ఒత్తిడిని జయిద్దాం... విజయాన్ని సాధిద్దాం

ABN , First Publish Date - 2022-08-07T05:42:51+05:30 IST

ప్రతి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో ఒత్తిడికి గురవుతుంటాడు. మానసిక ఒత్తిడికి గురికాని వ్యక్తి ఉండడంటే ఆశ్యర్యపోవల్సిన పనిలేదు. అయినదానికి కానిదానికి కొంతమంది ఒత్తిడికి గురవుతుంటారు.

ఒత్తిడిని జయిద్దాం... విజయాన్ని సాధిద్దాం


  కౌన్సెలింగ్‌తో సత్ఫలితాలు
  విద్యార్థుల్లో భయంపోగొట్టేందుకు దోహదం
  మానసిక సమస్యలనూ అధిగమించవచ్చు

ఎచ్చెర్ల: ప్రతి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో ఒత్తిడికి గురవుతుంటాడు. మానసిక ఒత్తిడికి గురికాని వ్యక్తి ఉండడంటే ఆశ్యర్యపోవల్సిన పనిలేదు. అయినదానికి కానిదానికి కొంతమంది ఒత్తిడికి గురవుతుంటారు. విద్యార్థి దశలో అయితే మరీనూ. కొంత మంది విద్యార్థులకు పరీక్షలంటేనే ఆందోళన.. మరికొంతమంది విద్యార్థులకు నలుగురిలో మాట్లాడాలంటేనే ఇబ్బంది.. ఇంకొంతమంది విద్యార్థులు ఫలితాన్ని ముందే ఊహించి జ్వరం కొని తెచ్చు కుంటుంటారు.. ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా ఊహించుకొని మదనపడు తుంటారు. వీరిని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించి, అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు ఏర్పడతాయి. కౌన్సెలింగ్‌తో ఒత్తిడికి దూరమై సాధారణ జీవితాన్ని గడిపేందుకు వీలుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పట్టణాలు, నగరాల్లో ఎన్నో కౌన్సెలింగ్‌ సెంటర్లు ఉన్నాయి.

కౌన్సెలింగ్‌ అంటే..



కౌన్సెలింగ్‌ అవసరమనుకున్న వ్యక్తి ముందుగా తనను తాను అర్థం చేసుకో వాలి. విద్యార్థుల్లో ఉండే సామర్థ్యాలు, బలహీనతలు తెలుసుకొని వారి లక్ష్యాన్ని వారే నిర్దేశించు కొనేలా కౌన్సెలింగ్‌ కేంద్రాలు సాయపడతాయి. చాలామంది విద్యార్థులు కొత్త కోర్సుల్లో చేరేటప్పుడు అక్కడి పరిసరాలకు సర్దుబాటు కాలేక, కొత్త వ్యక్తులతో ఇమడలేక, విద్యా సంస్ధల కఠిన నియమ నిబంధనలతో ఉండలేక తిరిగి వెనక్కి వచ్చేస్తున్న సంఘటనలు చూస్తున్నాం. మరికొంత మంది విద్యార్థులు దూర ప్రాంతాల్లో చదువుకునేందుకు అమితాసక్తి చూపుతారు. ఆ తర్వాత అంతే వేగంతో అక్కడి పరిస్థితులు నచ్చలేదనో, హాస్టల్‌లో భోజనం సరిగాలేదనో, అధ్యాపకుల తీరు సరిగా లేదనో ఇలా ఏదో ఒక కారణంతో వెనక్కి వచ్చేస్తుంటారు. ఈ సమస్యను అధిగమించాలంటే కౌన్సెలింగ్‌ తప్పనిసరి.  విద్యార్థుల సహజ సామర్థ్యాన్ని, అభిరుచిని, వైఖరిని, మూర్తిమత్వాన్ని సైకలాజికల్‌ టెస్ట్‌ ద్వారా తెలుసుకొని, వారి జీవిత లక్ష్యాన్ని నిర్ణయించడానికి కౌన్సెలింగ్‌ ఉపయోగపడుతుంది.


