Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 10 Oct 2021 00:34:28 IST

అందమైన వలపు వల

twitter-iconwatsapp-iconfb-icon
అందమైన వలపు వల

వీడియోకాల్స్‌, ఫ్రెండ్‌ రిక్వె్‌స్టతో కిలాడీల ట్రాప్‌

చిక్కాక అడిగినంత ఇవ్వాల్సిందే

లేదంటే సోషల్‌ మీడియాలో పెడతామంటూ బెదిరింపులు

యాదాద్రి జిల్లాలో ఓ ఉద్యోగ సంఘం నేత బాధితుడే

రూ.3లక్షలు చెల్లించుకున్న మరో వ్యాపారి

సూర్యాపేట జిల్లాలో వలలో చిక్కిన ప్రైవేటు ఉద్యోగి


భువనగిరి టౌన్‌: ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ మోసాలు ఉమ్మడి జిల్లాలో ఎక్కువయ్యాయి. అందులో ముఖ్యంగా అందమైన అమ్మాయి, హస్కీ వాయి్‌సతో వలపు వల పన్నుతున్న కిలాడీలు అధికమయ్యారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఈ వలలో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. కొందరు వారి ప్రమేయం లేకుండా, మరికొందరు స్వయంకృతాపరాధంగా కిలాడీలకు చిక్కి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇలా చిక్కిన వారి నుంచి వేలు మొదలు లక్షల రూపాయల వరకు దండుకుంటున్నారు. కరోనా లాక్‌డౌన్‌తో పెరిగిన ఆన్‌లైన్‌ చాటింగ్‌ను ఆసరా చేసుకొని కిలాడీలు రెచ్చిపోతున్నారు. 


ఉమ్మడి జిల్లాలో గత కొన్ని రోజులుగా పోలీసుల కు హనీ ట్రాప్‌ ఫిర్యాదులు 30వరకు రాగా, ఫిర్యాదు చేయని బాధితులు చాలామందే ఉన్నారని సమాచా రం. ఈ వలలో చిక్కుకున్న వారిలో యాదాద్రి జిల్లాకు చెందిన ఓ ఉద్యోగ సంఘం నేత ఉండగా, జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యాపారి రూ.3లక్షల వరకు కిలాడీకి చెల్లించాడు. ఇటివల సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెం దిన ఇద్దరు పిల్లల తండ్రి కూడా ఈ వలలో చిక్కుకొని చివరికి పోలీసులను ఆశ్రయించాడు.


వల ఇలా పన్నుతారు..

ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాలు కేంద్రంగా ఆన్‌లైన్‌లో వలపు వల కొనసాగుతోంది. పురుషుల సెల్‌ నంబర్‌కు మహిళలు, మహిళల నంబర్‌కు పురుషులు వాట్సప్‌, గూగుల్‌ డ్యూయో ఇతర మాధ్యమాల ద్వారా వీడియో కాల్‌ చేస్తారు. ఎవరో తెలిసిన వారుగా భావించి వీడియో కాల్‌కు కనెక్ట్‌ అవ్వగానే అవతలి వ్యక్తి నగ్నంగా కనిపిస్తారు. ఇదేంటని మనం కాల్‌ కట్‌చేసినా జరగాల్సిందంతా జరిగిపోతుంది. నగ్నంగా ఉన్న వ్యక్తి మన వీడియో అత డి మొబైల్‌లో కనిపించగానే స్ర్కీన్‌ షాట్‌ తీస్తారు. ఆ స్ర్కీన్‌ షాట్‌లో మన ముఖం పూర్తిగా, ఒక మూ లకు అతడు లేదా ఆమె చిత్రం చిన్నగా నగ్నం గా కనిపిస్తుంది. మరికొన్ని ఉదాంతాల్లో సెల్‌ ఫోన్‌కు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ లింక్‌ వస్తుంది. దీన్ని క్లిక్‌ చేయగానే అవతలి వైపు నుంచి కలుపుగోలుగా, స్నేహపూర్వకంగా మాట్లాడే మహిళ లేదా పురుషులు లైన్‌లోకి వస్తారు. వీడియో చాటింగ్‌ చేస్తారు. మత్తెక్కించే మాటలతో ఆర్థిక స్థోమత తెలుసుకోవడంతో పాటు సన్నిహితుల పేర్లు, వారి వాట్సప్‌ నంబర్లు అడిగి తెలుసుకుంటారు. చివరికి ఆ కిలాడీల మోజులోపడి ఇరువైపులా న్యూడ్‌ చాటింగ్‌కు సిద్ధమవుతారు. అయితే వారు ప్రతీ ఆడియో, వీడియో చాటింగ్‌ను రికార్డ్‌ చేస్తారు. ఇదేమీ తెలియని ఇవతలివారు చాటింగ్‌లో మితిమీరిన స్వేచ్ఛను ప్రదర్శిస్తారు. న్యూడ్‌ చాటింగ్‌ అనంతరం ఆ కిలాడీలు అసలైన వల విసురుతారు. వీడియో కాలింగ్‌ ద్వారా, ప్రెండ్‌ రిక్వెస్ట్‌ లింక్‌ ద్వారా చేసిన చాటింగ్‌ ఫొటోలను పోస్ట్‌చేసి అడిగినంత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తారు. లేదంటే వాటిని సోషల్‌ మీడియాలో పెడతామని, వలపు మోజులో ఇచ్చిన సన్నిహితుల వాట్సప్‌ నంబర్లకు కూడా పోస్ట్‌చేస్తామని బెదిరిస్తారు. అడిగినంత డబ్బును ఫోన్‌పే, గూగుల్‌పే ఇతర మాధ్యమాల ద్వారా పంపాలని డిమాండ్‌ చేస్తారు. ఇవతలి వారి ఆర్థిక స్థోమత, మాట్లాడే తీరు ఆధారంగా వసూలు చేసి విడిచిపెడతారు. డబ్బు ఇచ్చుకోలేని వారికి నరకం చూపిస్తారు. దీంతో ఎదుర్కొంటున్న సమస్యను ఇతరులకు చెప్పలేక, పోలీసులకు ఫిర్యాదుచేస్తారమోననే భయంతో కిలాడీలు అడిగినంత ఇచ్చుకునే స్థోమతలేక మానసిక ఒత్తిడికి గురవుతుంటారు.


