Abn logo
Aug 8 2020 @ 01:41AM

బీరూట్‌ విషాదం!

లెబనాన్‌ రాజధాని బీరూట్‌లో మంగళవారం జరిగిన ఘోర ప్రమాదం పంచాన్ని కలచివేసింది. రెండు భారీ పేలుళ్ళతో రాజధాని నగరం మూడువంతులకుపైగా నాశనమైపోయిన దృశ్యాలు నిర్ఘాంతపరిచాయి. అధికార వ్యవస్థల నిర్లక్ష్యాలు ఎంతటి వినాశనాన్ని సృష్టిస్తాయో అన్ని దేశాలూ ప్రత్యక్షంగా చూశాయి. ప్రకృతి వైపరీత్యాలో, శత్రుదాడులో బీరూట్‌ విధ్వంసానికి కారణం కాదు. ఆరేళ్ళుగా అక్కడి ఓడరేవులో నిల్వచేసివున్న రెండువేల ఏడు వందల టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ ఒక్కసారిగా పేలి, 150మంది మరణానికి కారణమైంది. ఈ దుర్ఘటనలో ఐదువేలమంది క్షతగాత్రులైనారు, లక్షలాదిమంది నిలువనీడ కోల్పోయారు. అంతర్యుద్ధాలను, మిసైల్‌ దాడులను సైతం తట్టుకొని నిలిచిన భవంతులు పేకమేడలా కుప్పకూలిపోయాయి. పేలుడు శబ్దాలు 250కిలోమీటర్ల వరకూ వినిపించాయి. పేలుళ్ళ వెనుక కుట్ర కూడా ఉండవచ్చును కానీ, సులువుగా భగ్గుమనే ఒక ప్రమాదకర రసాయనాన్ని ఏళ్ళపాటు గోడౌన్‌లో నిర్లక్ష్యంగా వదిలేయడం క్షమార్హం కాని నేరం.


బీరూట్‌ ఘటనతో చెన్నైలోనూ కలకలం రేగింది. చెన్నై గిడ్డంగుల్లోనూ ఏడువందల టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ నిల్వలు ఐదేళ్ళుగా ఉన్నాయన్న విమర్శలు రేగడంతో అధికారులు హడావుడి పడ్డారు. శివకాశీలోని ఒక బాణాసంచా తయారీ సంస్థ దక్షిణ కొరియానుంచి దీనిని దిగుమతి చేసుకుంటే, కోర్టు వివాదంలో చిక్కుకుని చివరకు గోడౌన్‌లో చేరింది. మొన్న నవంబరులోనే కోర్టు తీర్పు వచ్చిందనీ, త్వరలోనే దీనిని వేలం వేస్తామని అధికారులు చెబుతున్నారు. ఐదేళ్ళక్రితం నాటి వరదల్లో కొంత సరుకు పాడైపోగా, మిగతా నిల్వలు సురక్షితంగానే ఉన్నాయని అధికారులు భరోసా ఇస్తున్నారు. బీరూట్‌ అయినా చెన్నై అయినా కథ ఒక్కటే. వ్యవసాయం నుంచి ఉగ్రవాద దాడుల వరకూ వివిధ గ్రేడ్లను బట్టి ఉపయోగపడే ఈ పదార్థాన్ని వేరే అవసరాల పేరిట దిగుమతులు చేసుకోవడం, అవి పోర్టు తనిఖీల్లో పట్టుబడి, కేసుల్లో చిక్కుకొని అక్కడే ఉండిపోవడం జరుగుతున్నదే. బీరూట్‌లో పోగుబడిన నిల్వలు రష్యాకు చెందిన ఓ వ్యాపారివనీ, అతడు వేరే అవసరం చూపించి, ప్రమాదకర గ్రేడ్‌ను దిగుమతి చేసుకుంటే, సరుకు లెబనాన్‌ అధికారులకు చిక్కిందని అంటారు. మొజాంబిక్‌లో మైనింగ్‌ పేలుళ్ళకోసం నిర్దేశించిన ఈ పదార్థం మార్గమధ్యంలో ఇక్కడ చిక్కుబడిందన్న వాదనా ఉన్నది. కారణం ఏదైనప్పటికీ, సులువుగా మండే ఒక రసాయనం ఏళ్ళతరబడి తమ దగ్గర మగ్గుతున్నదని పోర్టు అధికారులందరికీ తెలుసు. కోర్టు వివాదాల్లో చిక్కుబడి, పరిష్కరించలేని స్థితి ఉన్నప్పటికీ, అది సురక్షితంగా ఉన్నదీ లేనిదీ ఎప్పటికప్పుడు తనిఖీ చేయవలసిన బాధ్యత వారిపై ఉన్నది. 


బీరూట్‌ ప్రమాదం తీవ్రత ఊహకు అందనిది. డెబ్బయ్‌ ఐదేళ్ళ నాటి హీరోషిమా, నాగసాకి విషాదాన్ని యావత్‌ ప్రపంచమూ గుర్తుచేసుకుంటున్న సందర్భంలో, దాదాపు అదే రకమైన దృశ్యాలతో, ఒక అణువిస్ఫోటనం మాదిరిగా ఈ ఘటన జరిగింది. రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం, ఆహారకొరత, కరోనా మహమ్మారి దేశాన్ని కుదిపేస్తున్న తరుణంలో లెబనాన్‌కు అదనంగా కష్టం వచ్చిపడింది. పదిలక్షలమంది సిరియా శరణార్ధులు లెబనాన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఆహారపదార్ధాల దిగుమతికి అత్యంత కీలకమైన పోర్టు నాశనమైపోవడంతో ఆహారసంక్షోభం తప్పదని భయపడుతున్నారు. ప్రజా ఉద్యమాల కారణంగా సాద్‌ ప్రభుత్వం రాజీనామా చేసి ఆర్నెల్ల క్రితమే అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. విభిన్నమతాల నాయకుల మధ్య అధికార పంపకం జరిగినప్పటికీ, పరస్పర కుట్రల్లో భాగంగానే ఈ విస్ఫోటనం జరిగిందని కొందరి విశ్లేషణ. అమెరికా అధ్యక్షుడు ఇది ప్రమాదం కాదని అంటున్నారు. ఇజ్రాయెల్‌, లెబనాన్‌ సరిహద్దుల్లో ఇటీవల వాతావరణం బాగా వేడెక్కింది. హిజ్బొల్లా చొరబాటు యత్నాన్ని భగ్నం చేశానని ఇజ్రాయెల్‌ ప్రకటించిన నేపథ్యంలో దానిపైనా అనుమానాలున్నాయి. కానీ, ఈ విస్ఫోటనంలో తన పాత్ర ఏమీ లేదని ఇజ్రాయెల్‌ చెబుతున్నది. ఇంతటి విధ్వసంలోనూ సాగుతున్న రాజకీయాలను అటుంచితే, వేలాది మంది క్షతగాత్రులను, లక్షలమంది నిరాశ్రయులను ఆదుకోవడం అంతర్జాతీయ సమాజం బాధ్యత. బీరూట్‌ దుర్ఘటననుంచి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం ఉన్నది. అమ్మోనియం నైట్రేట్‌ వంటి ప్రమాదకర రసాయనాల ఎగుమతి దిగుమతులు జరిగే ప్రాంతాల్లో మరిన్ని భద్రతాచర్యలు చేపట్టడం అవసరం.

Advertisement
Advertisement
Advertisement