Be Careful : Hyderabadలోని ఈ ప్రాంతంలో ఒమైక్రాన్‌ టెన్షన్‌..

ABN , First Publish Date - 2021-12-18T19:41:18+05:30 IST

Hyderabadలోని ఈ ప్రాంతంలో ఒమైక్రాన్‌ టెన్షన్‌.. భయం.. భయం..

Be Careful : Hyderabadలోని ఈ ప్రాంతంలో ఒమైక్రాన్‌ టెన్షన్‌..

హైదరాబాద్‌ సిటీ : రెండు, నాలుగు, ఆరు.. ఇలా నగరంలో ఒమైక్రాన్‌ కేసుల నమోదు పెరుగుతోంది. టోలిచౌకి, యూసు్‌ఫగూడ, చార్మినార్‌ ప్రాంతాల్లో నమోదైన కేసుల్లో అయిదుగురు విదేశీయులు కాగా, ఒకరు మాత్రమే హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా అధికారులు నిర్ధారించారు. ఒమైక్రాన్‌ పాజిటివ్‌ తొలి కేసులో బాధితుడు తన తండ్రి ఆరోగ్యం కోసం నగరానికి వచ్చాడు. అతను, మరో యువతి ఇక్కడే ఉన్నారు. మూడు రోజుల తర్వాత వారికి ఒమైక్రాన్‌ ఉన్నట్లు తేలడంతో ఆస్పత్రికి తరలించారు. అందులో ఓ వ్యక్తి పలు చోట్ల తిరిగాడు. ఇప్పుడు చార్మినార్‌, యూసుఫ్‌గూడ ప్రాంతాలలో కేసులు వెలుగులోకి వచ్చాయి. అధికారులు బాధితుల సన్నిహితులను, వారు కలిసిన వ్యక్తులను గుర్తించే పనిలో పడ్డారు. కొంత మంది పరీక్షలు చేయించుకోవడానికి ఆసక్తి చూపకపోవడం అధికారులకు ఇబ్బందిగా మారింది. పోలీసుల సహకారంతో నమునాలు సేకరిస్తున్నారు. బాధితుల కుటుంబ సభ్యులను, సన్నిహితులను క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.


భయం గుప్పిట్లో టోలిచౌకి..

టోలిచౌకి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దాన్ని ఆనుకుని ఉన్న పారామౌంట్‌ కాలనీ ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారికి అడ్డాగా మారింది. సోమాలియా, నైజీరియా, కెన్యా తదితర ఆఫ్రికా దేశాల నుంచి ఆస్పత్రుల్లో చికిత్స కోసం, విద్యార్థులుగా, ఇతర పనుల కోసం నగరానికి వచ్చి ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు. ఇక్కడికి సమీపంలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో ప్రముఖ ఆస్పత్రులు ఉండడం, తమకు అనుకూలమైన ఆహారం దొరుకుతుండడంతో ఆఫ్రికన్లు పారామౌంట్‌ కాలనీలోనే ఎక్కువగా ఉంటున్నారు. ఈ ప్రాంతంలో ఒమైక్రాన్‌ కేసులు బయటపడడంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో అధికారులు పారామౌంట్‌ కాలనీలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షల వేగం పెంచారు. గోల్కొండ క్లస్టర్‌ సీనియర్‌ మెడికల్‌ అధికారి అనూరాధ ఆధ్వర్యంలో కాలనీ గేట్‌ నెంబర్‌ 1, 4 ప్రాంతాలు, చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోని నివాసితుల శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలకు పంపారు. శుక్రవారం మొత్తం 169 మందికి పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య సిబ్బంది తెలిపారు. 

Updated Date - 2021-12-18T19:41:18+05:30 IST