అందని రుణం

ABN , First Publish Date - 2022-01-28T06:36:29+05:30 IST

జిల్లాలో యాసంగి సీజన్‌లో సాగు విస్తీర్ణం పెరుగుతున్నా రుణాల పంపిణీ ముందుకు సాగడం లేదు. జిల్లాలో యాసంగి రుణాలను మొదలుపెట్టి మూడు నెలలవుతున్నా ఇప్పటికీ నిర్ణయించిన లక్ష్యంలో సగం మాత్రమే పంపిణీ చేశారు.

అందని రుణం

యాసంగి పంట రుణాల పంపిణీలో కరుణ చూపని బ్యాంకర్లు

లక్ష్యం రూ.1,421 కోట్లు.. ఇచ్చింది రూ.785 కోట్లు మాత్రమే

రుణాల కోసం రైతులకు తప్పని ఎదురు చూపులు

జిల్లాలో 3లక్షల 65వేలకు పైగా పంటలను సాగు విస్తీర్ణం

నిజామాబాద్‌, జనవరి 27(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో యాసంగి సీజన్‌లో సాగు విస్తీర్ణం పెరుగుతున్నా రుణాల పంపిణీ ముందుకు సాగడం లేదు. జిల్లాలో యాసంగి రుణాలను మొదలుపెట్టి మూడు నెలలవుతున్నా ఇప్పటికీ నిర్ణయించిన లక్ష్యంలో సగం మాత్రమే పంపిణీ చేశారు. పంటల పెట్టుబడి కోసం ఇచ్చే రుణం గడువు మార్చివరకు ఉన్నా ఎక్కువ మంది రైతులకు డిసెంబరు, జనవరి నెలల్లోనే అవసరముంటుంది. పంట పెట్టుబడికి ముందుగానే వెచ్చిస్తారు. జిల్లాస్థాయిలో కలెక్టర్‌ ప్రతీవారం రుణాలపై సమీక్షిస్తున్నా కిందిస్థాయిలో బ్యాంకుశాఖల అధికారులు చొరవ చూపకపోవడంతో అనుకున్నవిధంగా రుణాలు పంపిణీ కావడంలేదు. 

       వరితోపాటు ఆరుతడి పంటల సాగు..

జిల్లాలో యాసంగి సాగు నవంబరులోనే మొదలైంది. జిల్లాలోని రైతులు నవంబరు నుంచి జనవరి చివరి వరకు వరితో పాటు ఆరుతడి పంటలను వేస్తారు. కొంతమంది రైతులు ఫిబ్రవరిలో కూడా ఆరుతడి పంటలైన నువ్వు, సజ్జ, కూరగాయలు సాగు చేస్తారు. జిల్లాలో 80 శాతానికి పైగా రైతులు జనవరి లోపే పంటలను వేసి యాసంగి సాగు కొనసాగిస్తారు. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం వరి సాగు విస్తీర్ణం తగ్గించి ఆరుపంటలు సాగుచేయాలని ప్రకటన చేయడంతో కొద్ది రోజులు సందిగ్ధంలో ఉన్నా ఎక్కువ మంది రైతులు పంటలను వేశారు. వరిని కూడా అధికంగా సాగు చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు వరినాట్లు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది.

      2,55,221 ఎకరాల్లో వరి సాగు..

