Be Careful : Hyderabad లో భయపెడుతున్న బ్లాక్‌స్పాట్స్.. ఈ ప్రాంతంలోనే ప్రమాదాలు ఎక్కువ!

ABN , First Publish Date - 2021-09-13T17:16:12+05:30 IST

ఆరు నెలల కాలంలో హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌/ప్రకాశ్‌నగర్‌ స్ట్రెచ్‌ వద్ద వేర్వేరు...

Be Careful : Hyderabad లో భయపెడుతున్న బ్లాక్‌స్పాట్స్.. ఈ ప్రాంతంలోనే ప్రమాదాలు ఎక్కువ!

  • ఆ ప్రాంతాల్లోనే ప్రమాదాలు ఎక్కువ
  • నియంత్రణ చర్యల్లో పోలీసులు
  • ప్రత్యేక ఏర్పాట్లు.. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణానికి సిఫార్సులు


హైదరాబాద్‌ సిటీ : ఆరు నెలల కాలంలో హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌/ప్రకాశ్‌నగర్‌ స్ట్రెచ్‌ వద్ద వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. ఒకే చోట ఇలా పదే పదే ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలు నగరంలో చాలానే ఉన్నాయి. అవే బ్లాక్‌ స్పాట్స్‌. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఈ ఏడాదిలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఆర్నెళ్లలోనే 173 మంది మృతి చెందగా, వారిలో 95 మంది మృతికి అతివేగమే కారణం. ఈ అంశంపై కూడా  అధికారులు దృష్టి సారిస్తున్నారు.


గ్రేటర్‌లో 2020లో జరిగిన ప్రమాద గణాంకాల ఆధారంగా నగరంలోని రోడ్లపై 50 బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించి అధికారులు అక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండు నెలల క్రితం బ్లాక్‌స్పాట్‌ల వద్ద ట్రాఫిక్‌, జీహెచ్‌ఎంసీ, సీఆర్‌ఎంపీ, ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్‌ఏఐ, కంటోన్మెంట్‌ అధికారులు సంయుక్తంగా పరిశీలించారు. ప్రమాదాల నివారణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది జరిగిన ప్రమాదాలలో ఎక్కువగా అతివేగం కారణంగానే జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఏడాది జూన్‌ చివరి వరకు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన 173 మందిలో 95 మందిని అతివేగం బలితీసుకుంది. ఆరుగురు డ్రంకెన్‌ డ్రైవ్‌, 8 మంది రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌ వల్ల, 15 మంది నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో, ఇద్దరు వాహనానికి కుక్కలు ఎదురు రావడంతో, మరో ఐదుగురు ఇతరత్రా కారణాలతో మృతి చెందినట్లు గణాంకాలు స్పష్టం చేశాయి. మృతుల్లో మరో 39 మంది పాదచారులున్నారు.


సమన్వయంతో...

వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పోలీసు అధికారులు ప్రమాదాల నివారణకు చర్యలకు సిద్ధమయ్యారు. బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించి జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి చర్యలు అమలు చేయనున్నారు. జీబ్రా క్రాసింగ్‌లు, పాదచారుల కోసం ప్రత్యేక దారి, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలను ఏర్పాటు చేసి పాదచారులను కాపాడే ప్రయత్నాలు ప్రారంభించనున్నారు. ప్రమాదంతో పాదచారి మృతి చెందాడనే సమాచారం అందగానే ట్రాఫిక్‌ పోలీసు అధికారులు సంఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. వేర్వేరు ప్రమాదాల కారణాలను విశ్లేషించి శాశ్వత పరిష్కారానికి ప్రయత్నాలు ప్రారంభించారు. పాదచారులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించాలని కొన్ని రోజుల క్రితమే జీహెచ్‌ఎంసీని కోరారు. ఫుట్‌పాత్‌లను కబ్జా చేసిన ప్రాంతాలలో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి వాటిని క్లియర్‌ చేస్తున్నారు.


