నీ సుందర హాసమే

ABN , First Publish Date - 2021-01-04T07:02:31+05:30 IST

గగనాలను జలమయం చేసే మేఘాల్లోంచి కురిసే చినుకుల మధ్య తటిల్లతలు నీ వడ్డాణానికి వేలాడే మువ్వల కాంతులు....

నీ సుందర హాసమే

గగనాలను జలమయం చేసే మేఘాల్లోంచి

కురిసే చినుకుల మధ్య తటిల్లతలు 

నీ వడ్డాణానికి వేలాడే మువ్వల కాంతులు


మెరుపుతీగల విద్యున్మాలలు ధరించి 

ఎండవానల మధ్య నుంచి 

నువ్వో చిరుమందహాసం చేస్తావు

నీ మందహాసం చీకటి మైదానాల మీద 

చల్లగాలిలా ప్రసరిస్తుంది

నీ మందహాసం చీకటి అడవుల మీద 

మిణుగురు గుంపులను ఎగరేస్తుంది

నీ మందహాసం నల్లని రాత్రిలో ప్రవహించే

నదుల మీద నక్షత్ర ప్రతిబింబాలను చల్లుతుంది


నీ మందహాసం నిదురించే సముద్రాల 

అంతరంగంలోని అట్టడుగు వెచ్చని జలాల్లో 

చేపల గుంపులై ఈదే బంగారు దీపాలతో 

పగడాల ద్వీపాలను వెలిగిస్తుంది 


నీ మందహాసం బంగారు సముద్రాల మీద సూర్యకాంతిగా 

నదుల ముఖచంద్రబింబాలకు సూర్య తిలకాలుగా మారి

చరాచరాల సంధ్యా వందనాలు స్వీకరిస్తుంది


నీ మందహాసం మహా జలపాతాలను

పెంచి పోషించే మహానిశ్శబ్దం

గ్రహగోళాల పెనుఘోష లోపలి

నీ దృశ్యంలో జీవించడమే ధ్యానం


నీ సుందర మందహాస సౌందర్యంతో

అలా అలల కాలి మువ్వల సవ్వడుల మధ్య 

నిశ్శబ్ద పుష్పాలపై ఎగిరే తూనీగలతోపాటు

కేవలం జీవించడమే ధ్యానం


అలా అడవుల్లో రగిలిన తురాయి జ్వాలల మీద 

సంధ్యా రాగాల్లో ఎగిరే పక్షులతో పాటు

వాటిలా జీవించడమే ధ్యానం


నువ్వు ఆకాశాన్ని చీల్చుకుని

ఉరుములు మెరుపులు వెదజల్లుతూ

గలగలా పకపకా నవ్వినపుడు

కురిసే వెచ్చని సూర్యకాంతిలో 

చెట్టూ చేపా పశువూ పక్షీ మనిషీ

జలకాలాడుకోవడమే ధ్యానం 

ఊరక జీవించడమే జీవన మహోత్సవం


ఆకుపచ్చని పర్వతాల మధ్య 

నీ చల్లని చిరునవ్వు పరిచిన నీడలు

ఎండా నీడా దోబూచుల రంగుల్లో

విరబూసిన అందాల లోయల్లో 

వాటితో పాటు ఊరికే బతకడమే నిత్య బ్రహ్మోత్సవం


ఈ నేల మీది చరాచరాల్లో 

నీ చల్లని చూపులు నాటిన విత్తనాలు

మట్టిని చీల్చుకుని మబ్బుల్ని చీల్చుకుని

గాలిని చీల్చుకుని గగనాన్ని చీల్చుకుని

ఎదిగి ఎదిగి అంతరిక్షంలో నక్షత్రాలై పుష్పించ లేదా


నీ నిర్గుణ నైరూప్య హృదయానికి 

ఈ అనంత సృష్టిని హత్తుకునేది నువ్వే కదా

అనంత సృష్టి వాహిని నువ్వే కదా! నీ నవ్వేకదా!


వసీరా

91777 27076

Updated Date - 2021-01-04T07:02:31+05:30 IST