బేరాలు.. బెదిరింపులు

ABN , First Publish Date - 2021-03-04T06:33:37+05:30 IST

ఈ నెల 10న జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం పూర్తయింది.

బేరాలు.. బెదిరింపులు
గార్లపాడు బస్టాండ్‌ సెంటర్‌లో ఆందోళన చేస్తున్న టీడీపీ, జనసేన, సీపీఐ నాయకులతోపాటు 6,25 వార్డుల అభ్యర్థులు

పురాల్లోనూ అధికార దౌర్జన్యాలు

నామినేషన్‌ ఉపసంహరణల్లో వైసీపీ ఒత్తిళ్లు

పిడుగురాళ్లలో టీడీపీ విత్‌ డ్రాలతో ఏకగ్రీవం

ఏకగ్రీవాలతో మాచర్ల, పిడుగురాళ్లలో ఎన్నికలు లేవు

ఫోర్జరీ సంతకాలిచ్చారని సత్తెనపల్లి, చిలకలూరిపేటల్లో అభ్యర్థుల ఆందోళన

జిల్లాలో ముగిసిన మున్సిపల్‌ నామినేషన్ల ఉపసంహరణ పర్వం


కేసులని కొందరిని.. నగదు పేరిట మరికొందరిపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు. దీంతో ఎలాగైనా ఏకగ్రీవాలు చేసుకోవాలన్న వైసీపీ నేతల పంతం నెగ్గింది. బుధవారంతో మున్సిపాలిటీల నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసింది. పైకి అంతా ప్రశాంతంగా జరిగినట్లు ఉన్నా.. ఎక్కడికక్కడ వైసీపీ నాయకులు బేరాలు.. బెదిరింపులకు ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు లొంగాల్సి వచ్చింది. జిల్లాలో 290 వార్డులకు 85 వార్డులు ఏకగ్రీవమైనట్లు అధికారులు బుధవారం సాయంత్రం ప్రకటించారు. ఏకగ్రీవమైన వార్డులన్నీ కూడా వైసీపీవే కావడం విశేషం. ఇక పిడుగురాళ్ల, మాచర్లలో వైసీపీకి ఎదురు నిలిచేవారు లేక పోవడంతో ఇక్కడ వార్డులన్నీ ఏకగ్రీవమయ్యాయి. ఇక్కడ మున్సిపల్‌ చైర్మన్ల ఎన్నిక లాంఛనమైంది.


(ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌) 

