రవాణా సేవలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-06-02T08:56:24+05:30 IST

జిల్లావ్యాప్తంగా రవాణా సేవలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్షలు రాయటానికి ఉదయాన్నే

రవాణా సేవలు ప్రారంభం

తొలిరోజు 35 మంది ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్షలకు హాజరు 


ఆంధ్రజ్యోతి, విజయవాడ : జిల్లావ్యాప్తంగా రవాణా సేవలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్షలు రాయటానికి ఉదయాన్నే అభ్యర్థులు రవాణా కార్యాలయాలకు చేరుకున్నారు. చేతులు శానిటైజ్‌ చేసుకుని, ముఖానికి మాస్క్‌ పెట్టుకున్న వారిని మాత్రమే అనుమతించారు. కార్యాలయం బయట టచ్‌ ఫ్రీ శానిటైజర్‌ను ఏర్పాటుచేశారు. ఆరోగ్య సేతు యాప్‌ ఉంటేనే కార్యాలయంలోకి అనుమతిస్తామని చెప్పారు. యాప్‌ లేనివారి ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేయించిన తర్వాతే ముందుకు పంపారు. ప్రధాన ద్వారం దగ్గర సెక్యూరిటీ సిబ్బంది సందర్శకులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు.


భౌతిక దూరం పాటించమని చెబుతూ పరీక్షా కేంద్రంలోకి పంపారు. గతంలో ఒకేసారి 10 నుంచి 15 మంది వరకు కంప్యూటర్ల ముందు కూర్చుని పరీక్షలు రాసేవారు. సోమవారం మాత్రం ఒక్కొక్కరినే అనుమతించారు. ఉద్యోగుల విషయంలో కూడా రవాణా శాఖ తగిన జాగ్రత్తలు తీసుకుంది. కార్యాలయంలో ఫ్రంట్‌ లైన్‌ సిబ్బంది ఫేస్‌ మాస్క్‌లు ధరించి విధినిర్వహణలో పాలు పంచుకున్నారు. ఉద్యోగులంతా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. కార్యాలయంలోనూ, పరిసర ప్రాంతాల్లో క్యూమిగేషన్‌ చేపట్టారు. టచింగ్‌ పాయింట్లను శానిటైజర్‌తో తరచూ శుభ్రం చేయించారు. 


30 శాతం మందికే అనుమతి

విజయవాడతో పాటు మచిలీపట్నం, గుడివాడ, నందిగామ, జగ్గయ్యపేట, ఉయ్యూరు, నూజివీడు రవాణా శాఖ కార్యాలయాల్లోనూ కేవలం 30 శాతం మందికే స్లాట్‌ బుకింగ్‌కు అనుమతించారు. విజయవాడ కార్యాలయంలో సోమవారం 35 మంది అభ్యర్థులు ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్షలో పాల్గొన్నారు. గతంలో రోజూ 110 మంది స్లాట్‌ బుకింగ్‌ చేసుకునేవారు. కొవిడ్‌ కారణంగా 30 శాతం మంది మాత్రమే స్లాట్‌ బుకింగ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. 

Updated Date - 2020-06-02T08:56:24+05:30 IST