పడకల్లేక పాట్లు!

ABN , First Publish Date - 2021-05-09T08:15:34+05:30 IST

‘మూడు గంటల్లోపు బెడ్‌ ఇవ్వాల్సిందే. బెడ్‌ ఇచ్చి తీరాల్సిందే! దీనికి తిరుగులేదు. నా మాటే శాసనం’... ఇది ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాట! కానీ..

పడకల్లేక పాట్లు!

ఆస్పత్రుల ఎదుట వాహనాల్లో పడిగాపులు

104కు కాల్‌ చేసినా ఫలితం శూన్యం

ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ అదే దృశ్యం

లక్షలు కడతామన్నా దొరకని పడకలు

ఆక్సిజన్‌ కొరత భయంతో చేర్చుకోని వైనం

‘టెస్ట్‌-ఫలితం’ తేలేలోగా పరిస్థితి ‘సీరియస్‌’

సాధారణం నుంచి ‘ఆక్సిజన్‌ బెడ్‌’ అవసరం

టెస్ట్‌ ఫలితం వచ్చేలోపు తిరిగేస్తున్న జనం

కుటుంబ సభ్యులకు, బయటి వారికీ వైరస్‌


బెడ్డు కోసం వేచి చూసి.. భార్య ఒడిలోనే కన్నుమూసి.. 

విజయవాడ ఆటోనగర్‌కు చెందిన సత్యనారాయణ కరోనా బాధితుడు. శ్వాస తీసుకోవడం కష్టం కావడంతో... ఆయన భార్య శనివారం ఉదయం 10.30 గంటలకు కొత్త ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో బెడ్లు ఖాళీ లేవని సిబ్బంది చెప్పారు. ఏం చేయాలో దిక్కుతోచలేదు. క్యాజువాలిటీ వద్ద మెట్ల మీదే భర్తను ఒడిలోపెట్టుకుని సపర్యలు చేశారు. ఊపిరి అందక ఇబ్బంది పడుతూ ఉదయం 11.30 గంటలకు సత్యనారాయణ కన్నుమూశారు. 

- విజయవాడ, ఆంధ్రజ్యోతి


పడక దొరికి ఉంటే...

శ్వాస తీసుకోలేక సతమతమవుతున్న ఒక మహిళను బంధువులు విజయవాడలోని స్టేట్‌ కొవిడ్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పడకలు లేకపోవడంతో ఆమె గంటకుపైగా ఆస్పత్రి ఆవరణలోనే, ఆటోలోనే ఎదురు చూస్తూ... కన్నుమూసింది. ఆమెకు వెంటనే పడక దొరికి, ఆక్సిజన్‌తోపాటు చికిత్స మొదలుపెట్టి ఉంటే... బతికేదేమో!


సమయానుకూలంగా..

ఇది అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి. పడకలు పూర్తిగా నిండిపోవడంతో... ఇలా ఆరుబయటే షెడ్లలో బెడ్లు వేసి చికిత్స అందిస్తున్నారు. అక్కడే ఆక్సిజన్‌ కూడా ఇస్తున్నారు. ఎక్స్‌రే మిషన్‌ కూడా బయటికి తెచ్చి బాధితులకు పరీక్షలు చేస్తున్నారు. అలా అన్ని ఆస్పత్రుల్లో తాత్కాలిక షెడ్లు, పడకలు ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.


(అమరావతి - ఆంధ్రజ్యోతి) 

‘మూడు గంటల్లోపు బెడ్‌ ఇవ్వాల్సిందే. బెడ్‌ ఇచ్చి తీరాల్సిందే! దీనికి తిరుగులేదు. నా మాటే శాసనం’... ఇది ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాట! కానీ... క్షేత్రస్థాయిలోకి వెళితే, ‘బెడ్‌ ప్లీజ్‌’ అంటూ కరోనా బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆక్సిజన్‌ సిలిండర్‌తో ఆస్పత్రుల బయటే ఎదురుచూస్తున్నారు. 3 గంటలు కాదు కదా... 30 గంటలు దాటినా పడకలు అందుబాటులో లేక... వేచి చూస్తున్న వాహనాల్లోనే కన్ను మూస్తున్న విషాద ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉన్నా... ‘‘అంతా బ్రహ్మాండం... 104కు కాల్‌ చేస్తే 3 గంటల్లో పడక లభ్యం’ అంటూ ప్రభుత్వం తీపి కబుర్లు చెబుతోంది. 104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసినా ఫలితం శూన్యం. కాల్‌ సెంటర్‌ చెప్పిన విధంగా ఎక్కడా బెడ్స్‌ అందుబాటులో లేవు. కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేస్తే ఆన్‌లైన్‌లో చూసి,   పలానా చోట బెడ్స్‌ ఉన్నాయని చెబుతున్నారు. బాధితులు సదరు ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత... ‘పడకల్లేవు. అన్నీ ఫుల్‌’ అనే సమాధానం వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి. ప్రభుత్వ పెద్దలు, ఆరోగ్యశాఖ అధికారులు ప్రెస్‌మీట్‌లలో ఊదరగొడుతున్నంత సులువుగా క్షేత్రస్థాయిలో బెడ్స్‌ దొరకడం లేదు. 