ఏడాదిన్నరలో 1136 మంది దుర్మరణం.. 

రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా అధ్యయనం చేయడానికి సైబరాబాద్‌ పోలీసులు రోడ్డు ట్రాఫిక్‌ యాక్సిడెంట్స్‌ మానిటరింగ్‌ సెల్‌ (ఆర్టీఏఎమ్‌ సెల్‌) ఏర్పాటు చేశారు. డీసీపీ విజయ్‌కుమార్‌ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ గురువయ్య ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక విభాగం పనిచేస్తోంది. గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాలను పరిగణలోకి తీసుకున్న ఆర్టీఏఎమ్‌ సెల్‌ విభాగం ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను అధ్యయనం చేసింది. అక్కడ ప్రమాదం జరగడానికి గల కారణాలు, అక్కడ రోడ్డు నిర్వహణ ఎలా ఉంది, ఇంజనీరింగ్‌ లోపాలు ఏంటి, ఆ రోడ్డు నిర్వహణ బాధ్యతలు ఎవరు చూస్తున్నారు, ఇప్పటి వరకు ఆ స్పాట్‌లో ఎన్ని ప్రమాదాలు జరిగాయి అనేది వంటి అంశాలను విశ్లేషిస్తున్నారు. ఒక ఏడాదిలో ఒకే ప్రాంతంలో 500  మీటర్ల పరిధిలో 5 ప్రమాదాలు జరిగితే ఆ ప్రాంతాన్ని యాక్సిడెంట్‌ స్పాట్‌గా లెక్కిస్తున్నారు. ఇలా సైబరాబాద్‌ పరిధిలో మొత్తం 115 యాక్సిడెంట్‌ బ్లాక్‌ స్పాట్‌లు ఉన్నట్లు ట్రాఫిక్‌ పోలీసుల అధ్యయనంలో తేలింది.


ఏడాదిన్నరలో 5,456 ప్రమాదాలు

యాక్సిడెంట్స్‌పై ప్రత్యేకంగా మానిటరింగ్‌ చేస్తున్న విభాగం ఒక్క సైబరాబాద్‌ పరిధిలోనే ఏడాదిన్నరలో 5,456 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు గుర్తించింది. ఈ ప్రమాదాల కారణంగా 1136 మంది దుర్మరణం చెందారు. వారి కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. కాగా, 5298 మంది గాయాలపాలయ్యారు. వారిలో కొంతమంది కోలుకోగా వందల మంది ఏదో ఒక రకం అంగవైకల్యంతో బతుకు వెళ్లదీస్తున్నారు.


ఈ ప్రాంతాలపై ఫోకస్‌

నగరంలో జరిగిన ప్రమాదాల ఆధారంగా ఈ ఆరు నెలల్లో హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌/ ప్రకాశ్‌నగర్‌ స్ట్రెచ్‌ వద్ద ఆరుగురు, తాడ్‌బన్‌ క్రాస్‌రోడ్‌/ జూపార్కు వద్ద నలుగురు, మలక్‌పేట్‌ గంజ్‌ వద్ద నలుగురు, ఎంజే మార్కెట్‌/అజంతా గేట్‌ వద్ద నలుగురు, అల్వాల్‌ రైతుబజార్‌ రోడ్‌ వద్ద ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఆయా ప్రాంతాలపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టిన అధికారులు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నారు. 


7,248 పాట్‌ హోల్స్‌ గుర్తించిన జీహెచ్‌ఎంసీ

నగరంలో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, గుంతలను పూడ్చేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంటోంది అని అధికారులు చెబుతున్నారు. మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి గ్రేటర్‌లో పలు సర్కిళ్లలో విస్తృతంగా పర్యటించి రోడ్ల మరమ్మతు పనులను వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరంలో మొత్తం 7,248 పాట్‌ హోల్స్‌ గుర్తించామని, అందులో 6,321 గుంతలను పూడ్చామని అధికారులు తెలిపారు. మిలిగిన వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు.

Updated Date - 2021-09-13T17:16:12+05:30 IST