బెడ్‌ బ్లాకింగ్‌ దందా

ABN , First Publish Date - 2021-05-06T08:11:39+05:30 IST

బెంగళూరులో సంచలనం రేపిన బెడ్‌ బ్లాకింగ్‌ దందాలో ఇద్దరు వైద్యులతో సహా ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు...

బెడ్‌ బ్లాకింగ్‌ దందా

  • పోలీసుల అదుపులో ఇద్దరు వైద్యులు
  • బెంగళూరులో మొత్తం ఏడుగురు
  • నగరంలో ఒక్కరోజులోనే 1504 బెడ్లు ఖాళీ 

బెంగళూరు, మే 5 (ఆంధ్రజ్యోతి): బెంగళూరులో సంచలనం రేపిన బెడ్‌ బ్లాకింగ్‌ దందాలో ఇద్దరు వైద్యులతో సహా ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీబీ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నట్లు బుధవారం నగర పోలీస్‌ కమిషనర్‌ కమల్‌ పంత్‌ తెలిపారు. పలువురు నిందితులు మొబైల్‌ స్విచ్చాఫ్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారని చెప్పారు. రోజూ వేలసంఖ్యలో కొవిడ్‌ కేసులు నమోదవుతూ దేశంలోనే ఆందోళన పరిస్థితి నెలకొన్న బెంగళూరులో బెడ్‌ బ్లాకింగ్‌ దందాను ఎంపీ తేజస్వి సూర్య వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. నగరంలోని అన్ని ఆసుపత్రుల్లో పడకలను పర్యవేక్షించే బీబీఎంపీలోని కొందరు అధికారులు, వైద్యులు వ్యూహాత్మకంగా బ్లాకింగ్‌కు పాల్పడుతున్న వైనాన్ని తేజస్వి సూర్య మంగళవారం వెలుగులోకి తెచ్చారు. ముఖ్యమంత్రి యడియూరప్ప వెంటనే దీనిపై విచారణకు ఆదేశించారు. కాగా బెడ్‌ బ్లాకింగ్‌ వెలుగులోకి రావడంతో బెంగళూరులో పరిస్థితి మారిపోయింది. నగర వ్యాప్తంగా బుధవారం 1,504 ఖాళీలున్నట్టు డ్యాష్‌బోర్డ్‌ సూచించింది.


ప్రభుత్వ ఆస్పత్రులలో 44, ప్రైవేటు ఆస్పత్రులలో 369, ప్రైవేటు మెడికల్‌ కళాశాల ఆస్పత్రులలో 1,091 ఖాళీలు చూపించాయి. కాగా బీబీఎంపీ 8 డివిజన్‌లలో వార్‌ రూమ్‌లను పర్యవేక్షించే సంస్థల కాంట్రాక్టును రద్దు చేసి ఇతర ఏజెన్సీలకు అప్పగించాలని బీబీఎంపీ తీర్మానించింది.  వార్‌రూమ్‌లో కేఏఎస్‌ స్థాయి అధికారులను నియమిస్తామన్నారు. బెంగళూరు పరిధిలో 11 వేల పడకలున్నాయని, వీటిలో సాధారణ పడకలను ఆక్సిజన్‌ పడకలుగా మారుస్తామన్నారు. కాగా బుధవారం సాయంత్రానికి 3,200 పడకలు ఖాళీగా ఉన్నట్టు లైవ్‌ సెంట్రల్‌ హాస్పిటల్‌ బెడ్‌ మేనేజిమెంట్‌ వెబ్‌సైట్‌లో ప్రకటించారు. అయితే కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లలో 1,504 పడకలు ఖాళీగా ఉన్నట్లు వెబ్‌సైట్‌లో సమాచారం ఉంది. 

Updated Date - 2021-05-06T08:11:39+05:30 IST