మీరు FB, Instaలో Friendship చేస్తున్నారా.. అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

ABN , First Publish Date - 2022-05-31T13:35:16+05:30 IST

దూరాలను దగ్గర చేసేందుకు వినియోగించాల్సిన సోషల్‌మీడియా (Social Media) బంధాలను తెంపేస్తోంది..

మీరు FB, Instaలో Friendship చేస్తున్నారా.. అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

  • చాటింగ్.. చీటింగ్
  • ‘సమ్‌’బంధాలకు వేదికగా..
  • లైకులతో మొదలై.. విషాదంగా..
  • అపరిచితుల వలలో పడి మోసపోతున్న యువతులు
  • కొందరికి ముప్పుగా సోషల్‌మీడియా స్నేహాలు 
  • అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు

దూరాలను దగ్గర చేసేందుకు వినియోగించాల్సిన సోషల్‌మీడియా (Social Media) బంధాలను తెంపేస్తోంది. స్నేహం మాటున కొందరు వక్రమార్గం పట్టి ఎంతకైనా తెగించేందుకు వెనుకాడటం లేదు. మొదట్లో లైక్‌లు, కామెంట్లు, చాటింగ్‌లతో (Like, Comments, Chatting) మొదలవుతున్న స్నేహం హత్యలు, ఆత్మహత్యలు, బెదిరింపులకు కారణమవుతోంది. కొందరి స్నేహం అసాంఘిక బంధాలకు వేదికగా మారుతోందనే  ఆందోళన వ్యక్తమవుతోంది.


విషాదంగా ముగుస్తున్నాయ్..

పరువుకు, బంధువులు, స్నేహితుల మధ్య చులకనవుతామనే ఉద్దేశంతో కొందరు పోలీసులను ఆశ్రయించడం లేదు. సోషల్‌మీడియాలో గంటల కొద్దీ గడుపుతున్న కొందరు మానసిక ఒత్తిడికి, చిరాకుకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలున్నాయి. మరికొందరు అపరిత వ్యక్తులతో స్నేహాలు, పోస్టులకు వారిచ్చే లైక్‌లు, కామెంట్లకు ఫిదా అయి ఆకర్షితులవుతున్నారు. అవతలి వారిని గుడ్డిగా నమ్మి పర్సనల్‌ విషయాలు పంచుకుంటున్నారు. అది ఎన్నో దుష్పరిణామాలకు దారి తీస్తోంది. ఆన్‌లైన్‌ స్నేహాల్లో కొన్ని మో సాలు, కేసులు, గొడవలు, అత్యాచారాలు, హత్యలతో విషాదాంతంగా ముగుస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు.


వెయ్యి మంది అమ్మాయిలతో..

బెట్టింగ్‌లకు, జల్సాలకు అలవాటుపడిన యువకుడు డబ్బు కోసం అమ్మాయిలను ట్రాప్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా చేసుకున్నాడు. డబ్బున్న అమ్మాయిల ప్రొఫైల్స్‌కు నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి మహిళ పేరుతో ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపి ఫాలోవర్‌గా మారేవాడు. వారితో స్నేహం పెరిగిన తర్వాత తానొక బిలియనీర్‌గా నమ్మించేవాడు. వారు అడగకముందే ఉచితంగా రూ. లక్ష ఇచ్చేవాడు. తర్వాత తన బ్యాంకు ఖాతాల్లో టెక్నికల్‌ ప్రాబ్లమ్‌ వచ్చిందని రెండు రోజుల్లో క్లియర్‌ అవుతుందని, తనకు అర్జంటుగా డబ్బులు కావాలంటూ అవసరాన్ని బట్టి రూ. 10 లక్షల నుంచి 50 లక్షల వరకు అడిగి తీసుకునేవాడు. డబ్బు తీసుకున్న తర్వాత వారి కాల్స్‌కు స్పందించడం మానేసేవాడు. ఇలా 2019 నుంచి వెయ్యి మంది అమ్మాయిలను మోసం చేసి రూ. 3.50 కోట్లు కొల్లగొట్టాడు. ఆ డబ్బుతో క్రికెట్‌, గుర్రపు పందాలు ఆడుతూ, ఫ్లైట్లలో తిరుగుతూ జల్సాలు చేసేవాడు. అతడిపై 50 కేసులు నమోదయ్యాయి. చివరకు సైబరాబాద్‌ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.


జీవితం అల్లరిపాలు..

ఓ యువతిని ఇంట్లో బంధించిన మహిళ ఐదుగురు యువకులతో అత్యాచారయత్నానికి (గచ్చిబౌలి పరిధిలో) కూడా ఆన్‌లైన్‌ ద్వారా ఏర్పడిన పరిచయం వికటించడమే కారణం. కేవలం ఆన్‌లైన్‌ స్నేహాన్ని నమ్మి హైదరాబాద్‌ వచ్చినందుకు ఆ యువతి జీవితం అల్లరిపాలైంది. తృటిలో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది.


