తోటలో ఉన్న ఎలుగుబంటి
తిరుమలగిరి, మే 17: తిరుమలగిరి మునిసిపల్ కేంద్రం తిరుమల హిల్స్ కాల నీలోకి ఎలుగుబంటి రావటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మంగళవారం ఉదయం ఏడు గంటల సమయంలో ఓ మామిడి తోటలోకి ఎలుగుబంటి రావడాన్ని చుట్టుపక్కల ఇళ్లవారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆ శాఖ సెక్షన్ ఆఫీసర్ ఖదీర్, బీట్ ఆఫీసర్ అచ్చయ్య ఉదయం తొమ్మిది గంటలకు ఘటనా స్థలానికి చేరుకుని హైదరాబాద్ జూపార్క్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అలసిపోయిన ఎలుగు బంటిని కుక్కలు తరమటంతో కదల్లేక మామిడి చెట్టు కిందే ఉండి పోయింది. ఎలుగుబంటి దాడి చేస్తుందేమోనన్న భయంతో కాలనీ వాసులు ఉదయం నుంచి ఇళ్ల నుంచి బయటకు రాలేదు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఎలుగుబంటి వెళ్లిపోవటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలుగుబంటిని బంధించడానికి హైదరాబాద్ జూపార్క్ నుంచి ఎవరూ రాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో గుట్టలు ఉన్నాయని, అక్కడి నుంచి ఎలుగుబంటి ఇటుగా వచ్చి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు.