ఇల్లే... ఆనంద మందిరం!

ABN , First Publish Date - 2020-03-31T15:42:37+05:30 IST

ఆఫీసు ఒత్తిళ్లకు దూరంగా, పూర్తి సమయాన్ని కుటుంబ సభ్యుల మధ్య గడిపే అవకాశం దొరకడం ఎంతో అరుదు. లాక్‌డౌన్‌ ఈ అవకాశాన్ని కల్పించింది. అయితే, ఇలాంటప్పుడే ఆలుమగల మధ్య పొరపొచ్చాలు, పెద్దలు, పిల్లల మధ్య వాదోపవాదాలు తలెత్తుతాయి.

ఇల్లే... ఆనంద మందిరం!

ఆంధ్రజ్యోతి (31-03-2020): ఆఫీసు ఒత్తిళ్లకు దూరంగా, పూర్తి సమయాన్ని కుటుంబ సభ్యుల మధ్య గడిపే అవకాశం దొరకడం ఎంతో అరుదు. లాక్‌డౌన్‌ ఈ అవకాశాన్ని కల్పించింది. అయితే, ఇలాంటప్పుడే ఆలుమగల మధ్య పొరపొచ్చాలు, పెద్దలు, పిల్లల మధ్య వాదోపవాదాలు తలెత్తుతాయి. కానీ ఈ ఆపదవేళ ఇంటిని ఆనంద మందిరంగా మలుచుకోవడం మన బాధ్యత. మానసిక కుంగుబాటు, ఆందోళనలు పెరిగేవేళ కుటుంబ సభ్యుల మధ్య అనురాగాలు, ఆప్యాయతలు మరింత పదిలపరుచుకునేందుకు ఇదే సరైన అదను! గడప దాటలేని అసాధారణ పరిస్థితిలో ఇంట్లోనే వ్యాపకాలను వెతుక్కోక తప్పదు. ఇలాంటి హోం క్వారంటైన్‌ను కూడా ఆహ్లాదంగా మలుచుకోవచ్చు అని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. ‘‘ఇంటికే పరిమితమవడాన్ని కట్టడిగా అనుకోకూడదు. ఇలాంటి సమయంలో అలాంటి భావాలను ముందుగా మనసులో నుంచి తొలగించాలి’’ అని సీనియర్‌ సైకియాట్రిస్ట్‌ డా. ఎమ్‌.ఎస్‌ రెడ్డి సూచిస్తున్నారు. 


మాట్లాడుకోవడం మంచిది!

సాధారణ రోజుల్లో కుటుంబ సభ్యులంతా కలిసి గడిపే సమయం చాలా తక్కువ. ఇప్పుడు ఆ అవకాశం లభించింది. ఇలాంటి సమయంలోనే ఆలుమగల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతుంటాయి. ప్రస్తుతం చాలా కుటుంబాలలో కరోనాపై అవగాహన విషయంలోనే ఎక్కువగా వాదవివాదాలు చోటుచేసుకొంటున్నాయని సైకాలజిస్టు, ఫ్యామిలీ కౌన్సెలర్‌ డా. జి. పద్మజ చెబుతున్నారు. భార్యభర్తల్లో కరోనా జాగ్రత్తలపై ఎక్కువ అవగాహన కలిగిన ఒకరు చెప్పే సూచనలు, సలహాలను, అవగాహన లేని మరొకరు సులువుగా కొట్టిపారేసే అవకాశం ఉంది. దాంతో తన మాట వినలేదనే అహం అవతలి వ్యక్తిలోనూ, దాన్నే ఇవతలి వ్యక్తి చాదస్తంగానూ భావించడం జరుగుతుంది. ఇలా ఇరువురిలో చిరాకు, కోపం కలగడం సర్వసాధారణం.


భావోద్వేగాలను అదుపుచేసుకోలేక గొడవలకు దారితీస్తాయి. కాబట్టి అభిప్రాయభేదాలు తలెత్తినప్పుడు, ఆలుమగలిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం ఉత్తమం. కరోనా వైరస్‌ పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను మిగతా కుటుంబ సభ్యులు పాటిస్తున్న క్రమంలో కొంతమంది వృద్థులు ‘తమని దూరంపెడుతున్నారనే’ భావనకు లోనయ్యే అవకాశమూ ఉంది. కనుక వారికి సమస్యను అర్థం చేయించాల్సిన బాధ్యతా కుటుంబ సభ్యులదే ! ఆ సమయంలో పెద్దలతో సున్నితంగా వ్యవహరించాలనే సంగతి మర్చిపోకూడదు. 


పిల్లలకు మార్గదర్శకులుగా నిలుద్దాం!

ప్రస్తుతం ఇంట్లో పిల్లల్ని సముదాయించడం పెద్దల ముందున్న అతి పెద్ద సవాల్‌. సాధారణ రోజుల్లో పిల్లలను టెలివిజన్‌, స్మార్ట్‌ ఫోన్లకు దూరంగా ఉంచేందుకు తల్లితండ్రులు శతవిధాల ప్రయత్నించడం ప్రతీ కుటుంబంలో జరిగేదే. ఇప్పుడు మాత్రం పిల్లలు అడగకుండానే, వాళ్ల చేతికి సెల్‌ఫోన్‌ ఇచ్చేస్తున్నారు. చిన్నారులు మెచ్చే టెలివిజన్‌ ఛానళ్లనే పెద్దలూ చూస్తున్నారు. అందుకు కారణం వాళ్లను ఎలా ఎంగేజ్‌ చేయాలో తెలియనితనమే! కొందరు టీనేజర్లూ తల్లితండ్రుల మాటలు వినకుండా బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు.  అలాంటి సమయంలో తల్లితండ్రులు ఆంక్షలు జారీచేస్తున్నట్లు వ్యవహరించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలను తీర్చిదిద్దేందుకు, వారిలో మంచి వ్యాపకాలు, అభిరుచులను ఇష్టంగా అలవాటు చేసేందుకు తల్లిదండ్రులకు ఇంతకన్నా మంచి సమయం రాదు. అంతేకాదు, పిల్లలకు మాటలరూపంలో మంచిని బోధించడం కన్నా తమ ప్రవర్తన రూపంలో తల్లితండ్రులు స్ఫూర్తిగా నిలవాలి. 


తాగకుండా ఉండలేని వారికోసం..

లాక్‌డౌన్‌ వేళ నిత్యావసరాలు దొరకడమే కష్టమైన సందర్భంలో మద్యం దొరకడం అసాధ్యమే! అయితే, ఈ అలవాటు మానుకొనేందుకూ లాక్‌డౌన్‌ తోడ్పడుతుంది. మద్యం తాగేవారిలో వ్యసనపరుల సంఖ్య 5శాతం నుంచి 7శాతం లోపే అని ఆశా రిహాబిలిటేషన్‌ సెంటర్‌ వైద్యుడు, సైకియాట్రిస్టు డా. రమణ చెరుకూరి చెబుతున్నారు. అయితే పరిమితంగానైనా రోజూ మద్యం సేవించేవారు, ఒకేసారి ఆ అలవాటుకి దూరం అవడం వల్ల తలతిరగడం, చెమటలు పట్టడం, నిద్రలేమి, కోపం, చిరాకు వంటి సమస్యలు కలిగే అవకాశం లేకపోలేదు. అలాంటి సమయంలో వారు చీటికి మాటికి ఇరిటేట్‌ అవ్వడం, కోపం ప్రదర్శించడం వంటివి చేస్తుంటారు. కనుక ఆ సమయంలో వారు మంచినీరు, మజ్జిగ వంటి ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వీలైతే మల్టీ విటమిన్‌ మాత్రలనూ వాడవచ్చు. పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉంటే మాత్రం సైకియాట్రిస్టును సంప్రదించడం మంచిది. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఇల్లే ఆనందమందిరం అవుతుంది.


పనిని పంచుకుందాం!

కుటుంబ వ్యవస్థలో ఇంటి, వంట పనంతా ఆడవాళ్ల పేటెంట్‌ అనుకొనే ధోరణి పాతుకుపోయింది. భర్త, పిల్లలంతా ఇంటి పట్టునే ఉండటం సగటు ఇల్లాలికి అత్యంత సంతోషదాయకమే.! అయినా ఆమెపై విపరీతమైన పనిభారం. ‘‘లాక్‌డౌన్‌ నేపథ్యంలో గృహిణులపై విపరీతమైన పనిభారం పెరిగిందని’’ సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలోనే ఆడ, మగ భేదాలు మరిచి, ఇంటి పనిని సమంగా పంచుకోవాలి. మగవాళ్లు అహంభావం తీసి అటకమీద పెట్టి ఇంటి పనుల్లో భార్యకు సహాయపడవచ్చు. గరిట తిప్పడానికీ వారికి ఇదే మంచి సమయం. భార్య చేతివంట తినడమే కాదు, స్వీయపాకం భార్యకు, పిల్లలకూ తినిపిస్తూ ఉండాలి.


సంభాషణే బంధాలకు బలం..!

