Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 13 Apr 2022 14:17:53 IST

సినిమా రివ్యూ : ‘బీస్ట్’

twitter-iconwatsapp-iconfb-icon

చిత్రం : బీస్ట్ 

విడుదల తేదీ : ఏప్రిల్ 13, 2022

నటీనటులు : విజయ్, పూజా హెగ్డే, షైన్ టామ్ చాకో, సెల్వరాఘవన్, యోగిబాబు, రెడిన్ కింగ్స్ లీ, అపర్ణాదాస్, అంకుర్ అజిత్ వికల్, వీటీవీ గణేశ్, రెడిన్ కింగ్ స్లే, బిజామ్ సుర్రో, లిల్లీపుట్ ఫరూకీ, షాజీ చెన్ తదితరులు

సంగీతం : అనిరుధ్ రవిచందర్

ఛాయా గ్రహణం : మనోజ్ పరమహంస

మాటలు : హనుమాన్ చౌదరి

నిర్మాణం : సన్ పిక్చర్స్ 

నిర్మాత : కళానిధి మారన్ (తెలుగు నిర్మాత దిల్ రాజు)

దర్శకత్వం : నెల్సన్ దిలీప్ కుమార్ 

దళపతి విజయ్.. తమిళంలో సూపర్ స్టార్ అయినప్పటికీ నిన్నమొన్నటివరకూ తెలుగులో సూర్య, విశాల్, కార్తి స్థాయిలో కూడా ఇమేజ్ లేని నటుడు. గత కొన్నాళ్ళల్లో ‘తుపాకీ, పోలీస్, అదిరింది, మాస్టర్’ లాంటి చిత్రాలతో క్రమేపీ ఇక్కడ తన ఇమేజ్‌ను పెంచుకుంటూ వచ్చాడు. అతడి తాజా చిత్రం ‘బీస్ట్‌’ తెలుగులో భారీ అంచనాల మధ్య ఈ రోజే (ఏప్రిల్ 13) థియేటర్స్‌లోకి వచ్చింది.  ‘కోలమావు కోకిల, డాక్టర్’ చిత్రాలతో తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మరి ‘బీస్ట్’ అంచనాల్ని ఏమేరకు అందుకుంది? ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో థ్రిల్ చేసింది?  రివ్యూలో చూద్దాం.

కథ 

వీరరాఘవ (విజయ్) ఒక ‘రా’ ఏజెంట్. పాకిస్థాన్ టెర్రరిస్ట్ ఉమర్ ఫరూఖ్( లిల్లీపుట్ ఫరూకీ)ను పట్టుకొనే మిషన్‌ను టేకప్ చేసి విజయం సాధిస్తాడు. కానీ ఆ ఆపరేషన్ లో ఒక చిన్నపిల్ల చనిపోతుంది. తన వల్లే ఆ పాప చనిపోయిందనే బాధతో వీరరాఘవ ‘రా’ నుంచి బైటికి వచ్చేస్తాడు. కొన్నినెలల తర్వాత రాఘవకి ప్రీతి (పూజాహెగ్డే) పరిచయం అవుతుంది. ప్రీతి రాఘవతో ప్రేమలో పడుతుంది. ఆమె సహాయంతో ఒక సెక్యరిటీ ఏజెన్సీలో ఉద్యోగం కోసం చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ మాల్‌కు వెళ్ళిన వీరరాఘవకు ఆ మాల్‌ను టెర్రరిస్ట్‌లు హైజాక్ చేశారని తెలుసుకుంటాడు. టెర్రరిస్ట్ ఉమర్ ఫరూఖ్ ను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తారు. అదే సమయంలో ఆ మాల్‌లో ఉండిపోయిన వీరరాఘవ ఉగ్రవాదుల చెర నుంచి ప్రజల్ని ఎలా కాపాడాడు? వాళ్ళని పట్టుకోడానికి వీరరాఘవ వేసిన పథకం ఏంటి? టెర్రరిస్టులకు, అతడికి జరిగిన వార్ ఏంటి అన్నది మిగతా కథ. 

