అక్టోబరు 11న శంకుస్థాపన చేశారు. శంకుస్థాపనలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, అప్పటి ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నిర్మాణం పూర్తవడానికి ఐదున్నరేళ్లు పట్టింది. ఇదిలా కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవానికి కాలం జరుపుతున్నారు. 40ఎకరాల్లో రూ.40కోట్లతో నిర్మించిన కలెక్టరేట్‌ ప్రారంభాన్ని ఆరు నెలలుగా ఆదిగో ఇదిగో అంటూ దాటవేస్తున్నారు. కీసరలో అద్దె భవనంలో కొనసాగుతున్న కలెక్టరేట్‌కు రావడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వసతులూ అంతంత మాత్రంగానే ఉన్నాయి. మరో పక్క ‘ఎ’బ్లాక్‌లో కలెక్టర్‌, ‘బి’బ్లాక్‌ మరిన్ని కార్యాలయాలుండడంతో పర్యవేక్షణ కష్టమైందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఈ నెల 25న, జూన్‌ 2న శాస్ర్తోక్తంగా మంచి రోజులున్నాయని, ఈ రెండింటిలో ఏదో ఒక రోజు కొత్త కలెక్టరేట్‌ ప్రారంభం అవుతుందని కొందరు అధికారులు అంతర్గతంగా పేర్కొంటున్నారు. ఇప్పటికే కొత్త కలెక్టరేట్‌ పక్కన నిర్మించిన భవనంలో ఓ గదిని ఈవీఎంలు భద్రపరిచేందుకని ఎన్నికల కమిషన్‌ అధికారులు హ్యాండోవర్‌ చేసుకున్నారు. కలెక్టరేట్‌ భవనం ప్రారంభంపై రోజుకో రకమైన చర్చ జరుగుతోంది. ఏదేమైనా రానున్న 15 నుంచి ఇరవై రోజుల్లో కలెక్టరేట్‌ ప్రారంభం ఖాయంగా కన్పిస్తోంది.

Updated Date - 2022-05-21T04:49:10+05:30 IST