బీరు.. జోరు!

ABN , First Publish Date - 2022-05-09T07:24:26+05:30 IST

జిల్లాలో మండిపోతున్న ఎండలకు బీరు అమ్మకాలు జోరందున్నాయి. ఎండ తాపం నుంచి ఉపశమనం పొందేందుకు మద్యం ప్రియులు చిల్డ్‌ బీర్లను ఆశ్ర యించడంతో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అసలే వేసవి కాలం.. అందులో భగ్గు మంటున్న ఎండలు కావడంతో ఒకవైపు జనం గుక్కెడు

బీరు.. జోరు!
అమ్మేందుకు సిద్ధంగా ఉంచిన బీర్లు

మండిపోతున్న ఎండల తాపానికి.. పెరిగిన బీర్ల అమ్మకాలు

ఏప్రిల్‌ నెలలోనే రెండింతలు పెరిగిన సేల్స్‌

కరోనా తగ్గుముఖం పట్టడంతో బీర్‌ కోసం ఎగబడుతున్న మందుబాబులు

సిండికేట్‌ పేరుతో కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు

చోద్యం చూస్తున్న ఎక్సైజ్‌ శాఖ అధికారులు

ఆదిలాబాద్‌ డిపో పరిధిలో  మొత్తం 119 వైన్‌ షాపులు ఉండగా, 21 బార్లు

ఆదిలాబాద్‌, మే 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మండిపోతున్న ఎండలకు బీరు అమ్మకాలు జోరందున్నాయి. ఎండ తాపం నుంచి ఉపశమనం పొందేందుకు మద్యం ప్రియులు చిల్డ్‌ బీర్లను ఆశ్ర యించడంతో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అసలే వేసవి కాలం.. అందులో భగ్గు మంటున్న ఎండలు కావడంతో ఒకవైపు జనం గుక్కెడు నీటి కోసం అల్లాడుతుంటే.. మరోవైపు చల్లని బీర్ల కోసం మందుబాబులు ఎగబడడం గమనార్హం. జిల్లాలో గత వారం రోజులుగా 45 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉదయం నుంచే మద్యం షాపులు తెరువగానే బీర్ల కోసం పరుగులు పెడుతున్నారు. వేసవి కాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇతర రకాల మద్యాన్ని పక్కన పెట్టి ఎక్కువగా బీర్లనే కొనుగోలు చేయడంతో వాటికి విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. చల్లదనం కోసం బీరును ఆశ్రయిస్తున్న మందుబాబుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఆదిలాబాద్‌(ఐఎంఎల్‌) డిపో పరిధిలో ఉన్న నిర్మల్‌, ఆదిలాబాద్‌, భైంసా, ఉట్నూర్‌, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, ఇచ్చోడ సర్కిళ్లలో గతేడు ఏప్రిల్‌ మాసంలో 1.23 లక్షల ఐఎంఎల్‌ కేసులు, 70 వేల 655 కేసుల బీర్లు అమ్మకాలు జరుపగా.. రూ.85.39 కోట్ల ఆదాయం వచ్చింది. అదే ఈ యేడు ఏప్రిల్‌ మాసంలో లిక్కర్‌ 1.06 లక్షల కేసులు, లక్షా 44వేల 141 బీర్‌ కేసులు అమ్మకాలు జరుపగా రూ.86.71 కోట్ల ఆదా యం సమకూరింది. ఆదాయంలో పెద్దగా తేడా లేక పోయినా.. బీర్‌ అమ్మకాల్లో మాత్రం భారీ తేడా కనిపిస్తోంది. ఆదిలాబాద్‌ డిపో పరిధిలో మొత్తం 119 వైన్‌ షాపులు ఉండగా 21బార్లు ఉన్నాయి. అలాగే అనా ధికారికంగా వందల సంఖ్యలో బెల్ట్‌ షాపులు, దాబా హోటళ్లలో విచ్చల విడిగా బీర్ల విక్రయాలు జరుగుతున్నాయి. అయితే పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అంతటా బీరు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మే మాసంలోనూ మరింతగా బీర్‌ అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

