HYD : ఇకపై నంబర్ ప్లేట్స్ కనిపించకుండా చీప్‌ ట్రిక్స్‌ చేశారో...!

ABN , First Publish Date - 2021-07-18T17:18:53+05:30 IST

యమహా ఎఫ్‌జెడ్‌ బైక్‌పై తిరుగుతూ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతూ వచ్చాడు...

HYD : ఇకపై నంబర్ ప్లేట్స్ కనిపించకుండా చీప్‌ ట్రిక్స్‌ చేశారో...!

ఇటీవల ఓ యువకుడు కొత్తగా కొనుగోలు చేసిన యమహా ఎఫ్‌జెడ్‌ బైక్‌పై తిరుగుతూ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతూ వచ్చాడు. ట్రాఫిక్‌ చలానాలు తప్పించుకోవడానికి నంబర్‌ ప్లేట్‌ కనిపించకుండా మాస్క్‌, క్లాత్‌ అడ్డం పెట్టడం, నెంబర్‌లు కనిపించకుండా ప్లేట్‌ను వంచడం చేసేవాడు. పోలీసులు ఆ వాహనంపై ప్రత్యేక దృష్టి సారించి నంబర్‌ ప్లేట్‌లోని చివరి రెండు నంబర్‌లను గుర్తించారు. మోడల్‌ ఆధారంగా నెంబర్‌ సిరీస్‌ను తెలుసుకుని వర్కవుట్‌ చేశారు. ఓనర్‌ను గుర్తించి సైబరాబాద్‌ పోలీసులు వాహనాన్ని సీజ్‌ చేశారు. 


మియాపూర్‌లో ఓ వ్యక్తి ఆల్టో కారును నడుపుతూ తరచూ ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్నాడు. ట్రాఫిక్‌ పోలీసులు చలానా విధించగా.. ఆ చలానాలన్నీ ఓమ్నీ కారు ఉన్న మరో యజమానికి వెళ్లాయి. దాంతో అవాక్కయిన యజమాని ట్రాఫిక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యజమాని కారు, ఆర్సీ పరిశీలించిన తర్వాత ఆ చలానాలు తీసేశారు. ప్రస్తుతం నకిలీ నంబర్‌ ప్లేట్‌తో తిరుగుతున్న కారు కోసం నిఘా పెట్టారు. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి నంబర్‌ ప్లేట్‌ ట్యాంపరింగ్‌ వాహనాలు రోజుకు పదుల సంఖ్యలో ట్రాఫిక్‌ పోలీసుల దృష్టికి వస్తున్నాయి.


హైదరాబాద్‌ సిటీ : ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ చీప్‌ట్రిక్స్‌కు పాల్పడుతున్న కొందరు యువకులపై పోలీసుల ప్రత్యేక దృష్టి సారించారు. చలానాలనుంచి తప్పించుకునేందుకు వాహనాల ట్యాంపరింగ్‌కు, వాహన నెంబర్‌ కనిపించకుండా ప్లేట్‌ను వంచడం, చివరి నెంబర్లను తొలగించడం, మాస్క్‌, క్లాత్‌లను కట్టడం, ఆటోలకు పూలదండలు కప్పడం, గ్రీజ్‌ రాయడం ఇలా అనేక విధాలుగా నంబర్‌ ప్లేట్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడుతూ పోలీసులకే మస్కా కొడుతున్నారు. ఇటువంటి చేష్టలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు గట్టి నిఘా పెట్టి ఎక్కడికక్కడ వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. చలానాలను విధిస్తున్నారు.


తప్పించుకోలేరు...

నంబర్‌ ప్లేట్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడటం కూడా నేరపూరితమైన చర్య కిందకు వస్తుంది. ఉద్దేశపూర్వకంగానే పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు భావించాల్సి ఉంటుంది. ఇలాంటి వాహనాలపై కమాండ్‌ కంట్రోల్‌ సిబ్బంది, ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఏదైనా సిగ్నల్‌ వద్ద ట్యాంపరింగ్‌ వాహనాలు గుర్తిస్తే పోలీసులు వాహనం మరో సిగ్నల్‌ వద్దకు వెళ్లేలోపు అక్కడ ఉన్న ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం ఇస్తారు. దాంతో వాహనాన్ని పట్టుకొని సీజ్‌ చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న మొత్తం చలానాలు చెల్లించిన తర్వాతనే తిరిగి వాహనాన్ని ఇస్తారు. అంతేకాక తరచూ నంబర్‌ ప్లేట్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలితే క్రిమినల్‌ కేసులు సైతం నమోదు చేస్తారు. ట్యాంపరింగ్‌, నెంబర్‌ ప్లేట్‌ కనిపించకుండా చేసే వారు, నిబంధనలను పట్టించుకోని వాహనదారులు తస్మాత్‌ జాగ్రత్త.

Updated Date - 2021-07-18T17:18:53+05:30 IST