Advertisement
Advertisement
Abn logo
Advertisement

శుభ్రత పాటిస్తే విజయం మనదే..

ఆంధ్రజ్యోతి(10-05-2020)

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఇళ్ళకే పరిమితం కావడం ప్రజలందరికీ శ్రేయస్కరం. అలాగే వ్యక్తిగత శుభ్రతను కూడా తప్పకుండా పాటించాల్సిందే! ఇస్లామ్‌ ధర్మంలో ‘తహరత్‌’... అంటే శుచి, శుభ్రతలకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. నమాజ్‌, దివ్య ఖుర్‌ఆన్‌ పారాయణ, కాబా గృహ ప్రదక్షిణలకే ఈ ధర్మం పరిమితం కాదు. ‘తహరత్‌’ కూడా ధర్మంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ విషయాన్ని ఖుర్‌ఆన్‌, హదీస్‌లు స్పష్టంగా చెప్పాయి. 


దేవుడు తనవైపు మరలేవారినీ, పవిత్రంగా శుభ్రంగా ఉండేవారినీ మాత్రమే ప్రేమిస్తాడని అల్లాహ్‌ పేర్కొన్నారు (దివ్య ఖుర్‌ఆన్‌ - అల్‌బఖర 2:222).   ప్రార్థనల సమయంలో పాటించాల్సిన నియమాల్లో పరిశుభ్రత ముఖ్యమైనది. ‘‘విశ్వాసులారా! నమాజ్‌ చేయడానికి సిద్ధమయినప్పుడు ముందుగా మీరు ముఖాన్నీ, మోచేతుల వరకూ చేతులనూ కడుక్కోండి; తలను తడి చేత్తో స్పృశించండి; కాళ్ళను చీలమండల దాకా కడుక్కోండి. అశుభ్రమైన అవస్థ ఏర్పడితే తలంటు స్నానం చేయండి’’ అని దివ్య ఖుర్‌ఆన్‌ ఆదేశించింది (అల్‌ మాయిద 5:6). కరోనా మహమ్మారి ప్రబలుతున్న ప్రస్తుత సమయంలో పరిశుభ్రత మరింత కీలకం. 


మహా ప్రవక్త మహమ్మద్‌ ఒక రోజు మసీదులో కూర్చొని ఉన్నారు. అపరిశుభ్రంగా ఉన్న ఒక వ్యక్తి లోనికి ప్రవేశించాడు. అతని జుట్టూ, గడ్డం అంతా చిందరవందరగా ఉన్నాయి. మహా ప్రవక్త చూసి, తల, గడ్డం సరిగ్గా దువ్వుకొని రావాలంటూ చేత్తో సంజ్ఞ చేశారు. అతను బయటకు వెళ్ళి, అంతా సంస్కరించుకొని వచ్చాడు. 


అప్పుడు మహా ప్రవక్త ‘‘ఇది బాగుందా? లేక చిందర వందర వెంట్రుకలతో సైతానులా కనబడడం బాగుందా?’’ అని అతణ్ణి ప్రశ్నించారు. పరిశుభ్రత వల్ల తేజస్సు వృద్ధి అవుతుందని అల్లాహ్‌ చెప్పారు. ‘‘ప్రళయదినాన నా అనుచరులందరినీ (కర్మ విచారణ కోసం) పిలవడం జరుగుతుంది. ‘ఉజూ’ (శరీరాన్ని శుభ్రం చేసుకోవడం) ప్రభావం వల్ల వారి ముఖాలు, కాళ్ళు, చేతులు ఉజ్జ్వలంగా ఉంటాయి. శరీర వర్ణాన్నీ, తేజస్సునూ వృద్ధి చేసుకోవాలని అనుకున్నవారు ఉజూ చేస్తున్నప్పుడు పూర్తిగా ముఖాన్ని కడుక్కోవాలి’’ అని (హదీస్‌ గ్రంథం: బుఖారీ) సూచించారు. పవిత్రత, పరిశుభ్రత విషయంలో దైవ ప్రవక్త ఎంతో ప్రాధాన్యం ఇచ్చిన అంశాల్లో దంతధావనం ఒకటి. ‘మిస్వాక్‌ (పళ్ళుతోము పుల్ల) నోటిని బాగా శుభ్రపరచి, దైవాన్ని అమితంగా ప్రసన్నం చేసే వస్తువు’ అని హదీస్‌ గ్రంథం పేర్కొంటోంది. 


ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ సోకకుండా మాస్కులు, చేతి తొడుగులు ధరించాలి. శుచినీ, శుభ్రతనూ పాటించాలి. ప్రమాదం రాకముందే జాగ్రత్త తీసుకోవాలి. ధర్మపరమైన విషయాలలో నియంత్రణ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే అది పరలోకంలో దాసుడికి గొప్ప విజయాన్ని అందిస్తుంది. 


అరబ్బీ భాషలో ఒక సామెత ఉంది. ‘అల్‌ వఖాయః ఖైరుమ్‌ మినాల్‌ ఇలాజ్‌’-  అంటే ‘వైద్యం కన్నా పత్యం మిన్న’ అని అర్థం. ఈ సామెతలో గొప్ప వివేకం ఉంది. ఇది శారీరక ఆరోగ్యం విషయంలో  నివారణలు మాత్రమే కాకుండా... అవసరమైనప్పుడు ధర్మం విషయంలో, ప్రాపంచికమైన విషయాల్లో నివారణ, నియంత్రణ కలిగి ఉండాలని సూచిస్తోంది. భౌతిక దూరాన్ని పాటించడం, ప్రార్థనలు ఇంటికే పరిమితం చేసుకోవడం - ఇవన్నీ ధార్మికపరమైన నియంత్రణలే. 


- మహమ్మద్‌ వహీదుద్దీన్‌


Advertisement

Health Latest newsమరిన్ని...

Advertisement