బీ అలర్ట్‌!

ABN , First Publish Date - 2022-01-20T04:27:03+05:30 IST

బీ అలర్ట్‌!

బీ అలర్ట్‌!
సమావేశంలో మాట్లాడుతున్న చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి

  • కొవిడ్‌ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయండి
  • ప్రజలను అప్రమత్తం చేసి కొవిడ్‌ పరీక్షలు పెంచండి
  • జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి 
  • అభివృద్ధి, ప్రజాసమస్యలపై జిల్లా స్థాయి సంఘాల సమీక్ష

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి):  వికారాబాద్‌ జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకూ శరవేగంగా పెరుగుతున్నాయని, రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జిల్లాయంత్రాంగం, వైద్యాధికారులు అప్రమత్తమై కొవిడ్‌ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతామహేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం జడ్పీ కార్యాలయంలో జరిగిన జడ్పీ స్థాయి సంఘాల సమావేశాల్లో వివిధ శాఖల పనితీరు, ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై ఆమె కమిటీల సభ్యులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న ఈ సమయంలో ప్రతి పీహెచ్‌సీ, ప్రభుత్వాసుపత్రుల్లో కొవిడ్‌ పరీక్షలు ఎక్కువ సంఖ్యలో నిర్వహించాలన్నారు. వృద్ధ్దులందరూ బూస్టర్‌ డోస్‌ తీసుకునేలా చూడాలని వైద్యాధికారులకు సూచించారు. కరోనా కారణంగా పాఠశాలలు మళ్లీ మూతపడడంతో విద్యార్థులను ఆన్‌లైన్‌ తరగతులకు సంసిద్ధం చేయాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ఉపాధి పథకం నిధులతో గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టవచ్చని, జిల్లా పరిషత్తు నుంచి పల్లెల అభివృద్ధికి అధికప్రాధాన్యం ఇస్తున్నామని ఆమె చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ సమగ్రాభివృద్ధికి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలన్నారు.  పనుల్లో జాప్యం జరగకుండా ఇంజినీరింగ్‌ ఽఅధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్బిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. అన్ని పీహెచ్‌సీల్లో వైద్య సదుపాయాలు మెరుగు పరచాలని, అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీడీలు కట్టిన రైతులకు వెంటనే ట్రాన్స్‌ఫార్మర్‌, స్తంభాలు అందజేయాలని ట్రాన్స్‌కో అధికారులకు సూచించారు. ధరణి సమస్యలు ఇంకా పరిష్కారం కాక రైతులు  కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నారని పలువురు సభ్యులు ఈ సందర్భంగా సమావేశం దృష్టికి తీసుకు రాగా,  దీనిపై మరోసారి  కలెక్టర్‌కు సూచిస్తామని చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సాధారణ నిధులను గతంలో మంజూరు చేసిన పనులకు కేటాయించాలని నిర్ణయించారు. జిల్లాలో 1,766 పనులు మంజూరు కాగా, వాటిలో 1200 పనులు పూర్తయ్యాయని, మరికొన్ని ప్రగతిలో ఉన్నాయని చైర్‌పర్సన్‌ చెప్పారు. అంతకు ముందు జడ్పీ వైస్‌ చైర్మన్‌ విజయకుమార్‌ అధ్యక్షతన వ్యవసాయం స్థాయి సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు వద్దన్నా వరి సాగు చేస్తున్నారని, వారికి ప్రత్యామ్నాయ పంటల సాగు పట్ల చైతన్యపరచాలని సూచించారు. సమీకృత వ్యవసాయం లాభసాటిగా ఉంటుందనే విషయం రైతులకు తెలియజేయాలని ఆయన చెప్పారు. అనంతరం మహిళా శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమంపై ఆ స్థాయి సంఘాల చైర్‌పర్సన్లు సుజాత, చౌహాన్‌ అరుణ దేషు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశాల్లో జడ్పీటీసీలు నాగిరెడ్డి, సంధ్యారాణి, సంతోష, హరిప్రియ, మంజుల, మధుకర్‌, రాందా్‌సనాయక్‌, మహిపాల్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-20T04:27:03+05:30 IST