మూడు నెలలైనా గడవకముందే..

ABN , First Publish Date - 2021-12-01T06:02:03+05:30 IST

మూడు నెలలైనా గడవక ముందే మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు చిక్కారు.

మూడు నెలలైనా గడవకముందే..
ఏసీబీకి చిక్కిన అధికారి శంకర్‌ కుమార్‌, పక్కన ప్రైవేట్‌ వ్యక్తి మల్లికార్జున్‌

- ఏసీబీకి చిక్కిన మరో అవినీతి అధికారి

- నిన్న సీపీవో.. నేడు ఇన్‌చార్జి కమిషనర్‌, ఆర్డీవో

- రూ. లక్ష లంచం తీసుకుంటుండగా పట్టివేత

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

మూడు నెలలైనా గడవక ముందే మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు చిక్కారు. రెండు మాసాల క్రితం రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తి నుంచి జిల్లా ప్రణాళిక అధికారి రూ.40వేల లంచం తీసుకుంటూ పట్టుబడగా, తాజాగా మరో అధికారి రూ. లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడడం అధికార వర్గాల్లో కలకలం రేపుతున్నది. రెండు మాసాల క్రితం రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా ఉన్న ఉదయ్‌ కుమార్‌ బదిలీపై వెళ్లగా, ఆయన స్థానంలో పెద్దపల్లి ఆర్‌డీవో కుడికాల శంకర్‌ కుమార్‌కు రామగుండం కమిషనర్‌గా ప్రభుత్వం పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించింది. అక్కడ, ఇక్కడ రెండుచోట్ల విధులు నిర్వహిస్తున్న శంకర్‌కుమార్‌ రామగుండం మున్సిపల్‌ పరిధిలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు, వివిధ పనులకు, తదితర బిల్లుల చెల్లింపుల్లో చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పెండింగులో ఉన్న ఫైళ్లను క్లియరెన్స్‌ చేసేందుకు కూడా పెద్దఎత్తున డబ్బులు వసూలు చేశాడని ఆరోపణలున్నాయి. కరోనా సమయంలో వైరస్‌ నిర్మూలన కోసం హెడ్రోక్లోరైడ్‌ పిచికారి చేసిన దానికి అయిన ఖర్చు రూ. 9,28,796 బిల్లును కాంట్రాక్టర్‌ గైక్వాడ్‌ రంజిత్‌ కుమార్‌కు చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లుల చెల్లించేందుకు లక్ష రూపాయలు కావాలని కమిషనర్‌ డిమాండ్‌ చేయడంతో ఆ డబ్బులు ఇచ్చేందుకు కాంట్రాక్టర్‌ సిద్ధమై డబ్బులు తీసుకుని మధ్యాహ్నం 3:30 గంటలకు పెద్దపల్లి ఆర్‌డీవో కార్యాలయానికి చేరుకుని ఆర్‌డీవోతో మాట్లాడారు. డబ్బును తోట మల్లికార్జున్‌ అనే వ్యక్తికి ఇవ్వాలంటూ చెప్పడంతో అతడికి లక్ష ఇచ్చాడు. తర్వాత మల్లికార్జున్‌ డబ్బులు తీసుకవెళ్లి ఆర్‌డీవోకు ఇస్తుండగా ఏసీబీ డీఎస్సీ భద్రయ్య ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 4వ తేదీన రామగుండంలో సీఎం ప్రత్యేక నిధి ద్వారా చేపట్టిన పనుల బిల్లుల చెల్లింపునకు తిరుపతి అనే కాంట్రాక్టర్‌ నుంచి రూ.40 వేలు తీసుకుంటుండగా జిల్లా ప్రణాళిక అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మూడు నెలలైనా గడవముందే అదే మున్సిపల్‌ కాంట్రాక్టర్లు ఇన్‌చార్జీ కమిషనర్‌ను పట్టించడం గమనార్హం.

ప్రైవేట్‌ వ్యక్తి ద్వారా వసూళ్లు..

రామగుండం ఇన్‌చార్జీ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న పెద్దపల్లి ఆర్‌డీవో శంకర్‌ కుమార్‌ ఒక ప్రైవేట్‌ వ్యక్తిని పెట్టుకుని వసూళ్లు చేస్తున్నారు. హన్మకొండలోని ఏనుగులగుట్టకు చెందిన తోట మల్లికార్జున్‌ రెండు మాసాలుగా ఆర్‌డీవో వెంట ఉంటున్నారని సమాచారం. పనుల బిల్లుల చెల్లింపులు, రెవెన్యూపరమైన పనులను చక్కబెట్టేందుకు లంచాల రూపేణా పుచ్చుకునే సొమ్మును మధ్యవర్తి ద్వారా తీసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్నికొన్ని సందర్భాల్లో ఆయనే నేరుగా డబ్బులు తీసుకుంటారని తెలిసింది. రెండేళ్ల క్రితం ఇక్కడికి ఆర్‌డీవోగా వచ్చిన శంకర్‌ కుమార్‌ను అప్పటి జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన విధుల్లో చేర్చుకోలేదు. ఆయన హుస్నాబాద్‌లో ఆర్‌డీవోగా పనిచేసిన సమయంలోనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా ముంపునకు గురైన భూముల పరిహారం చెల్లింపు, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ విషయంలో పెద్దఎత్తున డబ్బులు దండుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్‌ ఉప్పల్‌లో ఆస్తులు కూడబెట్టారని సమాచారం. పెద్దపల్లికి ఆర్‌డీవోగా వచ్చిన తర్వాత కూడా ధరణి వెబ్‌సైట్‌ రాకముందు భూప్రక్షాళనలో భూముల సర్వేనంబర్ల చేర్పులు, మార్పుల గురించి కూడా డబ్బులు వసూలు చేశారని తెలుస్తున్నది. ధరణి వచ్చిన తర్వాత ఆర్‌డీవోగా రెవెన్యూపరంగా పెద్దగా పనులు లేకపోవడంతో ప్రభుత్వం ఆయనకు రామగుండం కార్పొరేషన్‌ కమిషనర్‌ బాధ్యతలను అప్పగించింది. దీంతో శంకర్‌కుమార్‌ ప్రైవేట్‌ వ్యక్తిని పెట్టుకుని వసూళ్లకు పూనుకోవడం గమనార్హం. బిల్లు డబ్బుల కోసం తిరిగితిరిగి విసిగిపోయిన ఒక కాంట్రాక్టర్‌ అవినీతి నిరోధక శాఖాధికారులను కలిసి ఆర్డీవోను పట్టించడం చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2021-12-01T06:02:03+05:30 IST