సైబర్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ

ABN , First Publish Date - 2021-09-17T05:20:23+05:30 IST

సైబర్‌ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ అన్నారు.

సైబర్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ
సైబర్‌ క్రైం, ఫైనాన్షియల్‌ ఫ్రాడ్‌సెల్‌, సోషల్‌ మీడియా మోనిటరింగ్‌ సెల్‌ను ప్రారంభిస్తున్న ఎస్పీ

కడప(క్రైం), సెప్టెంబరు 16: సైబర్‌ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ అన్నారు. గురువారం నగరంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో సురక్షణ భవన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సైబర్‌ క్రైం, ఫైనాన్షియల్‌ ఫ్రాడ్‌సెల్‌, సోషల్‌ మీడియా మోనిటరింగ్‌ సెల్‌ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సాంకేతికత అభివృద్ధి చెందే కొద్దీ మోసాలు అధికమవుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటర్‌నెట్‌, స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్న నేపధ్యంలో మోసగాళ్లు రకరకాల మోసాలకు పాల్పడుతున్నారన్నారు. అపరిచిత వ్యక్తుల ద్వారా ఫోన్‌ లేదా ఇంటర్‌నెట్‌కు వచ్చే లింకులను క్లిక్‌ చేయకూడదని సూచించారు. ముఖ్యంగా మహిళలు సైబర్‌ మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. సోషల్‌ మీడియాలో జిల్లాకు సంబంధించి అసత్యాలు, అవాస్తవాలను ప్రచారం చేసే వారిని గుర్తించేందుకు వీలుగా ప్రత్యేకంగా సోషల్‌ మీడియా మోనిటరింగ్‌ సెల్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అవాస్తవాలు, అసత్యాలు, సామాజిక మాధ్యమాల్లో పెట్టే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌) ఎం.దేవప్రసాద్‌, ఏఆర్‌ అదనపు ఎస్పీ మహే్‌షకుమార్‌, ఎస్‌బీ డీఎస్పీ బి.వెంకటశివారెడ్డి, సీసీఎస్‌ డీఎస్పీ బాలస్వామిరెడ్డి, కడప వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ, ఎస్‌బీ ఇనెస్పెక్టర్‌లు రాజాప్రభాకర్‌, వెంకటేష్‌, ట్రాఫిక్‌ సీఐ శ్రీధర్‌నాయుడు, కడప అర్బన్‌ సీఐ ఎస్‌ఎం అలీ, సైబర్‌ క్రైం అండ్‌ ఫైనాన్షియల్‌ ఫ్రాడ్‌ సెల్‌ ఎస్‌ఐలు మధుమల్లేశ్వర్‌రెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, ఐటీకోర్‌ టీం సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2021-09-17T05:20:23+05:30 IST