ఆపదలో వున్నది!

ABN , First Publish Date - 2021-07-29T04:57:59+05:30 IST

‘ఆ గది అంతా రక్తపుధారలు. గోడకు వేలాడదీసిన వేలాది కిలోల మాంసం ముక్కలు. చెంతనే బావిలో తెగిపడిన పశువుల తలలు. బయట మాంసం తరలించేందుకు బారులుదీరిన వాహనాలు’..ఇవీ రణస్థలం మండల కేంద్రంలోని ఓ పశువధ శాల వద్ద నిత్యం కనిపించే దృశ్యాలు. జాతీయ రహదారి చెంతనే కొన్నేళ్లుగా గుట్టుగా సాగుతున్న వ్యవహారం ఇటీవల శ్రుతి మించుతోంది. సమీప నివాసితులకు అసౌకర్యం కలిగిస్తూ.. నిత్యం పదుల సంఖ్యలో ఆవులను వధించి.. మాంసాన్ని విక్రయిస్తున్నారు. జిల్లాలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వీటి ‘మూగ’ రోదనను పట్టించుకున్న నాథులే కరువయ్యారు.

ఆపదలో వున్నది!
ఆవుమాంసాన్ని వేలాడదీస్తున్న దృశ్యం

రణస్థలంలో నిబంధనలకు విరుద్ధంగా పశు వధ

హైవే పక్కనే యథేచ్ఛగా గో మాంసం విక్రయాలు

స్థానికులకు ఇబ్బందులు

పట్టించుకోని అధికారులు

(రణస్థలం)

‘ఆ గది అంతా రక్తపుధారలు. గోడకు వేలాడదీసిన వేలాది కిలోల మాంసం ముక్కలు. చెంతనే బావిలో తెగిపడిన పశువుల తలలు. బయట మాంసం తరలించేందుకు బారులుదీరిన వాహనాలు’..ఇవీ రణస్థలం మండల కేంద్రంలోని ఓ పశువధ శాల వద్ద నిత్యం కనిపించే దృశ్యాలు. జాతీయ రహదారి చెంతనే కొన్నేళ్లుగా గుట్టుగా సాగుతున్న వ్యవహారం ఇటీవల శ్రుతి మించుతోంది. సమీప నివాసితులకు అసౌకర్యం కలిగిస్తూ.. నిత్యం పదుల సంఖ్యలో ఆవులను వధించి.. మాంసాన్ని విక్రయిస్తున్నారు. జిల్లాలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వీటి ‘మూగ’ రోదనను పట్టించుకున్న నాథులే కరువయ్యారు. 

...............................................

రణస్థలంలో మూగజీవాల రోదన.. స్థానికుల్లో తీరని ఆవేదనను నింపుతున్నాయి. రణస్థలంలో కొన్నాళ్ల కిందట కొందరు వ్యక్తులు పశు మాంసం విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బయటనుంచి తెచ్చిన మాంసాన్ని ఇక్కడ విక్రయించేవారు. గతంతో పోల్చుకుంటే పశు మాంసం విక్రయాలు  పెరిగాయి. కోడి, మేక, గొర్రెపోతు మాంసం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పశు మాంసం కిలో రూ.150కే లభిస్తుండడంతో చాలామంది దీనిపై మొగ్గు చూపుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నిర్వాహకులు వారపు సంతల నుంచి నేరుగా పశువులను ఇక్కడకు తెచ్చి వధించి మాంసం విక్రయిస్తున్నారు. పశు మాంసాన్ని డోర్‌ డెలివరీ కూడా చేస్తున్నారు. మంగళ, శుక్ర, ఆదివారాల్లో ఇక్కడి నుంచి వేలాది కిలోల మాంసం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రధానంగా సోమవారం బుడుమూరు సంత, శుక్రవారం కందివలస సంతల నుంచి ఇక్కడకు పశువులను తెస్తున్నారు. టెక్కలి డివిజన్‌లోని ప్రధాన సంతల నుంచి చీకటిమార్గాల్లో పశువులను కబేళాలకు తీసుకొస్తున్నారనే  ఆరోపణలున్నాయి. ప్రస్తుతం రూ.లక్షల్లో ఆదాయం సమకూరి.. వ్యాపారం పెరగడంతో దన్నానపేట సమీపంలోని ఓ శిథిల భవనంలో మరో గోవధ శాలను తెరిచారు. అక్కడ వారానికి పదుల సంఖ్యలో గోవులను వధిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ పశు వధ కారణంగా స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు. 