విశ్లేషణ 

కరోనా పుణ్యమా అని కొన్ని నెలల పాటు ఇళ్ళకే పరిమితమైపోయిన జనం.. ఓటీటీలో భాషతో సంబంధం లేకుండా ఎన్నో అద్భుతమైన హైజాకింగ్ కాన్సెప్ట్స్ తో ఉన్న సినిమాల్ని, థ్రిల్లింగ్ మూవీస్‌ను చూసి ఎంజాయ్ చేశారు. వాటితో పోల్చుకొని ‘బీస్ట్’ చూస్తే మాత్రం వారికి నిరాశ తప్పదు. ఒక పెద్ద షాపింగ్ మాల్‌ను హైజాక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకున్నట్టు అనిపించదు. అందులోనూ  కేవలం 153 మంది ప్రజలు మాత్రమే లోపలుండడం కూడా సిల్లీగా అనిపిస్తుంది. అంత పెద్ద మాల్‌లో వేల సంఖ్యలోనే జనం ఉండితీరుతారు. ఇలాంటి లాజిక్‌లేని అంశాలతో పరమ రొటీన్ కథతో ‘బీస్ట్’ సినిమాను వండాడు దర్శకుడు. దానికితోడు ఇలాంటి హైజాకింగ్ థ్రిల్లర్‌కు విజయ్ ఇమేజ్ అడుగడుగునా అడ్డుపడింది. ఇలాంటి సీరియస్ మేటర్ ను కామెడీతో చెప్పాలనుకోవడం కూడా దర్శకుడు చేసిన అతి పెద్ద పొరపాటు. దర్శకుడు నెల్సన్ తొలి రెండు చిత్రాలూ ఇలాంటి థ్రిల్లింగ్ కాన్సెప్ట్స్ తో, కామెడీగా తెరకెక్కినా అందులోని సటిల్డ్ హ్యూమర్ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. అదే ఫార్ములాను విజయ్ లాంటి సూపర్ స్టార్ సినిమాకి అప్లే చేయాలనుకోవడంతో సినిమా ఇటు సీరియస్, అటు కామెడీగా కాకుండా మధ్యరకంగా తయారైంది. విజయ్ బిల్డప్పులు, అతడి వీర సాహసాల మధ్య పవర్ ఫుల్ విలనిజమే లేకుండా పోయింది. టెర్రరిస్టుల్ని వెర్రివెంగళప్పల్ని చేసి హైజాక్ డ్రామాను సిల్లీగా మార్చేశారు. ఇక లోపలున్న జనంలో భయమన్నదే ఏకోశానా లేకుండా.. ఏదో పిక్నిక్ కు వచ్చినట్టు కామెడీ చేస్తుంటే.. ఇంక ఉత్కంఠ ఎక్కడుంటుంది? విజయ్ సినిమాలో హీరోయిన్ ఉండాలి అన్నట్టు పూజా హెగ్డే ని దర్శకుడు ఎంపిక చేశాడని అనిపిస్తుంది. సినిమాలో ఆమె పాత్ర లేకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. మొత్తం సినిమాలో చెప్పుకోదగ్గ ఎపిసోడ్ ఏమైనా ఉందంటే.. అది వీటీవీ గణేశ్, యోగి బాబు నటించిన కొన్ని కామెడీ సన్నివేశాలే. 


సినిమా బిగినింగ్ లో వచ్చే టెర్రరిస్ట్ మిషన్, పాప చనిపోయే సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. అయితే హైజాకింగ్ మిషన్ ను విజయ్ టేకప్ చేసిన తర్వాత వచ్చే సన్నివేశాలు బోరింగ్ గా, పరమరొటీన్‌గా అనిపిస్తాయి. వీరరాఘవ గా విజయ్ యాక్టింగ్, అతడి స్టైల్, ఫైట్స్ మెప్పిస్తాయి. సినిమాలో అతడిది ఒన్ మేన్ షో. అదే సినిమాకి మైనస్ గా మారింది. హీరోయిన్ పూజా హెగ్డే పాత్ర చాలా పేలవంగా అనిపిస్తుంది. దర్శకుడు సెల్వరాఘవన్ పాత్ర ఆకట్టుకుంటుంది. అలాగే కొన్ని సన్నివేశాల్లో కనిపించిన పృధ్వి పాత్ర పర్వాలేదనిపిస్తుంది. అనిరుధ్ సంగీతం మెప్పిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. విజయ్ హీరోయిజం, యాక్షన్ సన్నివేశాలు చూడాలనుకొనేవారికి బీస్ట్ మూవీ బెటర్ ఆప్షన్. 

ట్యాగ్ లైన్ : విజయ్ అభిమానులకు మాత్రమే 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International