ప్రేరణ ద్వారా..


ప్రేరణ ద్వారా విద్యార్థుల్లో ఉన్న భయాన్ని దూరం చేయోచ్చు. సామర్థ్యానికి తగినంత సాధన చేయని విద్యార్థులకు తగిన ప్రేరణ, ప్రోత్సాహాన్ని కౌన్సెలింగ్‌ ద్వారా అందించవచ్చు. విద్య పట్ల అభిరుచి (స్టడీ హేబిట్‌) కలిగేలా విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చు. విద్యార్థులు పోటీని తట్టుకోవడానికి తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు.  ముఖ్యంగా పరీక్ష సమయంలో విపరీతమైన టెన్షన్‌కు గురవుతుంటారు. దీనంతటికీ కారణం సరైన ప్రేరణ లేకపోవడమే. విద్యార్థుల్లో భయాన్ని తొలగించేందుకు ముందు నుంచే ప్రేరిపించాలి. పరీక్షలంటే భయం అనే మాటను మనసు నుంచి తీసేలా విద్యార్థులకు ప్రేరణ ఇవ్వాలి.


మానసిక సమస్యలను అధిగమించేలా..


మానసిక సమస్యలైన ఒత్తిడి, ఆందోళన, భయం, ఆత్మన్యూనత భావన, వ్యాక్యులత, సంఘర్షణ, కుంఠనం, పరస్పర సంబంధాలను నెలకొల్పుకోలేక పోవడం, ఉద్వేగాలను అదుపులో ఉంచుకోలేకపోవడం వల్ల అకడమిక్‌గా వెనుకబడి పోవల్సి ఉంటుంది. మానసిక సమస్యలను అధిగమిస్తేనే విజయ పఽథంవైపు నడవగలరు. నలుగురితో కలవడం వల్ల, గ్రూప్‌గా చదవడం వల్ల కొన్ని సమస్యలనుంచి బయటపడొచ్చు. ఒంటరిగా ఆలోచనలను బ్రేక్‌ చేయాలి. ఎలాంటి సందేహాలున్నా తల్లిదండ్రులకు, స్నేహితులకు, అధ్యాపకులతో చర్చించడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఈ తరహా సమస్యల నుంచి బయటపడేందుకు కౌన్సెలింగ్‌ దోహదపడుతుంది.


 ర్యాగింగ్‌కు పాల్పడకుండా-


విద్యా సంవత్సరం ప్రారంభంలో ర్యాగింగ్‌ అనే పదం తరుచూ వింటుంటాం. ర్యాగింగ్‌కు పాల్పడకుండా సీనియర్‌ విద్యార్థులకు ముందుగా కౌన్సెలింగ్‌ ఇస్తే మంచిది. జూనియర్‌ విద్యార్థులు అక్కడి పరిస్థితులను ముందుగా అర్ధంగా చేసుకొని, స్నేహంగా మెలగడం చేసినట్లయితే ర్యాగింగ్‌ అనే పదం ఉద్భవించదు.


కౌన్సెలింగ్‌తో ప్రయోజనం


ప్రతి వ్యక్తికి ఏదో ఒక సందర్భంలో ఇబ్బందికి గురవుతుంటాడు. అలాంటి సమయంలో తగిన కౌన్సెలింగ్‌ ఇవ్వగలిగితే ఆ సమస్య నుంచి బయట పడే వీలుంటుంది. ముఖ్యంగా విద్యార్థుల్లో ఉండే మానసిక సమస్యలను అధిగమించేందుకు కౌన్సెలింగ్‌ ఉపయోగపడుతుంది.
- డాక్టర్‌ జేఎల్‌ సంధ్యారాణి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌,  బీఆర్‌ఏయూ, ప్రొగెసివ్‌ సైకాలిజిస్ట్‌ల అసోసియేషన్‌ భారత మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు

Updated Date - 2022-08-07T05:42:51+05:30 IST