ఆయుర్వేద ఆస్పత్రిలో అందని వైద్య సేవలు

ABN , First Publish Date - 2022-05-03T06:03:36+05:30 IST

ప్రజలకు మెరుగైన ఆయుర్వేద వైద్యం అందించిన తూప్రాన్‌ ఆయుర్వేద ఆస్పత్రిలో సిబ్బంది కొరత వేధిస్తోంది.

ఆయుర్వేద ఆస్పత్రిలో అందని వైద్య సేవలు
తూప్రాన్‌ ఆయుర్వేద ఆస్పత్రిలో ఖాళీగా దుమ్ముపట్టి ఉన్న రోగుల మంచాలు

 వేధిస్తున్న సిబ్బంది కొరత 

 గత వైభవాన్ని కోల్పోతున్న తూప్రాన్‌ ఆయుర్వేద వైద్యశాల

తూప్రాన్‌, ఏప్రిల్‌ 19: ప్రజలకు మెరుగైన ఆయుర్వేద వైద్యం అందించిన తూప్రాన్‌ ఆయుర్వేద ఆస్పత్రిలో సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో ప్రజలు ఆయుర్వేద వైద్యానికి దూరమవుతున్నారు. ఆస్పత్రికి పూర్వవైభవం తెస్తామన్న అధికారులు, నాయకుల హామీలు అలాగే మిగిలిపోయాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనే ఏకైక 9 పడకల ఆయుర్వేద ఆస్పత్రిగా తూప్రాన్‌ ఆయుర్వేద ఆస్పత్రికి పేరుంది. తూప్రాన్‌లో 1951లో ఆయుర్వేద డిస్పెన్సరీగా సేవలు మొదలయ్యాయి. 1964లో డిస్పెన్సరీని 4 పడకల ఆస్పత్రిగా, 1984లో 9 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేశారు. అప్పట్లో హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల నుంచి రోగులొచ్చేవారు. స్థానిక నాయకుల కృషితో 9 పడకల ఆస్పత్రిని 20 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేశారు. రూ.56 లక్షలతో అదనపు భవన నిర్మాణం పూర్తి చేసి, 2018 ఆగస్టు 29న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు. ఉమ్మడి ఏపీలో ఉన్న ఆరేడు ఆయుర్వేద ఆస్పత్రుల్లో ఒకటిగా తూప్రాన్‌ ఆయుర్వేద ఆస్పత్రి ఏర్పాటైంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో తూప్రాన్‌ ఆస్పత్రితోపాటు, 14 డిస్పెన్సరీలు రోగులకు వైద్యం అందజేస్తున్నాయి. 


సిబ్బంది కొరతతో ఇక్కట్లు

తూప్రాన్‌ ఆస్పత్రిలో సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌, స్టాఫ్‌నర్సు, ఫార్మాసిస్టు, జూనియర్‌ అసిస్టెంట్‌ ఇలా 15 పోస్టులు ఉన్నాయి. బదిలీలు, పదోన్నతి పొందడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. 15 పోస్టులకు ప్రస్తుతం సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ రుక్సానా అన్వర్‌, ఫార్మాసిస్టు వెంకటేశ్వర్‌గౌడ్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ సురేష్‌, పీటీఎస్‌ విజయమ్మ మాత్రమే పని చేస్తున్నారు. దీంతో సేవలు అందక రోగుల సంఖ్య తగ్గిపోతోంది. 


ప్రకటనలకే పరిమితమైన హామీలు

తూప్రాన్‌ ఆయుర్వేద ఆస్పత్రి పని తీరును తెలంగాణ ఫుడ్స్‌ మాజీ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి ఆయూష్‌ కమిషనర్‌ అలుగు వర్షిణి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయూష్‌ కమిషనర్‌ జనవరి 6న తూప్రాన్‌ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిని బాగు చేసి, ఆస్పత్రి స్థాయిని 40 పడకలకు పెంచనున్నట్లు వర్షిణి పేర్కొన్నారు. సోమ, మంగళ, బుధవారాల్లో నిపుణులైన వైద్యులతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయిస్తానని చెప్పారు. తూప్రాన్‌ ఆస్పత్రిలో రోగులకు భోజనం అందజేసేందుకు రూ.2.40 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కమిషనర్‌ ఆదేశాలతో జనవరి 19న ఆయూష్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అన్వర్‌, రీజినల్‌ డిప్యూటీ డెరెక్టర్‌ రవినాయక్‌ ఆస్పత్రిని సందర్శించారు. పాత ఆయుర్వేద ఆస్పత్రులో రోగులను తిరిగి ఇన్‌పేషేంట్స్‌గా చేర్చుకోడానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. తూప్రాన్‌లో ప్రథప్రథమంగా త్వరలోనే వెల్‌నెస్‌ సెంటర్‌ను ప్రారంభించడంతో పాటు నేచర్‌ క్యూర్‌ కూడా అందించబోతున్నట్లు ప్రకటించారు. అందుకు రూ.9 నుంచి12 లక్షలు ఖర్చు చేయబోతున్నట్లు వివరించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారులు ప్రకటించినట్లు వైద్య శిబిరాల జాడే లేకుండా పోయింది. పంచకర్మ వైద్యంతోపాటు, రోగులకు మెరుగైన సేవలు అందిస్తామని ప్రకటించినప్పటికీ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. 

 

Read more