ప్రైవేటులోనూ అంతే... 

ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా సేమ్‌ సీన్‌ రిపీట్‌ అవుతోంది. బెడ్‌ ఇచ్చి, వైద్యం మొదలుపెడితే చాలు, ఖర్చు ఎంతైనా ఫర్వాలేదని చెప్పినా.. ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల బాధితులతో వచ్చిన అంబులెన్సులను ఆస్పత్రి ఆవరణలోకి కూడా రానివ్వడం లేదు. ఆక్సిజన్‌ కొరత నేపథ్యంలో పేషంట్లను చేర్చుకోవడానికి ఆస్పత్రి నిర్వాహకులు వెనక్కి తగ్గుతున్నారు. బాధితులను చేర్చుకుని వారి ప్రాణాలు గాలిలో పెట్టడం కంటే... చేర్చుకోకపోవడమే మేలని కొన్ని యాజమాన్యాలు భావిస్తున్నాయి.


తొలి అడుగులోనే తడబాటు

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ భీకరంగా వస్తుందని ముందే హెచ్చరికలు వెలువడ్డాయి. సుమారు నెలన్నరగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయినప్పటికీ పరిస్థితి తీవ్రతను ఎదుర్కొనేందుకు తగిన సన్నద్ధత రాష్ట్రంలో కనిపించలేదు. కరోనా కట్టడిలో కీలకమైన మొదటిఅడుగు... టెస్టింగ్‌! చకచకా పరీక్ష చేసి, 24గంటల్లో ఫలితాలు ఇవ్వగలిగితే... వెంటనే బాధితులు చికిత్స చేయించుకోవడం మొదలుపెడతారు. కానీ... ఇప్పుడు టెస్టులు ఎక్కడ చేస్తారో తెలియదు! పరీక్ష చేయించుకోవడానికే రెండు రోజులు! తర్వాత ఫలితం రావడానికి ఒక్కరోజు నుంచి 5రోజులవరకు ఎంత సమయమైనా పట్టొచ్చు. అప్పటిదాకా బాధితులు ‘ఫలితం’ కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో... హోంఐసొలేషన్‌తో నయమయ్యే కరోనాకు ఆస్పత్రిదాకా వెళ్లాల్సి వస్తోంది. రిపోర్టు వచ్చే వరకూ బాధితులు బయట తిరగడం మరింత ప్రమాదకరంగా మారింది. ‘‘టెస్ట్‌ ఫలితం వచ్చే దాకా బయట తిరగకూడదు. ఇంట్లో కూడా మాస్క్‌ పెట్టుకుని, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి’’ అనే స్పృహ చాలామందిలో కనిపించడంలేదు. దీంతో కుటుంబ సభ్యులకూ వైరస్‌ సోకుతోంది. ఇలా పాజిటివ్‌ వ్యక్తి తనతోపాటు కుటుంబ సభ్యులకు, బయటి వారికి వైరస్‌ సోకిస్తున్నాడు. ఇక కొందరు జాగ్రత్తపరులు ముందుగానే ఆస్పత్రిలో చేరదామంటే ఎవ్వరూ చేర్చుకోవడం లేదు. ప్రభుత్వాసుపత్రుల్లో పాజిటివ్‌ రిపోర్టు కావాల్సిందే. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే... లక్షణాలు ఉన్నాయి కాబట్టి జనరల్‌ వార్డులో చేర్చుకోలేమని తేల్చిచెబుతున్నాయి. గతంలో లక్షణాలున్న వారిని క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించేవారు. అక్కడ పాజిటివ్‌ వస్తే ఐసొలేషన్‌ సెంటర్‌కు పంపించేవారు. ఇప్పుడు అలాంటివి ఏవీ లేవు. ప్రభుత్వమే హోం ఐసోలేషన్‌ను ప్రోత్సహిస్తోంది. తద్వారా... వైరస్‌ వ్యాప్తికి మరింత ‘సహకారం’ అందిస్తోంది.


