హక్కులకై గళమెత్తే ముందు బాధ్యతల ఆత్మపరిశీలన తప్పదు!

ABN , First Publish Date - 2021-04-16T05:42:28+05:30 IST

భారత రాజ్యాంగం రచించినప్పుడు అందులో పౌరులకు అనేక హక్కులు కల్పించిన పెద్దలు, వారికి బాధ్యతలనేమీ నిర్దేశించలేదు....

హక్కులకై గళమెత్తే ముందు బాధ్యతల ఆత్మపరిశీలన తప్పదు!

భారత రాజ్యాంగం రచించినప్పుడు అందులో పౌరులకు అనేక హక్కులు కల్పించిన పెద్దలు, వారికి బాధ్యతలనేమీ నిర్దేశించలేదు. దానికి కారణం జాతీయోద్యమ ప్రభావం మూలంగా ప్రజల్లో ప్రజాస్వామిక స్ఫూర్తి, బాధ్యతాయుతమైన ప్రవృత్తి వేళ్ళూనుకున్నాయనే విశ్వాసం కావచ్చు. తదనంతరం 1976లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పౌరులకు పలు బాధ్యతలను నిర్దేశించింది. 


పౌరులు హక్కులకై గళమెత్తే ముందు తమ బాధ్యతలను తాము సక్రమంగా నిర్వర్తిస్తున్నామో లేదోనని ఆత్మపరిశీలన చేసుకోవడం అవసరం. బౌద్ధులకు పంచశీల, క్రైస్తవులకు టెన్ కమాండ్మెంట్స్ ఎలాంటివో ప్రతి భారత పౌరునికి రాజ్యాంగంలో నిర్దేశింపబడ్డ పదకొండు ప్రాథమిక బాధ్యతలు అలాంటివి. రాజ్యాంగ నిర్దేశం ప్రకారం ప్రతి భారత పౌరుడు ఘనమైన భారత సంస్కృతిని గౌరవించాలి, దాన్ని పరిరక్షించాలి. కానీ నేడు భారతీయ సమాజంలో కులమతాల పట్ల ఉన్న అనురక్తి, గౌరవం, భాషా సంస్కృతుల పట్ల కొరవడుతుంది. నేటి అత్యాధునిక సాంకేతిక యుగంలో కూడా మూఢనమ్మకాలు, సంకుచితత్వాలు రాజ్యమేలుతున్నాయంటే, ప్రజలు విజ్ఞానశాస్త్ర స్ఫూర్తి, మానవవాద దృక్పథం, హేతువాద దృష్టి అలవరచుకోలేదనేగా? ఇది రాజ్యాంగ రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం. దేశంలో కులమత వైషమ్యాలను చూస్తుంటే రాజ్యాంగం ప్రవచించిన సర్వమానవ సౌభ్రాతృత్వం అపహాస్యం పాలవుతుందనేది సుస్పష్టం. ప్రకృతి వనరుల పరిరక్షణ విషయంలో పౌరసమాజం నిర్లిప్తంగా ఉంటుంది. స్త్రీలపై అత్యాచారాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందని మేడిపండు చందాన తయారయ్యాయి. జాతీయోద్యమ స్ఫూర్తి, ఉద్యమ కాలంలో గాంధీజీ నాయకత్వంలో విడుదలైన నైతిక శక్తుల ప్రభావం నేడు రాజకీయ నాయకులపైనే కాదు, పౌర సమాజంపైన కూడా కొరవడింది.  


భారత దేశ పౌరులందరూ రాజ్యాంగ స్పూర్తిని నరనరాల్లో నింపుకుని, ప్రాథమిక బాధ్యతలను నిర్వర్తిస్తూ, నిజమైన ప్రజాస్వామికవాదులైన నాడే రాజ్యాంగ నిర్మాతకు, జాతిపితకు అసలైన నివాళి అర్పించినట్లు. ఆ దిశగా ప్రజలను చైతన్యవంతులను చేయడానికి మేధావులు, విద్యావంతులు కృషి చేయాలి.

గౌరాబత్తిన కుమార్ బాబు

Updated Date - 2021-04-16T05:42:28+05:30 IST