ఈ నెల 10న జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం పూర్తయింది. పైకి అంతా ప్రశాంతంగా జరిగినట్లు ఉన్నా.. ఎక్కడికక్కడ వైసీపీ నాయకులు రంగంలోకి దిగి తమకు పోటీగా ఉన్న వారి చేత నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెచ్చినట్లు సమాచారం.  పురపాలక పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే ఆశతో వైసీపీ అన్నిదారులను అవకాశంగా చేసుకుంది. మున్సిపల్‌ ఎన్నికలకు రీ నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచే ఏకగ్రీవాలపై వైసీపీ దృష్టి సారించింది. అయినా నామినేషన్లను ఉపసంహరించేందుకు మొండికేసిన వారికి సంబంధించి వివిధ అంశాలను సేకరించి ఆ పరంగా వారిపై ఒత్తిళ్లు తెచ్చారు. కేసులని కొందరిని.. వ్యాపారాలను దెబ్బతీస్తామని మరికొందరిని.. బెదిరించారు. మరికొందరికి రూ.లక్షల్లో నగదు ముట్టజెప్పి నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేశారు. ఈ రెండింటికి లొంగని ప్రాంతాల్లో అధికారుల సహకారంతో పోర్జరీ సంతకాలతో తమ నామినేషన్లను ఉపసంహరించారని సత్తెనపల్లి, చిలకలూరిపేటల్లో కొందరు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. నామినేషన్లు వేసిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన అభ్యర్థులను ఎన్ని విధాల ప్రలోభాలకు, భయపడేటట్లు చేసి వారి నామినేషన్లను ఉపసంహరింపచేశారు. ఉపసంహరణలకు కిమ్మనకుండా మాట విన్న వారికి అభ్యర్థుల స్థాయిని బట్టి రూ.3 లక్షల నుండి రూ.12 లక్షల వరకు అధికార పార్టీ ముట్టజెప్పినట్లు సమాచారం. జిల్లాలో గుంటూరు కార్పొరేషన్‌తో పాటు మరో ఏడు మున్సిపాలిటీలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అయితే మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీల్లో వైసీపీ అభ్యర్థులు మాత్రమే మిగలడంతో ఇక్కడ అన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 8 మున్సిపాలిటీలలో 290 వార్డులు ఉండగా 1581 నామినేషన్లు వచ్చాయి. అందులో 650 మంది విత్‌డ్రా చేసుకోగా 901 మంది బరిలో నిలిచారు.  మాచర్ల 31 వార్డులు, పిడుగురాళ్లలో 33 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో ఇక్కడ 14న మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. జిల్లా వ్యాప్తంగా 85 వార్డుల్లో వైసీపీకి చెందిన అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుపొందారు. జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల హడావిడి, అభ్యర్ధుల ప్రచారాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల తరపున అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. గుంటూరు నగరపాలక సంస్థలో  48వ డివిజన్‌, తెనాలిలో ఇద్దరు, చిలకలూరిపేటలో ముగ్గురు, రేపల్లెలో నలుగురు, సత్తెనపల్లిలో నలుగురు, వినుకొండలో ఏడుగురు అభ్యర్థులు ఏకగీవ్రమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 57 డివిజన్లకు   557 నామినేషన్లు వచ్చాయి.  అందులో 189 నామినేషన్లు విత్‌డ్రా కాగా 368 మంది పోటీలో ఉన్నారు. తెనాలి 40 వార్డుల్లో 182 నామినేషన్లు రాగా 76 మంది విత్‌డ్రా చేసుకున్నారు. 106 మంది పోటీలో ఉన్నారు. చిలకలూరిపేటలో 38 వార్డులకు  229 నామినేషన్లు వచ్చాయి. 95 మంది విత్‌డ్రా చేసుకోగా 134 మంది పోటీలో ఉన్నారు. రేపల్లెలో 28 వార్డులకు 116 నామినేషన్లురాగా 46 విత్‌ డ్రా చేసుకున్నారు. 70 మంది పోటీలో ఉన్నారు. సత్తెనపల్లిలో 31 వార్డులకు 149 నామినేషన్లు వచ్చాయి. 86 మంది విత్‌డ్రా చేసుకోగా 63 మంది పోటీలో ఉన్నారు. వినుకొండలో 31 వార్డులకు 159 నామినేషన్లు వచ్చాయి. 63 మంది విత్‌డ్రా చేసుకోగా 96 మంది పోటీలో ఉన్నారు.


ఎన్నికలు లేవు..

 పిడుగురాళ్లలో అన్ని వార్డులు ఏకగ్రీవం కావడంతో ఇక్కడ ఈ నెల 10న ఎన్నికలు జరగవు. ఇక చైర్మన్‌గా  వైసీపీకి చెందిన కొత్త చినసుబ్బారావు ఎంపిక  లాంఛనంగా మారింది. తొలిసారిగా మాచర్ల పురపాలక సంఘం ఏకగ్రీవమైంది. ఏ వార్డులోనూ వైసీపీ మినహా ఏ పార్టీ అభ్యర్థులు నామినేషన్‌ వేయలేదు. పట్టణంలోని 31 వార్డులకు గత ఏడాది మార్చిలో 54 నామినేషన్లు వచ్చాయి. బుధవారం డమ్మీలు తమ నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో మొత్తం 31 వార్డులనూ వైసీపీ గెలుచుకొని పురపాలక సంఘాన్ని ఏకగ్రీవం చేసుకుంది.


ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు

 : గుంటూరు కార్పొరేషన్‌, చిలకలూరిపేట, తెనాలి, రేపల్లె, సత్తెనపల్లి, వినుకొండ

ఏకగ్రీవాలు అయిన మున్సిపాలిటీలు : పిడుగురాళ్ల, మాచర్ల

మొత్తం నామినేషన్లు : 1581

నామినేషన్ల ఉపసంహరణ ః 680 

పోటీలో ఉన్న అభ్యర్థులు ః 901

మొత్తం వార్డులు ః 290

ఏకగ్రీవమైన వార్డులు ః 85 (వైసీపీ)

ఎన్నికలు జరిగే వార్డుల సంఖ్య ః 205 


- వినుకొండ మున్సిపాలిటీలో 32 వార్డులకు ఏడు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఈ ఏడు వార్డులను వైసీపీ దక్కించుకుంది. ఇక్కడ నామినేషన్లు వేసిన ప్రత్యర్థులపై అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లు తీసుకొచ్చి ఉపసంహరించుకునేలా చేశారని సమాచారం.  అధికారులకు బీ-ఫారం ఇచ్చి ఇంటికి వచ్చిన వెంటనే పట్టణ ఎస్‌ఐ వెంకట్రావు ఫోన్లు చేయించి నామినేషన్‌ విత్‌డ్రా చేసుకోవాలని తనను బెదిరించారని, అయినా తాను అంగీకరించలేదని 13వ వార్డు టీడీపీ అభ్యర్థి గణసాల సత్యం తెలిపారు. ఆయన్ను స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం.


- పిడుగురాళ్ల మున్సిపాలిటీలో అధికార పార్టీ ఒత్తిళ్లతో నామినేషన్లు దాఖలు చేసిన 43 మంది టీడీపీ అభ్యర్థులు విత్‌ డ్రా చేసుకున్నారు. నామినేషన్లు వేసినప్పటి నుంచి వారి వృత్తి, వ్యాపార, ఆర్థిక అంశాలు సేకరించి మరీ ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఓ వార్డులో అభ్యర్థిని నామినేషన్‌ ఉపసంహరించుకోకపోతే వ్యాపారసంస్థలపై అధికారులతో దాడులు చేయించటమే కాకుండా వ్యాపారాన్ని దెబ్బతిస్తామని బెదిరించారు. దీంతో ఆయన ఉపసంహరణ పత్రంపై సంతకాలు చేసి ఇచ్చేశారు. ఓ వార్డులో బీజేపీ తరపున పోటీకి దిగిన అభ్యర్థి ఇంటి ముందు పబ్లిక్‌ టాయిలెట్‌ నిర్మాణానికి అధికారులు సిద్ధమయ్యారు. నామినేషన్‌ ఉపసంహరించుకుంటే నిర్మాణాన్ని మరో చోటకి తరలిస్తామని చెప్పారు. దీంతో ఆ మహిళా అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. జనసేన తరపున పోటీ చేసి ఓ అభ్యర్థి చేత కూడా బలవంతంగా ఉపసంహరణ పత్రాలపై సంతకాలు చేయించారు. ఈ ఘటనపై వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేదు. ఇక అధికార పార్టీకి చెందిన రెబల్‌ అభ్యర్థులను బుజ్జగించి వారికి రూ.లక్షల్లో నగదు ముట్టజెప్పి ఉపసంహరించుకునేలా చేశారని సమాచారం. దీంతో పిడుగురాళ్ల మున్సిపాలిటీలో అన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 33 వార్డుల్లో 102 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ఒక్కొక్కరికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. 


- సత్తెనపల్లి పురపాలక సంఘంలో 6, 14, 25, 27 వార్డుల అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. వీరంతా వైసీపీకి చెందిన వారే. 6, 25 వార్డుల్లో వైసీపీ నాయకులు బలవంతంగా తమ అభ్యర్థుల నామినేషన్లు ఉపసంహరించేలా చేశారని టీడీపీ, జనసేన, సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని గార్లపాడు బస్టాండ్‌ వద్ద  బుధవారం రాస్తారోకో చేశారు. తాము పురపాలక సంఘానికి వెళ్లి ఉపసంహరణ పత్రాన్ని ఇవ్వలేదని 6వ వార్డు టీడీపీ అభ్యర్థి కోటేశ్వరి, 25వ వార్డు జనసేన అభ్యర్థి కె.అనురాధలు తెలిపారు. తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. రెండు వార్డుల అభ్యర్థులను ఏకగ్రీవంగా ప్రకటించే విషయంలో అక్రమాలకు పాల్పడిన అధికారులను సస్పెండ్‌ చేయాలని ఆయా పార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన అభ్యర్థులు పోలీసు హెచ్చరికలతో అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.   