పడకల సంఖ్య పెంచేదెలా.... 

టెస్టింగ్‌లో వేగంపెంచి, యుద్ధ ప్రాతిపదికన పడకలు పెంచాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అనంతపురం, తిరుపతి వంటి కొన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఆరుబయట షెడ్లలోనూ పడకలు ఏర్పాటు చేసి బాధితులకు అక్కడే చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీ స్థలం అందుబాటులో ఉంది. వాటిలో యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక షెడ్లు నిర్మించి పడకలు ఏర్పాటు చేస్తే... పరిస్థితి కొంత అదుపులోకి వస్తుందని చెబుతున్నారు. ‘జర్మన్‌ హ్యాంగర్ల’ టెంట్లు వేస్తామని ప్రభుత్వం చెప్పినా... అందుకు మరో నాలుగైదు వారాలు పడుతుందట! ఇప్పుడు అంత సమయం లేదు! చకచకా స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులతో షెడ్లు ఏర్పాటు చేసుకోవడమే ఉత్తమం! 


104 మాట విని వెళితే...

కృష్ణా జిల్లా గన్నవరం మండలం అజ్జంపూడికి చెందిన రంగమ్మ (40)కు కరోనా సోకింది. శనివారం ఉదయం 104కు కాల్‌ చేయగా... చిన్నఅవుట్లపల్లి పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రిలో బెడ్‌ ఉంది, అక్కడికి వెళ్లండి అని సూచించారు. తీరా అక్కడికి వెళితే... ‘పడకలు ఖాళీ లేవు’ అని అక్కడి సిబ్బంది చెప్పారు. తిరిగి 104కు కాల్‌ చేయగా, స్టేట్‌ కంట్రోల్‌ ఆఫీసర్‌కు ఫోన్‌ చేయాలని చెప్పారు. ఆ నెంబర్‌ ఎంతకీ పనిచేయలేదు. ‘ఇప్పుడే రెండు గంటలు వేచి చూశాం. ఇక మా వల్ల కాదు’ అంటూ 108 అంబులెన్స్‌ డ్రైవర్‌ రంగమ్మను రోడ్డుపైనే వదిలేసి వెళ్లిపోయాడు.


ఫలితం వెంటనే వచ్చి ఉంటే...

కృష్ణా జిల్లా కలిదిండి మండలం చినతాడినాడకు చెందిన రాంబాబు (63) ఈనెల 4వ తేదీన కరోనా పరీక్ష చేయించుకున్నారు. శుక్రవారం వరకు ఫలితాలు రాలేదు. ఈలోపు శ్వాస తీసుకోవడంలో సమస్య తలెత్తింది. ఆస్పత్రికి తీసుకెళుతుండగానే... రాంబాబు మరణించారు. 24 గంటల్లోనే ఫలితాలు వచ్చి... చికిత్స మొదలుపెట్టి ఉంటే, బహుశా ఈ మరణం జరిగేది కాదేమో!  


హోం ఐసొలేషన్‌తో కొత్త ప్రమాదం

రిపోర్టులో పాజిటివ్‌ వస్తే హోం ఐసోలేషన్‌లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సీసీసీ సెంటర్లు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి 104 కాల్‌ సెంటర్‌కు, లేదా ఏఎన్‌ఎంకు ఫోన్‌ చేసినా హోం ఐసొలేషన్‌ కిట్స్‌ సరిగా ఇవ్వడం లేదు. దీంతో చాలామంది వైద్యులను సంప్రదించి వారిచ్చిన మందులు వాడుతున్నారు. ఎవరు పడితే వారు ‘కరోనాకు ఇదీ చికిత్స’ అంటూ వాట్స్‌పలో పోస్టులు పెట్టడమూ ప్రమాదకరంగా మారింది. హోం ఐసొలేషన్‌లో ఉన్న వారు చివరి క్షణం వరకూ వారికి వచ్చే ప్రమాదాన్ని అంచనా వేయలేకపోతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తగానే ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య పెరగడంతో... ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్లకు కొరత ఏర్పడుతోంది.

Updated Date - 2021-05-09T08:15:34+05:30 IST