బాధితుల్లో ఓ ఉద్యోగ సంఘం నేత, మరో వ్యాపారి

వలపు వలలో చిక్కుకున్నవారిలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉండ డం ఆందోళన కలిగిస్తోంది. అయితే కొద్దిమంది అవగాహనరాహిత్యంతో వలపు వలలో చిక్కుకుంటుండగా మరికొద్ది మంది అతి ఉత్సాహంతో బలవుతున్నారు. యాదాద్రి జిల్లా కేంద్రం భువనగిరిలోని ఓ ఉద్యోగ సంఘం నేత ఈ వలపు వలలో చిక్కుకొని దఫాల వారీగా రూ.50వేలకు పైగా చెల్లించినట్టు తెలిసింది. అదేవిధంగా స్థానికంగా పేరున్న ఓ వ్యాపారి సైతం రూ.3లక్షల వరకు సమర్పించుకున్నాడు. అయినా  ఇంకా ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడడంతో, ఆత్మహత్య చేసుకుంటానని వీడియోకాల్‌ ద్వారా ప్రాధేయపడడంతో అతడిని వదిలేసినట్టు చర్చ సాగుతోంది. పది రోజుల క్రితం సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన వివాహితుడైన ఓ ప్రైవేటు ఉద్యోగి సైతం ఈ వల పు వలలో చిక్కుకొని రూ.7వేలు చెల్లించాడు. అయినా ఆ కిలాడీలు విడిచిపెట్టకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. మూడు నెలల కాలంలో యాదాద్రి జిల్లా నుంచి ఈ తరహా ఫిర్యాదులు 15కు పైగా వచ్చినట్టు రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు తెలిపారు. నల్లగొండ జిల్లాలో 10, సూర్యాపేట జిల్లాలో 5 ఫిర్యాదులు వచ్చినట్టు పోలీసులు చెప్పారు. వాస్తవంగా బాధితులు మాత్రం దీనికి పలు రెట్లు అధికంగా ఉన్నట్టు సమాచారం.


ఇలా ఫిర్యాదు చేయవచ్చు

వలపు వలలో చిక్కుకున్న బాధితుల్లో పది శాతం మందే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ తరహా ఉదంతంపై పోలీసులకు ఎలా ఫిర్యాదు చేయాలో చాలా మందికి తెలియక, తెలిసినా పరువు పోతుందనే భయంతో ఫిర్యాదుకు వెనకడుగువేస్తున్నారు. అయితే బాధితులు నేరుగా పోలీ్‌సస్టేషన్‌లకు వెళ్లకుండానే జాతీయస్థాయి కంట్రోల్‌ రూం టోల్‌ఫ్రీ నంబర్‌ 155260కు, నేషనల్‌ సైబర్‌క్రైం పబ్లిక్‌ పోర్టల్‌ ఛిడఛ్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీుఽలో లాగిన్‌ అయి వివరాలు వెల్లడిస్తే కేసు నమోదుచేసి దర్యాప్తు కోసం సంబంధిత పోలీ్‌సస్టేషన్లకు బదిలీ చేస్తారు. అయితే ఈ ఫిర్యాదులు, విచారణ మొత్తం గోప్యంగా ఉంటుంది. ఫోన్‌ చేసి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెల్లడిస్తే కేసు నమోదుచేసి దర్యాప్తు కోసం సంబంధిత పోలీసులకు బదిలీ చేస్తారు.


గుర్తుతెలియని వీడియో కాల్స్‌తో జాగ్రత్త : ఎస్‌.హరినాథ్‌, ఏసీపీ, సైబర్‌క్రైం, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ 

గుర్తు తెలియని వీడియో కాల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో సమాధానం ఇవ్వవద్దు. అవసరమైతే ఆ నెం బర్‌ను ట్రూకాలర్‌లో చెక్‌ చేసుకోవాలి. కాల్‌ చేసేవారు ఎవరు, ఎందుకు చేస్తున్నారో తెలపాలని మెసేజ్‌ చేయాలి. అప్పటి వరకు ఎదుటి వ్యక్తులను మీరు గుర్తించగలిగితేనే వీడియోకాల్‌కు కనెక్ట్‌ అవ్వాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా ఆ నంబర్‌ను బ్లాక్‌చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అలాగే ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ లింక్‌లను ఎట్టి ప రిస్థితుల్లో క్లిక్‌ చేయవద్దు. అవగాహనరాహిత్యంతో క్లిక్‌చేస్తే ఆ వెంటనే డిస్‌ కనెక్ట్‌ కావాలి. ఇబ్బందులు పడకముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వేధింపులకు గురైతే సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలి.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.