బెదిరింపులపై ఈసీ ఆరా

ABN , First Publish Date - 2021-02-27T05:48:03+05:30 IST

విశాఖపట్నంపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టిసారించింది. మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికలలో ఎలాగైనా మేయర్‌ పీఠం దక్కించుకోవాలనే ఆలోచనతో ఒక రాజకీయ పార్టీ ప్రత్యర్థులను బెదిరించడం, పోటీలో వుండకూడదని హెచ్చరించడం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ దృష్టికి వెళ్లాయి.

బెదిరింపులపై ఈసీ ఆరా

వివరాల సేకరణ

బార్ల యజమానుల నుంచిఓ పార్టీ రూ.లక్షల విలువైన మద్యం సేకరిస్తుందని వచ్చిన వార్తలపైనా దృష్టి

నివేదిక సమర్పించాల్సిందిగా ఎక్సైజ్‌ అధికారులకు ఆదేశాలు

1న ఆరోపణలపై పంచాయితీ


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నంపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టిసారించింది. మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికలలో ఎలాగైనా మేయర్‌ పీఠం దక్కించుకోవాలనే ఆలోచనతో ఒక రాజకీయ పార్టీ ప్రత్యర్థులను బెదిరించడం, పోటీలో వుండకూడదని హెచ్చరించడం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ దృష్టికి వెళ్లాయి. గత వారం రోజులుగా జీవీఎంసీ ఎన్నికలపై వివిధ పత్రికలు, న్యూస్‌ ఛానళ్లలో వస్తున్న వార్తాంశాలను ఎన్నికల సంఘం పరిశీలనలోకి తీసుకుంది. కొన్ని వార్డుల్లో ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులకు ఫోన్లు చేసి, వ్యాపారాలు దెబ్బ తీస్తామని, పాత కేసులు తిరగదోడతామంటూ ఓ రాజకీయ పార్టీ నాయకులు బెదిరిస్తున్నారు. దాంతో ఆయా పార్టీల అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటున్నామని, వేరే వారిని చూసుకోవాలని వారి పార్టీ పెద్దలకు స్పష్టంచేశారు. ఇలా 49వ వార్డుకు చెందిన ఒక అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్నారు. మరికొన్నిచోట్ల రెబల్‌ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారిని సైతం బెదిరిస్తున్నారు. వీటిపైనా ఎన్నికల సంఘం పూర్తి వివరాలు సేకరిస్తోంది. 

బార్ల యజమానుల నుంచి వసూళ్లపై...

జీవీఎంసీ ఎన్నికల్లో ఓటర్లకు మద్యం పంపిణీ చేయడం కోసం ఒక రాజకీయ పార్టీ బార్ల యజమానులను బెదిరించి రూ.7 లక్షల విలువైన మద్యం సేకరించడంపై ఎక్సైజ్‌ విభాగం నుంచి ఎన్నికల సంఘం నివేదిక కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అంతేకాకుండా ఒక బ్రాండ్‌నే పెద్ద మొత్తంలో కొనిపించినట్టు వచ్చిన వార్తలపైనా వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. ఈ అంశాలన్నింటిపైనా ఎన్నికల కమిషనర్‌ మార్చి ఒకటో తేదీన జిల్లా పర్యటనకు వచ్చినపుడు వివరంగా చర్చించనట్టు తెలిసింది. ఈ సమావేశానికి విశాఖ జిల్లా ఎక్సైజ్‌ అధికారులను కూడా పిలవాలని ఎన్నికల కమిషనర్‌ ఆదేశించడం గమనార్హం.


21వ వార్డులో స్వతంత్ర అభ్యర్థికి బెదిరింపులు

నగరంలోని 21వ వార్డు నుంచి ఒక పార్టీకి చెందిన కీలక వ్యక్తి పోటీ చేస్తున్నారు. ఆయనే మేయర్‌ అభ్యర్థి అని ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా మాజీ కార్పొరేటర్‌ బరిలో ఉన్నారు. ఆయనకు

ఆ ప్రాంతంలో మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిని బరిలో నుంచి తప్పించాలని ఓ పార్టీ పెద్దలు రంగంలో దిగారు. అదే వార్డులో వున్న అతి పెద్ద విద్యా సంస్థలో పనిచేసి, ఆ తరువాత రాజకీయాల్లోకి వెళ్లి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తి సదరు అభ్యర్థిని బెదిరించినట్టు ప్రచారం జరుగుతోంది. మర్యాదగా పోటీ నుంచి తప్పుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించినట్టు చెబుతున్నారు.



మునిసిపల్‌ ఎన్నికలకు టీడీపీ ఇన్‌చార్జులు


జీవీఎంసీకి యనమల... కమిటీలో మరో ఆరుగురు

అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారీగా కమిటీలు

ఎలమంచిలి, నర్సీపట్నం మునిసిపాలిటీలకు కూడా...

విశాఖపట్నం/అనకాపల్లి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి):

మునిసిపల్‌ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయ డానికి ఆ పార్టీ అధిష్ఠానం పలువురి సీనియర్లను ఇన్‌చార్జులుగా నియమించింది. జీవీఎంసీ మొత్తానికి ఇన్‌చార్జిగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యవహరిస్తారు. ఆయనతోపాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, బుద్దా వెంకన్న, చింతకాయల అయ్యన్నపాత్రుడు, పల్లా శ్రీనివాసరావు కమిటీలో ఉంటారు. జీవీఎంసీ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారీగా ఇన్‌చార్జులను నియమించారు. 

విశాఖ తూర్పు: ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వనమాడి వెంకటేశ్వరరావు, ఒమ్మి సన్యాసిరావు

విశాఖ ఉత్తరం: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పెందుర్తి వెంకటేశ్‌, కె.దొరబాబు

విశాఖ దక్షిణం:. ఆదిరెడ్డి శ్రీనివాస్‌, ఎండీ నజీర్‌, పట్టాభి

భీమిలి: సబ్బం హరి, ఎంవీ శ్రీభరత్‌

విశాఖ పశ్చిమ: ఎమ్మెల్యే గణబాబు, కేఎఎన్‌ఎస్‌ రాజు

గాజువాక: పల్లా శ్రీనివాసరావు, దువ్వారపు రామారావు, మూర్తి యాదవ్‌

అనకాపల్లి: పీలా గోవింద సత్యనారాయణ, బత్తుల తాతయ్యబాబు, యేజర్ల వినోద్‌రాజు

పెందుర్తి: బండారు సత్యనారాయణమూర్తి, బుద్ద నాగజగదీశ్వరరావు, జూరెడ్డి రాము

నర్సీపట్నం మునిసిపాలిటీ: చింతకాయల అయ్యన్నపాత్రుడు, పీవీజీ కుమార్‌, ధూళి రంగనాయకులు, గూనూరు మల్లునాయుడు

ఎలమంచిలి మునిసిపాలిటీ: ప్రగడ నాగేశ్వరరావు, పప్పల చలపతిరావు, వంగలపూడి అనిత,  కోట్ని బాలాజీ

Updated Date - 2021-02-27T05:48:03+05:30 IST