తగ్గిన బీర్ల సరఫరా

మండిపోతున్న ఎండలకు బీర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోవడం తో  సరఫరా కూడా భారీగానే తగ్గిపోయింది. దీంతో డిపో అధికారులు వైన్స్‌ల వారీగా సమాన ప్రాతిపదికన సరఫరా చేస్తున్నారు. రెండు, మూడు రోజులకోసారి బీర్‌ బాటిళ్లు సరఫరా కావడంతో మద్యం వ్యాపారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కొన్ని రకాల మినీ బీర్ల కొరత కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇదే అదునుగా కొందరు వ్యాపారులు సిండికేటుగా మారి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. రోజురోజుకు పెరిగి పోతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని బీర్‌ కేసులను అక్రమంగా గోదాంలలో నిల్వ చేస్తూ అధిక ధరలకు  అమ్మేందుకు వ్యాపారులు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లోనైతే ఒక్కో బీర్‌ వెనుక రూ.10 నుంచి రూ.20 వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. చేసేదేమీ లేక మందుబాబులు అడిగినంత చెల్లిస్తూ చల్లని బీర్‌ కోసం అర్రులు చాస్తున్నారు. వ్యాపారుల సిండికేటు ఆధిపత్యానికి ఎక్సైజ్‌ శాఖాధికారులు తలొగ్గుతున్నట్లు విమర్శలు కూడా వస్తున్నాయి. కనీస స్థాయిలో కూడా తనిఖీలు నిర్వహించకుండా.. పరోక్షంగా వ్యాపారులకు వత్తాసు పలుకు తున్నట్లు వినిపిస్తుంది. కాగా బీరు విక్రయాలు పెరుగడంతో విస్కీ వంటి ఇతర మద్యం విక్రయాలు గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టాయి. బెల్ట్‌షాపుల్లో మాత్రం విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నా.. అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడం విడ్డూరం.

తగ్గుముఖం పట్టిన కరోనా

ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో మందుబాబులు మళ్లీ బీర్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. గత రెండు మూడేళ్లుగా కరోనా వైరస్‌ విజృంభించడంతో బీర్‌ జోలికి మందు బాబులు వెళ్లలేక పోయారు. దీంతో గతేడు వరకు బీర్‌ అమ్మకాలు అంతంతమాత్రంగానే కనిపించాయి. ఈ యేడు వేసవిలో మాత్రం ఊహించని రీతిలో బీర్‌ అమ్మకాలు ఊపందుకున్నాయి. గతేడు ఏప్రిల్‌ మాసంలో 70వేల 655 బీర్‌ కేసుల విక్రయాలు జరుపగా.. ఈ యేడు ఏప్రిల్‌ మాసంలో రెండింతలు పెరిగి లక్షా 44వేల 141 బీర్‌ కేసులు విక్రయాలు జరిపినట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తుంది. కరోనా సమయంలో చల్లని బీర్‌ తాగితే జలుబు, శ్వాస సంబంధిత వ్యాధులు తలెత్తుతాయన్న భయంతో మద్యం ప్రియలు బీర్‌ జోలికి వెళ్లలేదు. దీంతో భారీగా సేల్స్‌ పడిపోయాయి. కాని ప్రస్తుతం పూర్తిగా కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడం, మండిపోతున్న ఎండల తాపానికి లిక్కర్‌ను పక్కన పెట్టి చల్లని బీరుతోనే సరిపెట్టుకుంటున్నారు.

అధిక రేటుకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం

: శ్రీనివాస్‌, ఎక్సైజ్‌ సీఐ, ఆదిలాబాద్‌

వేసవి కావడంతో బీర్‌ అమ్మకాలు ఊపందుకున్నాయి. వ్యాపారులు మాత్రం ఎమ్మార్పీ రేటుకే అమ్మకాలు జరపాలి. కొరతను సృష్టించి అధిక ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటాం. తరచూ వైన్‌షాపులను తనిఖీచేస్తున్నాం. ఎక్కడైనా అధిక ధరలకు అమ్మినట్లు తెలిస్తే మా దృష్టికి తీసుకు రావాలి. ఈ యేడు కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో గతేడు కంటే భారీగా బీర్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. 

Read more