గ్యాస్‌లీక్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-04-17T04:58:23+05:30 IST

వంటగ్యాస్‌లీక్‌ కాకుండా మహిళలు చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రొద్దుటూరు అగ్నిమాపక అధికారి రఘునాథ్‌ విజ్ఞప్తి చేశారు.

గ్యాస్‌లీక్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి
ప్రొద్దుటూరులో వంటగ్యాస్‌ లీక్‌ ప్రమాదాలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

ప్రొద్దుటూరు క్రైం, ఏప్రిల్‌ 16 : వంటగ్యాస్‌లీక్‌ కాకుండా  మహిళలు చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రొద్దుటూరు అగ్నిమాపక అధికారి రఘునాథ్‌ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా స్థానిక భగత్‌సింగ్‌ కాలనీలో డ్వాక్రా మహిళలకు వంటగ్యాస్‌ లీక్‌ ప్రమాదాలపై  అవగాహన కల్పించారు. ఈ మేరకు సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీకై మంటలు రేగినపుడు ఏ విధంగా నివారించవచ్చునో డెమో ద్వారా చూపించారు. అంతకు ముందు ఫైర్‌ ఆఫీసర్‌ రఘునాఽథ్‌ మాట్లాడుతూ ఇటీవల వంటగ్యాస్‌ లీక్‌ ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని ఈ క్రమంలో వాటి నివారణకు మహిళల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. సిలిండర్‌ కంటే గ్యాస్‌స్టవ్‌ ఎత్తులో ఉండాలని, గ్యాస్‌ లీక్‌ అవుతున్నట్లు అనుమానం వస్తే ఇంటిలోని కరెంట్‌ స్విచ్‌లు ఆన్‌, ఆఫ్‌ చేయకూడదన్నారు. వంట ముగిసాక రెగ్యులేటర్‌ ఆఫ్‌ చేయాలన్నారు. ముఖ్యంగా ఎక్కువ రోజులు వేరే ఊర్లకు వెళ్లే క్రమంలో గ్యాస్‌ స్టవ్‌ నుంచి సిలిండర్‌ను వేరు చేసి సురక్షిత ప్రదేశంలో సిలిండర్‌ను ఉంచాలన్నారు. సిలిండర్‌ రెగ్యులేటర్‌కు అమర్చిన పైపును ఎక్కువ కాలం వాడకూడదని, ప్రతి సంవత్సరం మార్చుకోవడం ఎంతో ఉత్తమమన్నారు. గ్యాస్‌ సిలిండరు చుట్టూ ఎలాంటి మండే పదార్థాలు, ప్లాస్టిక్‌ కవర్లు, గోనెసంచులు ఉంచరాదన్నారు. ఏదైనా అగ్నిప్రమాదాలు జరిగితే వెంటనే 101కు సమాచారం ఇవ్వాలన్నారు. అగ్నిప్రమాదాల నివారణపై ముద్రించిన కరపత్రాలను ప్రజలకు పంచిపెట్టారు. కార్యక్రమంలో లీడింగ్‌ ఫైర్‌మెన్‌లు వీరన్న, వీరభద్రారెడ్డి, ఫైర్‌మెన్‌లు నాగేంద్రారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ప్రభాకర్‌రావు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 

గ్యాస్‌ ప్రమాదాలపై అవగాహన

జమ్మలమడుగు రూరల్‌ , ఏప్రిల్‌ 16: నగర పంచాయతీ పరిధిలోని కన్నెలూరు 10వ వార్డులో అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వంటగ్యాస్‌ ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ప్రమాదాల నివారణకు సంబంధించిగ్యాస్‌ సిలిండర్‌ ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఏ విధంగా ఆర్పవలెనో ప్రయోగ పూర్వకంగా వివరించారు. అనంతరం అగ్నిమాపక వారోత్స కరపత్రాలు పంపిణీ చేసి కొన్ని పత్రాలను గోడలకు అతికించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ సలోమి, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T04:58:23+05:30 IST