Abn logo
Apr 22 2021 @ 09:35AM

ఆశపడ్డారో కచ్చితంగా మోసపోతారు.. తస్మాత్ జాగ్రత్త!

  • ఆశ.. మోసం
  • రెచ్చిపోతున్న ఆర్థిక నేరగాళ్లు
  • నమ్మించి లక్షలు లాగేస్తున్న వైనం
  • ఆటకట్టిస్తున్నా ఆగని దందా
  • లబోదిబోమంటున్న బాధితులు
  • అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు

హైదరాబాద్‌ సిటీ : చందానగర్‌కు చెందిన కోటేశ్వరరావు బిజినెస్‌ మ్యాన్‌. చందానగర్‌లోనే తనకున్న స్థలంలో బహుళ అంతస్తుల నిర్మాణం కట్టాలనుకున్నాడు. రుణం కోసం తెలిసిన ఫైనాన్సర్లను కలిశాడు. విషయం తెలుసుకున్న ఓ యువకుడు కోటేశ్వరరావును సంప్రదించాడు. పట్టుమని 30 ఏళ్లు కూడా లేని అతను ఖరీదైన కారులో వచ్చాడు. ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద తక్కువ వడ్డీకి ఎక్కువ మొత్తంలో రుణాలు ఇప్పిస్తుంటానని నమ్మించాడు. కోటేశ్వరరావు వద్ద ఉన్న డాక్యుమెంట్లు, స్థలం పరిశీలించాడు. మొత్తం రూ. 50 కోట్ల వరకు రుణం మంజూరు చేయిస్తానన్నాడు. కొంతకాలంగా మీకు, మాకు మధ్య ఆర్థిక లావాదేవీలు నడుస్తున్నట్లు, వ్యాపార పరంగా మంచి సంబంధాలు కొనసాగుతున్నట్లు ఫైనాన్సర్‌ను నమ్మించాలన్నాడు. అతనే ముందుగా బాధితునికి రూ. 20 లక్షలు ఇచ్చాడు. వాటిని తిరిగి చెల్లించానని చెప్పాలన్నాడు. దాంతో బాధితుడు అలాగే చేశాడు. ఇలా కొద్దిరోజులు వారి ఇంటికి రావడం, లోన్‌ ప్రాసెస్‌ గురించి మాట్లాడటం చేశాడు. ఆ తర్వాత మీ లోన్‌ ప్రాసెస్‌ మొదలైందని, రూ. 50 కోట్ల రుణానికి ప్రాసెసింగ్‌ ఫీజు, ఇతర ఖర్చుల కింద రూ. 40 లక్షలు చెల్లించాలని నమ్మించాడు. ఆ యువకుడు చెప్పిన ప్రాంతానికి బాధితుడు డబ్బు తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆ యువకుడు కొంతమందిని పరిచయం చేశాడు. ‘మీరు ఇక్కడే ఉండండి. రూ. 40 లక్షలు ఫైనాన్సర్‌కు అందజేసి, రూ. 50 కోట్ల రుణం క్లియర్‌ చేయించి వస్తాను’ అని చెప్పి వెళ్లాడు. డబ్బు తీసుకుని వెళ్లి తిరిగి రాలేదు. మోసపోయానని గుర్తించిన కోటేశ్వరరావు పోలీసులను ఆశ్రయించాడు. 

నెల్లూరుకు చెందిన వంశీ (పేరు మార్చాం) బెంగళూరులో ఉంటున్నాడు. మిత్రుల ద్వారా హైదరాబాద్‌ రాయదుర్గం ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యాపారులు పరిచయం అయ్యారు. బెంగళూరులో ప్రభుత్వం డీనోటిపై చేసిన భూములను అధికారుల సహకారంతో తక్కువ ధరకు ఇప్పిస్తానని నమ్మించాడు. తక్కువ  పెట్టుబడితో రూ. కోట్ల విలువైన భూములు సొంతం చేసుకోవచ్చని, వాటిని ప్లాట్స్‌ చేసి విక్రయిస్తే రూ. కోట్లలో లాభాలు వస్తాయని నమ్మబలికాడు. ఇప్పటికే తాను రూ. 6కోట్లు పెట్టుబడి పెట్టినట్లు చూపించి బురిడీకొట్టించాడు. ఎవరైనా మరో రూ. 5కోట్లు పెట్టుబడి పెడితే పార్టనర్‌ చేసుకుంటానని చెప్పాడు. అతని మాటలు నమ్మిన ఇద్దరు స్నేహితులు 5 కోట్లు పెట్టుబడి పెట్టారు. వారిని నమ్మించడానికి వంశీ వారి భాగస్వామ్యంతో కొత్త ఫర్మ్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు స్నేహితుల నుంచి రూ. 5కోట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత ఎంతకీ భూములు తమ చేతికి రాకపోవడంతో అనుమానం వచ్చి బెంగళూరు వెళ్లారు. పూర్తి వివరాలు ఆరా తీయగా అదంతా మోసమని, భూముల విక్రయానికి తాము సిద్ధంగా లేమని అధికారులు తెలిపారు. ఇప్పుడు ఆ స్నేహితులు అప్పు చేసి తెచ్చిన డబ్బుకు వడ్డీ కట్టలేక ఆస్తులు అమ్ముకుంటున్నారు.

ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. నగరంలో ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ప్రజల అత్యాశను, అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న మోసగాళ్లు వారిని నమ్మించి నట్టేట ముంచుతున్నారు. నిందితులు దొరక్క,  పోయిన డబ్బు తిరిగి రాక బాధితులు నరకం అనుభవిస్తున్నారు. చిన్న మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్న కొంత మంది పరువు పోతుందని ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. 


ఆశపడితే కచ్చితంగా మోసపోతారు

ఇటీవల కాలంలో ఆర్థిక నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతూనే ఉన్నాం. అయినా ఈ దందాలు ఆగడం లేదు. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే రూ. కోట్లు లాభాలు వస్తాయన్న ఆశతో చాలా మంది తమ వద్ద ఉన్న డబ్బంతా మోసగాళ్ల చేతిలో పోస్తున్నారు. అతిగా ఆశపడితే కచ్చితంగా మోసపోతారు. వి.సి. సజ్జనార్‌, సైబరాబాద్‌ సీపీ.

Advertisement
Advertisement
Advertisement