Abn logo
Sep 18 2021 @ 00:51AM

పరీక్షలు.. పరేషాన్‌

హాల్‌టికెట్‌లు రాక వీఎస్‌ఆర్‌ కళాశాల బయట ఆవేదనతో నిలుచున్న ఇతర రాష్ట్రాల విద్యార్థులు

బీఈడీ పరీక్షల్లో గందరగోళం

లోపబూయిష్టంగా మొదటి సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణ 

తొలి రోజు పరీక్షలు రాయలేకపోయిన 4,600 మందివిద్యార్థులు

పరీక్షలకు అనుమతించకపోవడంతో విద్యార్థుల ఆందోళన

ఉన్నత విద్యా మండలి, ఏఎన్‌యూ మధ్య సమన్వయ లోపం? 


వాయిదాల మీద వాయిదాలు.. తీరా నిర్వహించే సమయానికి గంట ముందు తూచ్‌.. ఇలా చిన్నపిల్లల ఆట మాదిరిగా అధికారులు బీఈడీ పరీక్షల విషయంలో వ్యవహరిస్తున్నారు. అటు ఉన్నత విద్యామండలి.. ఇటు ఏఎన్‌యూ అధికారుల మధ్య సమన్వయ లోపం విద్యార్థుల పాలిట శాపంలా మారింది. 2020-21 విద్యా సంవత్సరం పరీక్షలు ఇప్పటికి మూడు సార్లు వాయిదా పడ్డాయి. అంటే ఇప్పటికే విద్యార్థులకు ఒక సంవత్సరం వృథా. తాజాగా శుక్రవారం నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో హాల్‌టిక్కెట్‌లు రాక కొందరు.. పేర్లు గల్లంతై మరికొందరు.. ఇలా 4,600 మంది విద్యార్థులు తొలి రోజు పరీక్ష రాయలేకపోయారు.తెనాలి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని బీఈడీ కళాశాలల్లో ఏపీతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 19 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయ పరిధిలో శుక్రవారం నుంచి బీఈడీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే కొందరికే పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చారు. మిగిలిన వారు ఆయా పరీక్షా కేంద్రాల వద్ద నిరీక్షించాల్సి వచ్చింది.  ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడ్డాయి. నాలుగోసారి నిర్వహించేందుకు ఈ నెల 14న ఏర్పాట్లు చేయగా గంట ముందు వాయిదా వేస్తున్నామని కేంద్రాల వద్దకు వచ్చిన విద్యార్థులకు తెలపడంతో వారంతా అవాక్కయ్యారు. పరీక్షలు రాసే వారిలో మన రాష్ట్రం వారే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారూ ఉన్నారు. దీంతో వారంతా వారివారి రాష్ట్రాలకు వెళ్లలేక ఎక్కడికక్కడ హోటళ్లలో ఉండాల్సి వచ్చింది. ఎన్నో వ్యయప్రాసలకు ఓర్చి శుక్రవారం తిరిగి పరీక్షల రాసేందుకు వస్తే తీరా 14న వచ్చిన హాల్‌టిక్కెట్లు చూపినా వారిని పరీక్షలకు అనుమతించలేదు. మరికొందరి పేర్లయితే రాటిఫికేషన్‌ లిస్ట్‌ నుంచే మాయమైపోయాయి. ఇలా 4,600 మంది పరీక్షలు రాయలేకపోయారు. అదేమని అడిగేందుకు ఎవరూ లేకపోవటం, కళాశాలల నిర్వాహకులకు తెలిపినా వారి నుంచి సమాధానం రాకపోవటంతో విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు కొన్నిచోట్ల ఆందోళనలకు దిగారు. తమకు 14వ తేదీతో వచ్చిన హాల్‌టిక్కెట్‌లను చూపించినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. ఒడిస్సాకు చెందిన విద్యార్థులైతే అక్కడి నేతల ద్వారా రాష్ట్ర గవర్నర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు సమాచారం.


లోపం ఎవరిది..?

బీఈడీ పరీక్షల నిర్వహణలో గందరగోళానికి కారణాలు అటుంచితే, లోపం ఎవరిదనేది అంతుపట్టని ప్రశ్నగానే ఉంది. ఉన్నత విద్యా మండలి నుంచి విద్యార్థుల సర్టిపికెట్స్‌ పరిశీలన(రాటిఫికేషన్‌) పూర్తికాలేదని, వారి జాప్యం కారణంగానే విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయారని వర్సిటీ అధికారులు చెబుతున్నారు.  ఉన్నత విద్యా మండలి అధికారులు మాత్రం.. అనుమతిలేని కళాశాలల్లో విద్యార్థులను చేర్చుకోవటం, విద్యార్థుల సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చెయ్యకపోవటం వంటి సమస్యలున్నాయని, వాటిని పదేపదే వివరించినా వర్సిటీలు పట్టించుకోలేదంటున్నారు. ఈ నెల 14న జరగాల్సిన పరీక్షలను రాటిఫికేషన్‌ కాకుండా ఎలా నిర్వహిస్తారంటూ ఉన్నత విద్యామండలి ప్రశ్నించటంతో వాయిదా వేశారు. విద్యార్థుల సర్టిఫికెట్‌లు అప్‌లోడ్‌, వాటి పరిశీలన కేవలం మూడు రోజుల్లో పూర్తికావనే విషయం తెలిసి కూడా వర్సిటీ అధికారులు మళ్లీ పరీక్షలకు సిద్ధమవడం చూస్తే వారి మధ్య ఆధిపత్య ధోరణి కనిపిస్తుంది. దీనిపై వర్సిటీ ఇన్‌చార్జి వీసీ రాజశేఖర్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నిస్తే ఆయన అందుబాటులోకి రాలేదు. యూనివర్శిటీ రిజిస్ట్రార్‌ను వివరణ కోరితే మీడియా పాయింట్‌లో అడిగి తీసుకోవాలని, తాము దీనిపై ఏమీ చెప్పలేమన్నారు. 


అనుమతి లేకపోతే వద్దన్నాం 

151 బీఈడీ కళాశాలలకు మాత్రమే అనుమతి  ఉంది. మిగిలిన అనుమతిలేని కళాశాలల నుంచి విద్యార్థులను చేర్చుకుని పరీక్షలు రాయించేందుకు సిద్ధపడుతుంటే, అటువంటి వాటిని ఆపాలని కోరాం. అనుమతి ఉన్న కొన్ని కళాశాలల నుంచి విద్యార్థుల సర్టిఫికెట్స్‌ అప్‌లోడ్‌ కాలేదు. అందువల్లే వాటిని రాటిఫికేషన్‌ చేయలేకపోయాం. రాటిఫికేషన్‌ జరగని, అనుమతిలేని కళాశాలల్లో పరీక్షలు జరపటం సరికాదన్నాం. అవేమీ సరిచేయకుండానే శుక్రవారం నుంచి పరీక్షలకు సిద్ధమయ్యారు. దానిని ప్రశ్నించాం అంతే. మా మధ్య చిన్న సమాచార లోపం మాత్రమే ఉంది. బేధాభిప్రాయాలు లేవు.

-  సుధీర్‌రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రత్యేక అధికారి