Abn logo
May 17 2021 @ 00:31AM

బుల్లితెర మీద ఎవరూ వేయని పాత్ర చేస్తున్నా!

అందాల పోటీల్లో తన కూతుర్ని చూసుకోవాలనేది అమ్మ కోరిక. ఆ కోరికను నిజం చేయాలన్నది కూతురి అభిలాష. ముగ్ధమనోహర రూపం... మోముపై చిరుమందహాసం... ‘బ్యూటీగా’ రాణించి ఆపై నటిగా మార్కులు కొట్టేసింది. ‘అమ్ములు’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరై... ‘జానకి’గా వారి మనసులు గెలుచుకున్న నటి ప్రియాంకా జైన్‌. ఆమె ‘నవ్య’తో పంచుకున్న సంగతులివి...


‘‘కలలు ఎప్పుడూ మనవే కాదు... మనల్ని కన్నవారికీ ఉంటాయి. వారివి నిస్వార్థమైనవి. మనం ఎదిగితే చూడాలని కోరుకొనేవి! మా అమ్మా అంతే... నన్ను ‘అందాల రాణి’గా చూడాలని కోరుకుంది. మరి దాన్ని నిజం చేయాల్సిన బాధ్యత నాదే కదా! మాది ముంబయి. నేను పుట్టింది అక్కడే. అమ్మ గుజరాతీ. నాన్న జైన్స్‌. బిజినెస్‌మేన్‌. పద్దెనిమిదేళ్ల కిందట బెంగళూరుకు వెళ్లి స్థిరపడ్డాం. నా చదువంతా అక్కడే. సైకాలజీపై ఆసక్తితో బీకాం మధ్యలోనే ఆపేశాను. కానీ నటిని అయ్యాక అదీ పూర్తిచేయలేకపోయాను. 


ఆడిషన్స్‌కు వెళితే... 

కాలేజీకి వెళ్లే రోజుల్లో ఓ అందాల పోటీకి ఆడిషన్స్‌ జరుగుతున్నాయి. అమ్మ చెప్పింది... ‘ఒకసారి వెళ్లి చూడు’ అని! నాకు ఆడిషన్‌ అంటే ఏమీ తెలీదు. అదే అమ్మకు చెబితే... ‘ప్రయత్నిస్తే పోయేదేం లేదు... ఒకవేళ ముందుకు వెళ్లలేకపోతే ఎలాగూ రెగ్యులర్‌ లైఫ్‌ ఉంది కదా’ అంది. వెళ్ళాను,.. సెలెక్ట్‌ అయ్యాను. అలా ఏడెనిమిదేళ్ల కిందట ‘మిస్‌ ఇండియా సౌత్‌’, ‘మిస్‌ అండ్‌ మిసెస్‌ గుజరాతీ’ అందాల పోటీల్లో పాల్గొన్నాను. ఒకదాంట్లో టైటిల్‌ కూడా గెలిచా. అప్పుడు ఎంతో సంబరపడ్డాను. అమ్మ కూడా హ్యాపీ. 


అనుకోని అవకాశం... 

బ్యూటీ పేజియంట్స్‌లో నన్ను చూసిన కొందరు ‘సినిమాల్లో చేస్తావా’ అని అడిగారు. ప్రయత్నం లేకుండా సినిమా అవకాశం వస్తే ఆ అనుభూతిని ఎలా వర్ణించగలం? వెంటనే సరేనన్నాను. అలా కన్నడలో ‘గోలీసోడా’తో చిత్రసీమలోకి అడుగుపెట్టాను. 2016లో విడుదలైంది. అదే సినిమా తెలుగులో ‘ఎవడూ తక్కువ కాదు’ టైటిల్‌తో విడులైంది. తరువాత టాలీవుడ్‌ నుంచి పిలుపు వచ్చింది. ‘చల్‌తే చల్‌తే’ చిత్రం కోసం నన్ను అడిగారు. 2018లో విడుదలైన ఆ సినిమా తరువాత ‘వినరా సోదర వీరకుమారా’ చేశాను.  


రూటు మారింది... 

