పడకల పాట్లు..

ABN , First Publish Date - 2020-09-20T08:47:41+05:30 IST

కరోనా బాధితులను బెడ్ల(పడకలు) కష్టాలు వెంటాడుతున్నాయి. కరోనా చికిత్సకు ప్రస్తుతం జిల్లా సర్వజనాస్పత్రి కీలకంగా మారింది.

పడకల పాట్లు..

 డిశ్చార్జ్‌ లేదంటే డెత్‌ అయితేనే బెడ్‌..

  జిల్లా సర్వజనాస్పత్రిలో కరోనా బాధితులకు దొరకని బెడ్లు 

 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి రెఫర్‌

  ప్రైవేట్‌ ఆస్పత్రులకు తగ్గిన తాకిడి


అనంతపురం వైద్యం, సెప్టెంబరు 19: కరోనా బాధితులను బెడ్ల(పడకలు) కష్టాలు వెంటాడుతున్నాయి. కరోనా చికిత్సకు ప్రస్తుతం జిల్లా సర్వజనాస్పత్రి కీలకంగా మారింది. బాధితులకు ఇక్కడే ఎక్కువగా వైద్యసేవలు అందిస్తున్నారు. జిల్లాలో కరోనా ప్రభావం కొంతమేర తగ్గుతూ వస్తోంది. దీంతో అధికారులు గతంలో మాదిరి హడావుడి చేయట్లేదు.


సీరియస్‌ కేసులను జిల్లా ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇక్కడ ఐసీయూ, వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ సదుపాయాలు ఏర్పాటు చేశారు. సీరియస్‌ బాధితులను ఈ విభాగాల్లో చేర్చి, వైద్య సేవలు అందిస్తున్నారు. మిగిలిన బాధితులను కామన్‌ కొవిడ్‌ విభాగాల్లో చేర్చి, చికిత్స చేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం సర్వజనాస్పత్రిలో 400 వరకు కొవిడ్‌ బాధితులకు పడకలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పడకలు హౌస్‌ఫుల్‌గా ఉన్నాయి. సీరియస్‌ కేసులు సైతం సర్వజనాస్పత్రికి వస్తున్నాయి. దీంతో వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ సదుపాయాలు అందించలేకపోతున్నారు.


బెడ్‌ కావాలంటే ఎవరైనా డిశ్చార్జ్‌ అయినా కావాలి లేదంటే చావాలి అన్నట్టుగా పరిస్థితి ఉంది. అందుకే రెండు రోజులుగా సీరియస్‌ కేసులకు ఇక్కడ పడకలు లేక సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి రెఫర్‌ చేస్తున్నారు. కొద్దిగా కోలుకున్న బాధితులను వెంటిలేటర్ల విభాగం నుంచి సాధారణ విభాగానికి తరలిస్తున్నారు. కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రైవేట్‌ కొవిడ్‌ ఆస్పత్రులకు తాకిడి తగ్గింది.


 కొత్తగా 477 కరోనా కేసులు

జిల్లాలో కొత్తగా 477 కరోనా పాజిటివ్‌ కేసుల నమోదైనట్లు అధికారులు శనివారం వెల్లడించారు. మరో ఐదుగురు బాధితులు మరణించినట్టు తెలిపారు. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 52,298కి చేరింది. మరణాల సంఖ్య 439కి పెరిగింది. వీరిలో 48,801 మంది కరోనా నుంచి కోలుకోగా.. మిగతా వారు చికిత్స పొందుతున్నారు.


జిల్లా కేంద్రంలోనే 137 మంది బాధితులు..

జిల్లాలో శనివారం విడుదల చేసిన బులెటిన్‌లో గడిచిన 24 గంటల్లో 51 మండలాలలో కొత్తగా 477  కరోనా కేసులు వచ్చాయి. వీటిలో జిల్లా కేంద్రలోనే అత్యధికంగా 137 మంది వైరస్‌ బారిన పడ్డారు. హిందూపురం 50, గుంతకల్లు, పరిగి 26, బత్తలపల్లి 20, కళ్యాణదుర్గం 18, బుక్కరాయసముద్రం, ముదిగుబ్బ 17, బుక్క పట్నం 14, తాడిపత్రి 13, కనగానపల్లి 12, ఉరవకొండ 11, చిలమత్తూరు 9, ధర్మవరం 8, గాండ్లపెంట, గార్లదిన్నె, నల్లమాడ, పెనుకొండ 7, గోరంట్ల, శెట్టూరు 6, కదిరి 5, కొత్తచెరువు, యాడికి 4, సీకేపల్లి, గుత్తి, నార్పల, రాయ దుర్గం, తనకల్లు 3, ఆత్మకూరు, గుడిబండ, కూడేరు, మడకశిర, పామిడి, పెద్దవడగూరు, రొద్దం, విడపనకల్లు 2, మరో 15 మండలాల్లో ఒక్కో కరోనా కేసు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకున్న 555 మందిని డిశ్చార్జ్‌ చేసినట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు.


నేడు  నమూనాలు సేకరించే ప్రాంతాలివే... 

జిల్లాలో ఆదివారం కళ్యాణదుర్గం బస్టాండ్‌, అమరాపురం బస్టాండ్‌, కొత్తచెరువు, నల్లచెరువు, గుడిబండ, అగళి, ధర్మవరం, పుట్లూరు, రాప్తాడు, కౌకుంట్ల, ఓడీసీ, కేబీహళ్లి, హిందూపురం, ముద్దినాయనపల్లి, శ్రీరంగాపురం, కొనకొండ్ల, బత్తలపల్లి, దర్శినమల, తాడిపత్రి, జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ అతిథిగృహం, పాతూరు ఆస్పత్రి, ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల, సోమనాథనగర్‌ సర్కిల్‌లో కరోనా నమూనాలు సేకరిస్తామని కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - 2020-09-20T08:47:41+05:30 IST