మహిళలా చాటింగ్‌..

ప్రైవేటు ఉద్యోగి సాయి తన ఇన్‌స్టాగ్రామ్‌ స్నేహితుల జాబితాలో ఉన్న బంధువుల అమ్మాయిని ప్రొఫైల్‌ చూసి ఆకర్షితుడయ్యాడు. ఆమె నగ్న చిత్రాలు చూడాలని పథకం వేశాడు. మహిళ పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) ఖాతాను క్రియేట్‌ చేశాడు. మహిళలా స్నేహంగా చాటింగ్‌ చేశాడు. ఆ తర్వాత తన మనసులోని కోరికను బయటపెట్టి నగ్న చిత్రాలు పంపాలని కోరాడు. ఆ యువతి నిరాకరించడంతో.. రోజూ నగ్నంగా వీడియోకాల్‌ చేసేవాడు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌కు అశ్లీల చిత్రాలు, అసభ్యకర మెసేజ్‌లు పంపేవాడు. తనతో నగ్నంగా వీడియోకాల్స్‌ మాట్లాడాలని, నగ్న చిత్రాలు పంపాలని, చెప్పినట్లు చేయకపోతే, ఆమె ఫోన్‌ నంబర్‌ను అశ్లీల చిత్రాల సైట్లలో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించేవాడు. అతడి వేధింపులు భరించలేని యువతి రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని కటకటాల్లోకి నెట్టారు.


పెళ్లయినా సరే..

ఫేస్‌బుక్‌లో (Facebook) యాక్టివ్‌గా ఉండే ఆమె ఇద్దరు యువకులతో ఆన్‌లైన్‌ ప్రేమాయణం (Online Love) సాగించింది. చాటింగ్‌లు, వాట్సాప్‌ కాల్సే కాకుండా, న్యూడ్‌ వీడియో కాల్స్‌ (Nude Calls) వరకూ అది దారి తీసింది. ఈ క్రమంలో ఓ యువకుడు ‘నీకు పెళ్లైనా సరే నన్ను పెళ్లి చేసుకోవాలి. లేదంటే ఫొటోలు, న్యూడ్‌ కాల్స్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో పెడతాను’ అని బెదిరించాడు. దాంతో కోపం పెంచుకున్న మహిళ మరో ఫేస్‌బుక్‌ స్నేహితుడితో కలిసి మొదటి ప్రియుణ్ని చంపించింది. మీర్‌పేట పరిధిలో జరిగిన ఈ హత్య ఇటీవల సంచలనం సృష్టించింది.


నీ భార్యను నాకు వదిలెయ్‌..

సిద్దిపేట జిల్లాకు చెందిన కరీం కమ్యూనిటీ గ్రూప్‌ అనే ఒక వాట్సాప్‌ (Whatsapp) గ్రూపులో యాడ్‌ అయ్యాడు. అందులో ఉన్న ఒక మహిళను సెలక్ట్‌ చేసుకున్నాడు. స్నేహం పేరుతో ఆమె పర్సనల్‌ నంబర్‌కు మెసేజ్‌లు (Messages) పంపేవాడు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాంలో ఆమె ఫొటోలకు లైక్‌లు, మంచి కామెంట్లు రాసేవాడు. అలా వారి మధ్య పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల్లోనే ఆమెను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. అప్పటికే ఆమెకు పెళ్లి కావడం, వక్రబుద్ధి బయటపడటంతో అతడిని దూరం పెట్టింది. ఫోన్‌లు, వాట్సా్‌ప్‌లకు స్పందించడం మానేసింది. ఆమెపై పగ పెంచుకున్న నిందితుడు నకిలీ ఫేస్‌బుక్‌ క్రియేట్‌ చేశాడు. ఆమె ఫొటోలు మార్ఫింగ్‌ చేసి, ఆమెకు, ఆమె భర్తకు వాట్సా్‌ప్‌లో పంపేవాడు. ఆమెను వదిలేయాలని లేదంటే చంపేస్తానని ఆమె భర్తను బెదిరించేవాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు నిందితుడిని కటకటాల్లోకి నెట్టారు. 


ఆన్‌లైన్‌ స్నేహాలతో అనర్థం..

కొంతమంది రోజులో ఎక్కువ సమయాన్ని ఫేస్‌బుక్‌, ట్విటర్‌, వాట్సాప్‌ వంటి సోషల్‌ మీడియాలో గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆడమగా తేడా లేకుండా, ముక్కు ముఖం తెలియని వ్యక్తులతో స్నేహం చేస్తున్నారు. మోసపూరితమైన మాటలకు ఆకర్శితులై ప్రేమగా భ్రమపడి హద్దులు దాటుతున్నారు. చివరకు జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. అపరిచితులతో ఆన్‌లైన్‌ స్నేహాలు మంచిది కాదు. - డీసీపీ అనసూయ.



Updated Date - 2022-05-31T13:35:16+05:30 IST