‘‘ప్రస్తుత పరిస్థితుల్లో తల్లితండ్రులు పిల్లలకు మధ్య కాంట్రడిక్షన్స్‌ తలెత్తడం సహజం. ఇక పిల్లల మధ్య తగవులు, కొట్లాటలు అల్లరి వంటివి చెప్పనక్కర్లేదు. అయితే, ఇలాంటి సమయంలో పెద్దలు సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. పిల్లలకు మంచి అలవాట్లను, అభిరుచులను అలవర్చడంలో ఇదే మంచి సమయం. లాక్‌డౌన్‌ అన్నిరోజులూ పిల్లలకు రెగ్యులర్‌ యాక్టివిటీని అప్పగించాలి. ఉదాహరణకు ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ఎవరికి వారు పక్కదుప్పట్లను మడతపెట్టడం. తిన్నతర్వాత ఎవరి ప్లేటును వారే కడగడం వంటి పనులను వారి నిత్యజీవితంలో భాగం చేయాలి. ఇంటి పనిలోనూ పిల్లలను ఇన్వాల్వ్‌ చేయాలి. పిల్లల కోసం కొన్ని కథలనైనా తల్లితండ్రులు నేర్చుకోవాలి. రోజులో ఒక్కసారైనా పిల్లలకు కథలు చెప్పాలి. లేదంటే, తమ జీవితంలోని మంచి అనుభవాలను పిల్లలతో పంచుకోవచ్చు. అదీ వాళ్లకు బోర్‌కొట్టకుండా చెప్పగలగాలి. పనిని ఆలుమగలిద్దరూ పంచుకోవాలి. టీవీ ఛానళ్లు చూసే సమయంలోనూ పిల్లలకు తల్లిదండ్రులు ప్రాధాన్యం ఇవ్వాలి. అదీ మంచి కార్యక్రమాలను, పిల్లల వికాసానికి తోడ్పడే ప్రోగ్రామ్స్‌ను చూసేలా ప్రోత్సహించాలి. అనుక్షణం పిల్లలను ఒక కంట కనిపెడుతుండాలి. అతిగా బోర్‌ ఫీలైనా కుంగుబాటుకి లోనయ్యే ప్రమాదం ఉంది. కనుక ఇంట్లోనే రోజంతా బిజీగా ఎంగేజ్‌ అయ్యేలా చేసుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినప్పుడు వాదనలకు దిగకుండా, సంభాషించుకోవాలి. ఇంట్లో ప్రశాంతత నెలకొనాలంటే కుటుంబ సభ్యుల మధ్య  సంభాషణ చాలా అవసరం. అదే బంధాలకు బలం.’’

- డా. జి.పద్మజ, సీనియర్‌ సైకాలజిస్టు


రోజును పక్కాగా ప్లాన్‌ చేసుకోండి..!

ఈ లాక్‌డౌన్‌ రోజుల్ని కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపేందుకు పక్కాగా ప్లాన్‌ చేసుకోవాలి. అప్పుడు ఫియర్‌ కాంప్లెక్స్‌, డిప్రెషన్‌ దరిచేరవు. అందుకు ఇవి పాటించాలి.


తప్పనిసరిగా ప్రతి గంటకు పది నిమిషాలు ఇంట్లోనే నడవాలి. తద్వారా రక్తప్రసరణ సజావుగా సాగుతుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యానికీ మంచిది.


మనసుని తేలికపరిచేందుకు మంచి సంగీతం తోడ్పడుతుంది. 


ఎప్పటి నుంచో చదవాలనుకొని చదవలేకపోయిన పుస్తకాలను చదివేందుకు ఇప్పుడు సమయం దొరికింది. 


రోజంతా కరోనా వార్తలు చూస్తూ గడపకండి. దాని వల్ల భయాందోళనలు తప్ప మరొక ప్రయోజనం లేదు. 


సోషల్‌ మీడియాకు వీలైనంత దూరంగా ఉండటం ఉత్తమం. అందులోని అవాస్తవాలను తెలుసుకోవడం ద్వారా ఆందోళన పెరుగుతుంది. 


ధ్యానం చేయడం మంచిది.


మితాహారం, అందులోనూ ఆరోగ్యకరమైన పదార్థాలే తీసుకోవాలి. తద్వారా రోగనిరోధకశక్తిని కాపాడుకోవచ్చు. 


వైర్‌సలు, జబ్బుల పేరుతో భయపెట్టే సినిమాలను చూడకపోవడం మంచిది. 


పగటిపూట అర్ధగంటకు మించి నిద్రపోవద్దు. 


రాత్రివేళ కనీసం ఎనిమిది గంటలు హాయిగా నిద్రపోవాలి. తద్వారా శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.

- డా. ఎం.ఎస్‌.రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్టు

Updated Date - 2020-03-31T15:42:37+05:30 IST