ప్రజలతో నిజాయితీగా మెలగండి... ప్రభుత్వానికి గుజరాత్ హైకోర్టు హితవు...

ABN , First Publish Date - 2021-04-17T19:24:46+05:30 IST

ప్రజలతో నిజాయితీగా వ్యవహరించాలని, కోవిడ్-19 మహమ్మారి

ప్రజలతో నిజాయితీగా మెలగండి... ప్రభుత్వానికి గుజరాత్ హైకోర్టు హితవు...

అహ్మదాబాద్ : ప్రజలతో నిజాయితీగా వ్యవహరించాలని, కోవిడ్-19 మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్యపై పారదర్శకంగా ఉండాలని గుజరాత్ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు హితవు పలికింది. ఆర్‌టీపీసీఆర్ టెస్టింగ్ ఫలితాలను కచ్చితంగా ప్రకటించాలని తెలిపింది. వాస్తవాలను మరుగుపరచడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ప్రయోజనం ఉండదని తెలిపింది. కచ్చితమైన సమాచారాన్ని నొక్కిపెడితే, సమస్య మరింత తీవ్రమవుతుందని స్పష్టం చేసింది. 


కోవిడ్-19 పరిస్థితులపై హైకోర్టు స్వీయ విచారణ జరుపుతోంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ భార్గవ్ కరియా ధర్మాసనం శుక్రవారం ప్రభుత్వానికి ఈ సలహా ఇచ్చింది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి కొన్ని సూచనలు చేసింది. ఆర్‌టీపీసీఆర్ టెస్ట్‌ల ఫలితాలను సరైనవిధంగా, కచ్చితంగా ప్రకటించాలని తెలిపింది. ఈ ఫలితాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడానికి వెనుకాడవద్దని తెలిపింది. కచ్చితమైన సమాచారాన్ని దాచిపెట్టడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుందని పేర్కొంది. దీనివల్ల ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోతారని తెలిపింది. పరిస్థితులను చక్కదిద్దాలంటే ప్రభుత్వం ప్రజలతో పారదర్శకంగా, నిజాయితీగా చర్చించాలని పేర్కొంది. 


కోవిడ్ రోగుల సంఖ్య పెరగడానికి ప్రభుత్వం బాధ్యురాలు కాదని, అయితే వాస్తవ సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాలని తెలిపింది. వాస్తవాలను వెల్లడించడం వల్ల ఉపయోగాలను వివరిస్తూ, ప్రభుత్వం కచ్చితమైన సమాచారాన్ని బయటపెట్టడం లేదనే భావనను ప్రజల మనసుల నుంచి తొలగించడానికి వీలవుతుందని తెలిపింది. 


ఇదిలావుండగా, అసర్వ సివిల్ హాస్పిటల్ వద్ద శుక్రవారం అంబులెన్సులు బారులు తీరి కనిపించాయి. వీటిలో కోవిడ్-19 వల్ల ప్రాణాలు కోల్పోయినవారి మృతదేహాలు ఉన్నాయి. ఈ మృత దేహాలను తీసుకునేందుకు బంధువులు పడిగాపులు కాస్తున్నారు. 


Updated Date - 2021-04-17T19:24:46+05:30 IST