బీచ్‌ రోడ్లు

ABN , First Publish Date - 2022-08-02T09:22:14+05:30 IST

రుషికొండలో నిర్మాణ పనులు చేపడుతున్న డీఈసీ అనే ప్రైవేటు కంపెనీ.. స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది.

బీచ్‌ రోడ్లు

  • రుషికొండలో ప్రైవేటు కంపెనీ దందా
  • ఫుట్‌పాత్‌ను ఆక్రమించి మరీ ఫెన్సింగ్‌
  • రోడ్డుకు అడ్డంగా మట్టిపోసిన వైనం
  • పర్యాటకులు, స్థానికులు,
  • మత్స్యకారులు వెళ్లకుండా అడ్డుకట్ట
  • తక్షణమే స్పందించాలని
  • కలెక్టర్‌కు ఈఏఎస్‌ శర్మ లేఖ 

విశాఖపట్నం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): రుషికొండలో నిర్మాణ పనులు చేపడుతున్న డీఈసీ అనే ప్రైవేటు కంపెనీ.. స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. బీచ్‌కు వెళ్లే మార్గాలను మూసివేసి.. అటువైపు ఎవరూ వెళ్లకుండా అడ్డుకుంటోంది. పర్యాటకులు, స్థానిక ప్రజలు, మత్స్యకారులు దశాబ్దాలుగా వినియోగిస్తున్న రహదారులను మూసివేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) రుషికొండలో స్టార్‌ హోటల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణం కోసం కొండను తవ్వుతున్న సంగతి తెలిసిందే. ఈ కాంట్రాక్టు పనులు దక్కించుకున్న డీఈసీ సంస్థ నిబంధనలను అతిక్రమించి వ్యవహరిస్తోంది. కేవలం కొండను మాత్రమే తవ్వి, నిర్మాణాలు చేపడుతున్నామని ఒకవైపు ఏపీటీడీసీ హైకోర్టులో చెబుతుంటే.. డీఈసీ మాత్రం మొత్తం 80 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్‌ వేసి, అక్కడకు ఎవరూ రాకుండా అడ్డుకుంటోంది. విశాఖ-భీమిలి బీచ్‌ రోడ్డుకు ఇరువైపులా ఆరు అడుగుల వెడల్పున జీవీఎంసీ అందమైన ఫుట్‌పాత్‌లు నిర్మించింది. రుషికొండలో గీతం కాలేజీకి ఎదురుగా వీఎంఆర్‌డీఏ లక్షలాది రూపాయలు ఖర్చు చేసి అధునాతన బస్‌స్టాపు నిర్మించింది. 


డీఈసీ దానిని కూల్చివేసి.. ఫుట్‌పాత్‌ను కూడా కలిపేసుకొని సుమారు అర కిలోమీటరు పొడవున ప్రధాన రోడ్డు వైపు ఫెన్సింగ్‌ వేసేసింది. దాంతో అక్కడ మార్గం ఇరుగ్గా మారిపోయింది. రుషికొండ బీచ్‌కు వెళ్లడానికి స్థానిక ప్రజలు, మత్స్యకారులు కొన్ని దశాబ్దాలుగా ఈ మార్గాన్ని వినియోగిస్తున్నారు. అలాగే గాయత్రి కాలేజీ ఎదురుగా ఉన్న కొండ పక్క నుంచి రుషికొండ బీచ్‌కు వెళ్లడానికి ఏపీటీడీసీ నాలుగేళ్ల క్రితం రూ.3 కోట్లతో 60 అడుగుల వెడల్పున రహదారి నిర్మించింది. ఈ రోడ్డును కూడా డీఈసీ మూసేసింది. నిర్మాణ పనులు చేసే వారికోసం లేబర్‌ క్యాంపులు ఏర్పాటుచేసింది. ఎవరైనా అటు వైపు వెళితే.. డీఈసీ ప్రతినిధులు అడ్డగించడమే కాకుండా బెదిరిస్తున్నారు. తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు న్యాయవాది ఒకరు ఆదివారం రుషికొండలో తవ్వకాలను పరిశీలించడానికి రాగా.. ఆయనతో పాటు హైకోర్టులో కేసు వేసిన జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌, మీడియా ప్రతినిధులు కూడా వెళ్లారు. అయితే ఎవరూ లోపలికి రావడానికి వీల్లేదంటూ సంస్థ ప్రతినిధులు అడ్డుకున్నారు. ఒకరిద్దరి వద్ద సెల్‌ఫోన్లు కూడా లాక్కున్నారు. పైగా అనుమతి లేకుండా లోపలికి వచ్చారంటూ ఆరిలోవ పోలీ్‌సస్టేషన్‌లో సోమవారం వారిపై కేసు పెట్టడం గమనార్హం.


చేతులు ముడుచుకుని కూర్చున్నారా?

రుషికొండలో డీఈసీ పౌరహక్కులకు భంగం కలిగిస్తుంటే.. జిల్లా, స్థానిక సంస్థల అధికారులు చేతులు ముడుచుకుని కూర్చున్నారా అంటూ కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ మండిపడ్డారు. ఈ మేరకు విశాఖ కలెక్టర్‌కు సోమవారం లేఖ రాశారు. నిర్మాణ సంస్థ ప్రజలు వినియోగించే రోడ్లను, అటవీ శాఖ భూమిని ఆక్రమించి ఫెన్సింగ్‌ వేస్తే చూస్తూ ఎలా ఊరుకున్నారని ప్రశ్నించారు. తక్షణమే ఆక్రమణలన్నీ తొలగించి, ఆ సంస్థ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని, స్థానిక ప్రజల రాకపోకలకు అడ్డంకులు లేకుండా చూడాలని కోరారు. 

Updated Date - 2022-08-02T09:22:14+05:30 IST