Abn logo
May 17 2021 @ 01:01AM

సీసీ రోడ్డుపైనే బీటీ రోడ్డు నిర్మాణం

పాత సీసీ రోడ్డును సక్రమంగా క్లీన్‌ చేయకుండానే బీటీ వేస్తున్న వైనం
నాణ్యతా ప్రమాణాలు దూరం
అలాగే కొనసాగుతున్న పనులు
సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువు

ఖానాపూర్‌ రూరల్‌, మే 16: కొత్తగా రోడ్డు పనులు చేస్తుంటే సంబరమే.. కాని పర్యవేక్షణ లోపం. నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోకపోవటం వలన ఆ పనులు షాపంగా మారుతాయి. పాత సీసీ రోడ్డుపైననే కొత్తగా బీటీ రోడ్డును నిర్మిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు పనులు చేస్తే నాలుగు కాలాల పాలు నిలువాల్సిన రోడ్డు అనతి కాలంలోనే దెబ్బ తినే అవకాశం లేక పోలేదు. ఖానాపూర్‌ పట్టణంలోని కొత్త బస్టాండ్‌కు వెళ్ళే రోడ్డు పనులు రెండు రోజుల నుండి కొనసాగుతున్నాయి. అయితే గతంలో వేసిన సిసి రోడ్డు పైనే ప్రస్తుతం బీటీ రోడ్డును నిర్మిస్తున్నారు. రూ.18 లక్షలు 14వ పైనాన్స్‌ నిధులతో ఈ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో ఇరువైపుల పార్కింగ్‌ టైల్స్‌ కూడా నిర్మించనున్నారు. కాని ప్రస్తుతం బీటీ రోడ్డు పను లు చేసే ముందు పాత సీసీ రోడ్డులో నిండుకున్న మట్టి చెత్తా చెదారం, దుమ్మును క్లీన్‌ చేసి నీళ్లతో రోడ్డు ప్రాంతాన్ని శుభ్రపర్చాలి. కానీ సక్రమం గా క్లీన్‌ చేయకుండానే పనులు మాత్రం ప్రారంభించారు. పార్కింగ్‌ టైల్స్‌ వేసే స్థలంలో మాత్రం మట్టిని తొలిగించారు. కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించక పోవటం శోచనీయం. హడావిడిగా మాత్రం పనులు చేస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించి చేసే పనులు ఇలా చేస్తే ప్రభుత్వ ధనం వృథా కావటమేనని పలువురు అంటున్నారు.
అధికారుల పర్యవేక్షణ లేని వైనం
కాగా, రూ.18 లక్షలతో చేస్తున్న ఈ పనుల విషయంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువైంది. బస్టాండ్‌కు వెళ్లే ప్రధాన రోడ్డు పనులు అస్తవ్యస్తంగా జరిగితే, రోడ్డు ఎన్ని రోజులు నిలిచి ఉంటుందో? తెలియని పరిస్థితి. పట్టణ నడి బొడ్డున జరుగుతున్న పనులు ఇంత నిర్లక్ష్యంగా చేస్తే ప్రజాధనం వృఽథా కావటమే. సంబంధిత అధికారులు ఉండి పనులు పర్య వేక్షించి నాణ్యతాయుతంగా చేయించాల్సిన అవసరం ఉంది.
పనులు దగ్గర ఉండి చేయిస్తాం : సంతోష్‌, మున్సిపల్‌ డీఈ
కొత్త బస్టాండ్‌ వద్ద జరుగుతున్న పనులు నాణ్యతగా చేయిస్తున్నాం. అక్కడ వర్కు ఇన్స్‌పెక్టర్‌ ఉండి పనులు చూస్తున్నాడు. 2018-19  గాను రూ.18లక్షలతో 14వ పైనాన్స్‌ నిధులతో పనులు జరుగుతున్నాయి. పాత  సీసీ రోడ్డును క్లీన్‌ చేయించి పనులు చేస్తున్నాం.

Advertisement