జిల్లాలో ఇప్పటి వరకు ఈ యాసంగిలో 3లక్షల 65వేలకు పైగా పంటలను సాగుచేశారు. జిల్లాలో ఈ యాసంగిలో అత్యధికంగా రైతులు వరిపంటను వేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 2లక్షల 55వేల 221 ఎకరాల్లో వరి పంటను సాగుచేశారు. జిల్లాలో ఇప్పటి వరకు సాగైనవిస్తీర్ణంలో 70 శాతానికి పైగా ఈ పంటనే వేశారు. ప్రభుత్వం కొనుగోలు చేయకున్నా పంట చేతికి వచ్చిన సమయంలో అమ్ముకునేందుకు రైతులు సన్న రకాలను ఈ దఫా ఎక్కువగా సాగు చేస్తున్నారు. జిల్లాలో వరితో పాటు ఆరుతడి పంటలైన మొక్కజొన్న 12121 ఎకరాల్లో వేశారు. శనగ 24వేల 661 ఎకరాల్లో వేశారు. జిల్లాలో వరి సాగు తర్వాత అత్యధికంగా ఆరుతడి పంటల సాగైన ఎర్రజొన్నను ఎక్కువ మంది రైతులు వేశారు. జిల్లాలో ఈ ఎర్రజొన్నను 41వేల 749 ఎకరాల్లో పంటను వేశారు. విత్తన డీలర్లతో ఒప్పందం చేసుకుని రైతులు ఈ పంట సాగు చేశారు. జిల్లాలో పొద్దుతిరుగుడు 15,500 ఎకరాల్లో సాగు చేశారు. ఈ పంటలతో పాటు ఆముదం, నువ్వులు, గోధుమ, సోయాబిన్‌, మినుములతో పాటు ఇతర పంటలను వేశారు. ఫిబ్రవరిలో పసుపు సాగు చేసిన భూముల్లో సజ్జ, మొక్కజొన్న, నువ్వు పంట వేస్తారు. వీటితో పాటు కొంతమంది రైతులు వేసవిలో కూరగాయల సాగు కూడా కొనసాగిస్తారు. పంటలు వేసే కాలం దాటుతుండడంతో ఈ నెలాఖరులోపు జిల్లాలో నాలుగున్నర లక్షల ఎకరాల వరకు సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో పంటల విస్తీర్ణం పెరిగిన విధంగానే ప్రతి సంవత్సరం రుణ పంపిణీ కూడా చేస్తున్నారు. యాసంగిలో రైతులు ఇబ్బంది పడకుండా ఈ రుణాలను అందిస్తున్నారు.

     యాసంగిలో రూ.1421 కోట్ల రుణ లక్ష్యం.. 

జిల్లా బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఈ యాసంగిలో 1421 కోట్ల రూపాయలను పంట రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. గత నవంబరు నుంచి జిల్లాలో యాసంగి రుణ పంపిణీ మొదలుపెట్టారు. జిల్లాలో ఇప్పటి వరకు 785 కోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేశారు. నిర్ణయించిన లక్ష్యంలో 53శాతం పంట రుణాలను ఇచ్చారు. జిల్లాలో ఇప్పటి వరకు 61,630 మంది రైతులకు ఈ రుణాలను పంపిణీ చేశారు. యాసంగిలో ఎక్కువ మంది రైతులు వరిసాగునే చేస్తున్నారు. గడిచిన ఐదు సంవత్సరాల నుంచి పరిశీలిస్తే వరిసాగే పెరిగింది. యాసంగిలో కూడా వరిసాగుచేసే రైతులే ఎక్కువగా పంట రుణాలను పెట్టుబడి కోసం తీసుకుంటున్నారు. డిసెంబరు, జనవరి నెలలో ఈ వరినాట్లను ఎక్కువగా వేస్తున్నారు. ఈ సమయంలోనే రైతులకు దున్నుడు, నాట్లు, ఎరువుల కోసం పెట్టుబడికి డబ్బులు ఎక్కువగా అవసరమవుతాయి. వీటి కోసం ఎక్కువశాతం బ్యాంకులపైన ఆఽధారపడుతున్నారు. ప్రతి సంవత్సరం యాసంగిలో 80శాతం వరకు రుణాలను అందిస్తున్నారు. రైతులు జనవరి చివరి వరకే ఎక్కువగా ఈ పంట రుణాలను తీసుకుంటారు. ఫిబ్రవరి నుంచి రుణాలకు అంతగారారు. ప్రధాన పెట్టుబడికి బ్యాంకులతో పాటు ఇతరుల వద్ద రుణాలను తెచ్చుకుని పంటలను వేస్తారు. ఈ పంట రుణాలను త్వరగా పంపిణీ చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి ప్రతీవారం సమీక్షిస్తున్నారు. అన్ని శాఖల పరిధిలో వేగంపెంచాలని కోరుతున్నారు. బ్యాంకులకు చెందిన ప్రతీశాఖ నిర్ణయించిన లక్ష్యం ప్రకారం రుణాలను మంజూరు చేయాలని ఆదేశాలను ఇచ్చారు. జిల్లాలో వ్యవసాయ పంట రుణాలను నిర్ణయించిన లక్ష్యానికి అనుగుణంగా అందిస్తున్నామని లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు. యాసంగి సీజన్‌కు అనుగుణంగా రుణ పంపిణీ చేస్తున్నామన్నారు. అన్ని బ్యాంకులు లక్ష్యాలు సాధించేవిధంగా చూస్తున్నామని తెలిపారు.

Updated Date - 2022-01-28T06:36:29+05:30 IST