బేర్‌ పట్టు

ABN , First Publish Date - 2022-01-21T08:24:53+05:30 IST

భారత స్టాక్‌ మార్కెట్లో బేర్‌ తిష్టవేయడంతో ప్రామాణిక సూచీలు వరుసగా మూడో రోజూ భారీ నష్టాలను చవిచూశాయి. ...

బేర్‌ పట్టు


మూడ్రోజులుగా మార్కెట్‌ విలవిల

60,000 దిగువకు సెన్సెక్స్‌

17,800 స్థాయినికోల్పోయిన నిఫ్టీ


ముంబై: భారత స్టాక్‌ మార్కెట్లో బేర్‌ తిష్టవేయడంతో ప్రామాణిక సూచీలు వరుసగా మూడో రోజూ భారీ నష్టాలను చవిచూశాయి. గురువారం బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 60,000, ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 17,800 స్థాయిని కోల్పోయాయి. ఐరోపా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో పాటు రూపాయి పతనం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మన మార్కెట్‌ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుండటం ఇందుకు ప్రధాన కారణమైంది. దిగ్గజ షేర్లైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, ఇన్ఫోసి్‌సతో పాటు ఫార్మా, ఎంఫ్‌ఎంసీజీ షేర్లు సైతం తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. గురువారం ట్రేడింగ్‌ ముగిసేసరికి, సెన్సెక్స్‌ 634.20 పాయింట్ల నష్టంతో 59,464.62 వద్ద స్థిరపడింది. ఒక దశలో సూచీ 1,000 పాయింట్ల మేర పతనమైనప్పటికీ ఆఖరి గంటలో మళ్లీ కోలుకుంది. నిఫ్టీ 181.40 పాయింట్లు కోల్పోయి 17,757.00 వద్ద క్లోజైంది. గడిచిన మూడు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 1,844 పాయింట్లు, నిఫ్టీ 552 పాయింట్లు పతనమయ్యాయి. మూడ్రోజుల అమ్మకాల హోరులో రూ.6.80 లక్షల కోట్లకు పైగా స్టాక్‌ మార్కెట్‌ సంపద ఆవిరైంది. దాంతో బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.273.21 లక్షల కోట్లకు పడిపోయింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 23 నష్టాలు మూటగట్టుకున్నాయి.  


17,000 స్థాయికి నిఫ్టీ పతనం..? 

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ ట్రేడింగ్‌ ట్రెండ్‌ బలహీనంగా ఉందని, మున్ముందు సూచీలు మరింత కిందికి జారుకోవచ్చని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. నిఫ్టీకి 17,500 స్థాయి వద్ద గట్టి మద్దతు లభించవచ్చని, అక్కడా పట్టు దొరక్కపోతే 17,000 స్థాయికి జారుకునే అవకాశాలు లేకపోలేవని నిర్మల్‌బంగ్‌ సెక్యూరిటీ్‌సకు చెందిన నీరవ్‌ చద్దా అభిప్రాయపడ్డారు. నిఫ్టీ 17,300 స్థాయికి జారుకున్నాక గానీ, కొనుగోళ్ల మద్దతు లభించవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీ్‌సకు చెందిన చందన్‌ తపారియా అన్నారు. 

Updated Date - 2022-01-21T08:24:53+05:30 IST