 కానరాని అనుమతులు

పశువధ శాల నిర్వహణకు 2003 గోవధ చట్టం ప్రకారం అనుమతులు తీసుకోవాలి. కానీ ఇక్కడ నిబంధనలు అమలవుతున్న దాఖలాలు లేవు. ఇష్టారాజ్యంగా పశువుల గొంతులను కోస్తున్నారు. సమీపంలోని బావిలో తలలను నిల్వ చేస్తున్నారు. అక్కడకు వెళ్తే భరించలేని దుర్వాసన. గోవధ శాలతో అసౌకర్యం కలుగుతున్నా, నిర్వాహకులకు భయపడి స్థానికులు ఫిర్యాదు చేయలేకపోతున్నారు. పశు మాంసం వ్యాపారం రాకెట్‌లా విస్తరిస్తున్నా నియంత్రించలేని స్థితిలో అధికారులు ఉన్నారు. హైవే పక్కన ఈ తతంగం జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. గతంలో రాష్ట్ర సాధు పరిషత్‌ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానందతో పాటు బీజేపీ నేతలు, పశు ప్రేమికులు నేరుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. నిర్వాహకుల నుంచి కాసులకు ఆశపడో.. లేదంటే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గడం వల్లనో అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 


 ప్రజారోగ్యానికి భంగం

శ్రీకాకుళం నగరంతో పాటు మిగతా పట్టణాల్లో కూడా గోమాంస విక్రయం ఓ లాభసాటి వ్యాపారంగా మారిపోయింది. ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి నుంచే వ్యాపారం సాగిస్తున్నారు. పెంపకం మాటున గోవులతో పాటు దూడలను కొనుగోలు చేస్తున్నారు. డెయిరీ నిర్వహిస్తున్నామంటూ నమ్మబలుకుతున్నారు. కొద్దిరోజుల తరువాత గోవధ శాలకు తరలిస్తున్నారు. మాంసాన్ని కొన్ని  హోటళ్లు, హైవే దాబాలకు నేరుగా పంపిణీ చేస్తున్నారు. మేక, గొర్రెపోతు మాంసంతో కలిపి వంటలు చేసి విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ప్రజారోగ్యానికి భంగం కలిగేలా కొందరు హోటళ్ల నిర్వాహకులు వ్యవహరిస్తున్నా, ఆహార కల్తీ నియంత్రణ శాఖ నిర్లక్ష్యం వహిస్తోంది.   


ఇళ్లలో వండించి

శ్రీకాకుళ ంలోని బలగ, బొందిలీపురం, శివారు కాలనీల్ల్లోని కొన్నిచోట్ల టీ దుకాణాల ముసుగులో పశుమాంసాన్ని వండించి... కబేళా నిర్వాహకులు హోటళ్లకు సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం కొంతమందితో ప్రత్యేకంగా ఒప్పందం కుదుర్చుకొని...నెలనెలా రూ.వేలల్లో చెల్లిస్తున్నట్టు సమాచారం.


భరించలేకపోతున్నాం

కొన్నేళ్లుగా ఇక్కడ పశు వధ సాగిస్తున్నారు. నిత్యం దుర్వాసనతో భరించలేకపోతున్నామని అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదు. పశువుల అరుపులు ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.

- భారతి, రణస్థలం


ఉద్యమిస్తాం

గో వధ మహా పాపం. గోవు విశ్వానికే తల్లి. పర్యావరణాన్ని రక్షిస్తుంది. ఆవును పూజిస్తే సర్వదేవతలను పూజించినట్టే. ఎక్కడైతే వధిస్తారో ఆ ప్రాంతంలో ఉపద్రవాలు వస్తాయి. ఇప్పటికైనా ఇక్కడ గో వధను నిలిపివేయాలి. గతంలో ఫిర్యాదుచేసినా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పటికైనా స్పందించకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తాం. 

-స్వామి శ్రీనివాసానంద, రాష్ట్ర సాధుపరిషత్‌ అధ్యక్షుడు


చర్యలు తీసుకుంటాం 

నిబంధనలకు విరుద్ధంగా గోవధ శాలను నిర్వహించడం నేరం. నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే హైవేపై పశువుల తరలింపుపై నిఘా పెంచాం. రాత్రిపూట కూడా తనిఖీలు చేస్తున్నాం.

-రాజేష్‌, ఎస్‌ఐ, జేఆర్‌పురం

Updated Date - 2021-07-29T04:57:59+05:30 IST