కట్టడి కోసమే కఠినం

ABN , First Publish Date - 2020-04-07T11:34:27+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రజారోగ్య పరిరక్షణకే పోలీస్‌ శాఖ కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందని ఎస్పీ

కట్టడి కోసమే కఠినం

ప్రజారోగ్యం పరిరక్షణకే..

ప్రజలు అనవసరంగా బయటకు రావద్దు

బాధ్యతతో వ్యవహరించండి

28 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందే

త్వరలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు

ఎస్పీ అమ్మిరెడ్డి 


హిరమండలం, ఏప్రిల్‌ 6: కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రజారోగ్య పరిరక్షణకే పోలీస్‌ శాఖ కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందని ఎస్పీ అమ్మిరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం హిరమండలం సుబలాయిలో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాలు సమకూర్చిన నిత్యావసర సరుకులను ఎస్పీ అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు స్వీయ గృహ నిర్బంధం పాటించాలని సూచించారు. అవసరమైతేనే బయటకు రావాలన్నారు. ఈ విషయంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై జిల్లావ్యాప్తంగా రెండు వేల కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. కట్టడి చర్యల్లో భాగంగానే కేసులు  పెడుతున్నామని. ..ప్రజారోగ్యం దృష్ట్యా ఇది తప్పడం లేదన్నారు. 


ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన వెంటనే రాష్ట్ర, జిల్లా రహదారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని అడ్డుకున్నామని చెప్పారు. కొందరిని నేరుగా క్వారంటైన్‌కు తరలించామన్నారు. 135 స్వాబ్‌లు తీసి పరీక్షకు పంపగా చాలావరకూ నెగిటివ్‌ వచ్చిందన్నారు. ఇంతవరకూ ఒక్క పాజిటివ్‌ కేసు నమోదుకాకపోవడం ఉపశమనమిచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. అయినా ప్రజలు అధికార యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రహదారులు, రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వస్తున్న వారిని సైతం క్వారంటైన్‌కు పంపిస్తున్నామని వివరించారు. జిల్లావ్యాప్తంగా 31 క్వారంటైన్‌ కేంద్రాలో 560 మందిని చేర్చామని చెప్పారు. చాలామంది క్వారంటైన్‌ అంటే 14 రోజులతో ముగిసినట్టు భావిస్తున్నారని..28 రోజుల వరకూ నిర్బంధంలో ఉంచడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.


దీనిపై త్వరలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే అవకాశం ఉందన్నారు. లాక్‌డౌన్‌తో చిక్కుకున్న లారీ డ్రైవర్లు, నిరాశ్రయులకు స్వచ్ఛంద సంస్థలు, వర్తక, వాణిజ్య సంఘాల సహకారంతో భోజన వసతి ఏర్పాటు చేశామన్నారు. దాతలు ముందుకురావాలని కోరారు. కార్యక్రమంలో పాలకొండ డీఎస్పీ రారాజు ప్రసాద్‌, పాతపట్నం సీఐ రవిప్రసాద్‌, ఎస్‌ఐ కె.గోవిందరావు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ప్రసాదరావు ఉన్నారు.

Updated Date - 2020-04-07T11:34:27+05:30 IST