అంతకు ముందు.. ఆ తర్వాత..!

ABN , First Publish Date - 2022-08-11T05:41:26+05:30 IST

బదిలీపై అలా వెళ్లి.. ఇలా వచ్చిన డాక్టరమ్మ గురించి అనంత పెద్దాసుపత్రి, మెడికల్‌ కాలేజీలో చర్చ మొదలైంది.

అంతకు ముందు.. ఆ తర్వాత..!

తిరిగి వచ్చిన డాక్టరమ్మపై చర్చ 

బంధువు ఎమ్మెల్యే అయ్యాకనే రచ్చ

అనంతపురం టౌన ఆగస్టు 10: బదిలీపై అలా వెళ్లి.. ఇలా వచ్చిన డాక్టరమ్మ గురించి అనంత పెద్దాసుపత్రి, మెడికల్‌ కాలేజీలో చర్చ మొదలైంది. ఆమె మొదట్లో ఎలా ఉండేవారు, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎలా మారిపోయారో గుర్తు చేసుకుంటున్నారు. ఆమె పేరు చెబితే అనంత వైద్యకళాశాలలో హడలెత్తిపోతారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకి సమీప బంధువు అయిన ఆమె.. చాలా సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్నారు. మొదట్లో చాలా బాగా పనిచేసేవారు. అందరి వద్ద మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీరు మారిందని అంటున్నారు. తన బావ ఎమ్మెల్యే కావడం, మంత్రి పదవి చేపట్టడంతో ఆ డాక్టరమ్మలో మార్పు వచ్చిందని ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి. ‘ఆమెకు నచ్చినప్పుడు వస్తారు. పోవాలనుకుంటే వెళ్ళిపోతుంటారు. సమయపాలన గురించి పట్టించుకోరు. అధికారులకు తెలిసినా తెలియనట్లు ఉండిపోతున్నారు..’ ఇదీ.. ఆమె గురించి ఆస్పత్రి వర్గాల మాట. ఏదైనా సంఘటన జరిగినా, అందులో ఆమె పాత్ర ఉన్నా లేనేలేదని అధికారులు తేల్చేస్తున్నారని, ఆమెకు అండగా నిలుస్తున్నారని సమాచారం. అందుకే ఆమె బదిలీపై వెళ్లి.. వెంటనే తిరిగి వచ్చేసినా ఎవరూ బహిరంగంగా నోరు మెదపడానికి సాహసించడం లేదన్న ప్రచారం జరుగుతోంది. 


అప్పుడూ తప్పించేశారు..

2019లో ఆ డాక్టరమ్మ బ్లడ్‌ బ్యాంక్‌ డ్యూటీలో ఉండేవారు. ఆ సమయంలో తాడిపత్రికి చెందిన ఓ బాలింతకు పంపిన రక్తం మారింది. ఈ కారణంగా ఇన్ఫెక్షన అయి బాలింత మృతి చెందింది. అప్పట్లో ఈ ఘటన పెద్ద దుమారం రేపింది. అధికారుల నిర్లక్ష్యంపై ఆంధ్రజ్యోతిలో పెద్దఎత్తున కథనాలు ప్రచురితమయ్యాయి. ముఖ్యమంత్రి, వైద్యశాఖ మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సీరియస్‌ అయ్యారు. దీంతో అప్పటి కలెక్టర్‌ గంధం చంద్రుడు జిల్లా ఆస్పత్రికి వచ్చి ప్రత్యేక విచారణ చేపట్టారు. అప్పట్లో నిబంధనలను కఠినంగా అమలు చేస్తారని పేరున్న అనంత నగరపాలిక కమిషనర్‌ ప్రశాంతిని  విచారణ అధికారిగా నియమించారు. ఆమె చేపట్టిన విచారణ కూడా తేలిపోయింది. ఆ రోజు ఆ డాక్టరమ్మ డ్యూటీలో ఉన్నా, ఆ రక్తం పరీక్షించి పంపించినా, ఆమెకు.. జరిగిన ఘటనకు సంబంధం లేదని తేల్చారు. అప్పట్లో డాక్టరమ్మ బంధువు మంత్రిగా ఉన్నారు. అందుకే ఆమెను తప్పించారన్న ఆరోపణలు వచ్చాయి. చివరకు బ్లడ్‌ బ్యాంక్‌ ఇనచార్జి డాక్టర్‌ శివకుమార్‌, ఆ రోజు ఇనచార్జి ఆర్‌ఎంఓగా ఉన్న వైద్యుడిని బాధ్యుడిగా చేసి, సస్పెండ్‌ చేశారు. ఆయనతో పాటు ఓ మహిళా డాక్టర్‌, ఇద్దరు స్టాఫ్‌ నర్సులు, ఒక ల్యాబ్‌ టెక్నీషియనను సస్పెండ్‌ చేశారు. డ్యూటీలో ఉన్న ఆ డాక్టరమ్మను వదిలేసి, ఒకేసారి ఐదుగురిని బాధ్యులను చేసి సస్పెండ్‌ చేయడం అప్పట్లో విమర్శలకు తావిచ్చింది. అప్పట్లో సస్పెండ్‌ అయిన డాక్టర్‌ శివకుమార్‌ కోర్టుకు వెళ్లి పోరాటం సాగించారు. ఆ తర్వాత మిగిలిన వారి సస్పెన్షనలను అధికారులు ఎత్తివేస్తూ వచ్చారు. చివరకు విచారణలో ఎవరిదీ తప్పులేదని తేల్చి, చర్యలు లేకుండా అధికారులు తుస్సుమనిపించారు. 

Updated Date - 2022-08-11T05:41:26+05:30 IST