నా కెరీర్‌లో బ్యూటీ పేజియంట్‌ తప్ప ఏదీ ప్లాన్‌ చేసుకోలేదు. అనుకోకుండా అవకాశాలు వస్తున్నాయి. వాటిల్లో నచ్చినవి చేసుకొంటూ వెళుతున్నా. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే... ‘వినరా సోదర వీరకుమార’ సినిమా విడుదలకు ముందు ‘మౌనరాగం’ సీరియల్‌ ఆఫర్‌ వచ్చింది. ‘చేతిలో సినిమాలు ఉండగా సీరియల్స్‌ ఎందుక’న్నారు చాలామంది. కానీ ఆ కథ నాకు బాగా నచ్చింది. నాకు తెలిసి ఇప్పటి వరకు బుల్లితెరపై ఎవరూ అలాంటి పాత్ర చేయలేదు. మూగమ్మాయి అమ్ములు పాత్ర నాది. రొటీన్‌కు భిన్నంగా హావభావాలకు బాగా అవకాశం ఉన్న పాత్ర. అందుకే అడిగిన వెంటనే ఒప్పుకున్నా. నా కెరీర్‌లో బాగా పేరు తెచ్చింది కూడా అమ్ములు పాత్రే. 


ఆ బాధ లేదు... 

సీరియల్స్‌కు వచ్చిన తరువాత సినిమాలు చేయడం కుదరడంలేదు. ‘మౌనరాగం’లో తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరించారు. అదే సమయంలో దాన్ని తమిళంలో కూడా రీమేక్‌ చేశారు. ఈ రెండింటితో క్షణం తీరిక లేకుండా పోయింది. హైదరాబాద్‌- చెన్నై తరచూ తిరగడంవల్ల బెంగళూరు కూడా వెళ్లలేకపోయేదాన్ని. ఆ సీరియల్‌ పూర్తవుతుండగానే స్టార్‌ మాలో ‘జానకి కలగనలేదు’ ప్రారంభమైంది. ఏది ఏమైనా సినిమాల్లో కంటే నాకు సీరియల్స్‌లోనే మంచి పేరొచ్చింది. అందుకే సినిమాల నుంచి సీరియల్స్‌కు వచ్చానన్న బాధ ఎప్పుడూ లేదు. 


వారిని చూస్తే మరిచిపోతాం... 

ఒకేసారి రెండు సీరియల్స్‌లో నటించడమంటే అస్సలు ఖాళీ ఉండదు. ప్రధానంగా విపరీతమైన ట్రావెలింగ్‌తో బాగా అలసిపోతాం. ప్రయాణాలవల్ల ఒక్కోసారి సమయానికి నిద్ర, తిండి ఉండవు. కుటుంబంతో గడపలేం. కానీ ఒక్కసారి ప్రేక్షకుల ఆదరణ, అభిమానం చూస్తే అవన్నీ మరిచిపోతాం. ఇంకా బాగా చేయాలనే తపన పెరుగుతుందే తప్ప ఇబ్బందిగా అనిపించదు.

ప్రస్తుతం ‘జానకి కలగనలేదు’లో ‘జానకి’ పాత్ర కూడా చాలా నచ్చింది. ఐపీఎస్‌ కావాలనుకున్న అమ్మాయికి, ఇష్టంలేక పోయినా పెళ్లి చేస్తారు. తన లక్ష్యాన్ని సాధించాలన్న కల, అత్తింట బాధ్యతలు... ఈ రెండింటినీ ఆ అమ్మాయి ఎలా సమన్వయం చేసుకుంటుందన్నది కథ. 


వంటల్లో ప్రయోగాలు... 

నాకు ఖాళీ దొరికితే పెయింటింగ్స్‌ వేస్తుంటాను. కుకింగ్‌ చాలా ఇష్టం. కొత్త కొత్త వంటలు ప్రయత్నిస్తుంటాను. నా వంటల్లో నాకు బాగా నచ్చేది గ్రీన్‌ కలర్‌ పులావ్‌. చాట్స్‌, పరాఠాలు చేస్తుంటాను.’’

- హనుమా సాధించాల్సింది చాలా ఉంది...

నిజానికి నేనింకా కెరీర్‌ ఆరంభంలోనే ఉన్నా. సాధించాల్సింది చాలా ఉంది. చిరస్థాయిగా ప్రేక్షక హృదయాల్లో నిలిచిపో వాలి. నా పని నటించడం. అందులోనే మంచి పాత్రలు ఎంచుకొని చేస్తే... అవి చూసి ఏ ఒక్కరు స్ఫూర్తి పొందినా చాలు నాకు ఎంతో సంతృప్తిగా ఉంటుంది. సినిమాల్లో కూడా నటనకు ఆస్కారం ఉన్న రోల్స్‌ కోసం ఎదురుచూస్తున్నా.

Advertisement