- రేపల్లె పురపాలక సంఘంలో ఆరుగురు టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. టీడీపీ తరపున నామినేషన్లు వేసిన అభ్యర్థుల ఇళ్లపైకి అర్ధరాత్రి వెళ్లి మరీ వైసీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారని సమాచారం. విత్‌డ్రా కాకుంటే కేసులు పెట్టిస్తామని, వ్యాపారాలను చేసుకోనివ్వమని బెదిరించారని తెలిసింది. కొందరిని భయపెట్టి మరికొందరికి రూ.5 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ముట్టచెప్పినట్లు సమాచారం.  రేపల్లె పురపాలక సంఘములో 28 వార్డులు ఉండగా వైసీపీ బెదిరింపులకు లొంగి 1, 2, 3, 8, 12 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 1, 2, 8, 12 వార్డులు వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. 3వ వార్డు టీడీపీ అభ్యర్థి దేవగిరి రంగా నామినేషన్‌ ఉపసంహరించుకోవడంతో ఇక్కడ జనసేన, వైసీపీ మధ్య పోటీ నెలకొంది. 


- తెనాలి మున్సిపాలిటీలో ఏకగ్రీవాల కోసం అధికార పార్టీ బేరాలకు దిగింది. అయితే 40 వార్డులకు రెండు వార్డులను మాత్రం(39, 40) ఏకగ్రీవం చేసుకోగలిగింది.   మరో ఆరు వార్డుల్లో ఏకగ్రీవాలు చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఇక్కడ టీడీపీతో పాటు మిగిలిన పార్టీల అభ్యర్థులు గట్టిగా నిలబడటంతో పోటీ తప్పలేదు. ఒక వార్డులో ఏకగ్రీవం కోసం రూ. 12 లక్షలు, మరో వార్డులో రూ.10 లక్షలు ముట్టచెప్పినట్టు సమాచారం. 40వ వార్డులో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన తెనాలి బెత్సిబారాణి పోటీ నుంచి తప్పుకుని బుధవారం ఎమ్మెల్యే శివకుమార్‌ సమక్షంలో వైసీపీలో చేరారు.


- చిలకలూరిపేట మున్సిపాలిటీలో 17, 29, 30 వార్డులు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. 17వ వార్డు నామినేషన్‌ ఉపసంహరణ విషయంలో టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపసంహరణ పత్రంపై హేమలత సంతకం పోర్జరీ చేశారని, అభ్యర్థి, ఆమెను ప్రతిపాదించిన వ్యక్తి రాకుండానే ఆమోదించారని నిరసన వ్యక్తం చేశారు. వీడియో తమకు చూపించాలని ఇది అనధికార ఉపసంహరణ అంటూ కొద్దిసేపు ఆందోళన చేశారు. దీనితో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. 29వ వార్డులో టీడీపీ అభ్యర్థి నాగూర్‌వలితో బలవంతంగా నామినేషన్‌ ఉపసంహరించుకునేలా చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు.   


- నామినేషన్ల ఉపసంహరణ అనంతరం గుంటూరు నగరపాలక సంస్థలో 287 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.  48వ డివిజన్‌ నుంచి తనుబుద్ధి కృష్ణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 56 వార్డుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. బీఎస్పీ - 3, బీజేపీ- 17, సీపీఐ- 3, సీపీఎం - 3, కాంగ్రెస్‌ - 28, జనసేన- 25, టీడీపీ- 51, వైసీపీ - 57, ఇతర పార్టీల తరపున 7, స్వతంత్రులు - 93 మంది చొప్పున అభ్యర్థులు పోటీలో నిలిచారు. 



 

Updated Date - 2021-03-04T06:33:37+05:30 IST