జాగ్రత్త..!

ABN , First Publish Date - 2021-09-18T05:52:09+05:30 IST

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విట్టర్‌, టెలిగ్రామ్‌, ఐఎంవో, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ వంటి సామాజిక మాధ్యమాలు వినియోగించే మహిళలు, విద్యార్థినులను నేరగాళ్లు టార్గెట్‌ చేస్తున్నారు.

జాగ్రత్త..!

  1. సోషల్‌ మీడియాలో నేరగాళ్లు
  2. మహిళలు, విద్యార్థినులే టార్గెట్‌
  3. నగ్న వీడియోలు, చిత్రాలతో బెదిరింపులు
  4. జిల్లాలో నెల రోజుల్లో ఏడు కేసులు నమోదు
  5. అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ సుధీర్‌ కుమార్‌ రెడ్డి


కర్నూలు, సెప్టెంబరు 17: ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విట్టర్‌, టెలిగ్రామ్‌, ఐఎంవో, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ వంటి సామాజిక మాధ్యమాలు వినియోగించే మహిళలు, విద్యార్థినులను నేరగాళ్లు టార్గెట్‌ చేస్తున్నారు. జీవితంలో సోషల్‌ మీడియా భాగమైన నేపథ్యంలో కొందరు నేరగాళ్ల బారిన పడుతున్నారు. వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు పంచుకుని ఇరుకున పడుతున్నారు. సామాజిక మాధ్యమాలలో వివిధ పేర్లతో పరిచయమయ్యే అపరిచితులు ప్రేమ పేరిట వలవేసి, ఆ తరువాత బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. ఈ కారణంగా బాధిత మహిళలు, విద్యార్థినులు డబ్బులు, ఆభరణాలు పోగొట్టుకుంటున్నారు. మరికొందరు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల విద్యార్థినులు, మహిళలే లక్ష్యంగా నెట్టింట్లో డేటింగ్‌ యాప్‌లు, ఇతర సోషల్‌ మీడియాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. గత నెలలో జిల్లాలోనే ఇలాంటివి ఏడు కేసులు నమోదయ్యాయి. ఆ వివరాలను ఎస్పీ సుధీర్‌ కుమార్‌ రెడ్డి శుక్రవారం విలేకరులకు వివరించారు.


ఇవి బయట పడ్డాయి..

ఓ వ్యక్తి ఐదుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థినులతో ఒకరికి తెలియకుండా మరొకరితో చాట్‌ చేశాడు. వారి పర్సనల్‌ ఫొటోలు, వీడియోలు సేకరించాడు. చాట్‌ చేసినప్పుడు స్ర్కీన్‌ రికార్డు చేశాడు. వాటి ద్వారా వచ్చిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించాడు. ఓ యువతికి ఇటీవల వివాహం అయింది. అయినా వదలకుండా వారి కుటుంబ సభ్యులకు ఆ యువతి ఫొటోలు వాట్సాప్‌లో పంపి బెదిరించాడు. బాధితుల నుంచి రూ.లక్ష వసూలు చేశాడు. బాధితుల్లో ఒకరు కర్నూలు వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం  నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 


ఆన్‌లైన్‌లో పరిచయమైన ఓ వ్యక్తి ఓ యువతితో చాట్‌ చేసి వీడియోలు సేకరించాడు. ఆ వీడియోల ఆధారంగా ఆ యువతిని బెదిరించి రూ.25 లక్షల విలువైన బంగారు నగలు వసూలు చేశాడు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ యువకుడిని అరెస్టు చేశారు. 


ఓ ఉపాధ్యాయుడు ఏకంగా తన స్టూడెంట్‌ వీడియోలు సేకరించాడు. కొన్ని రోజుల తర్వాత ఆ యువతికి వివాహం జరిగింది. ఆ వీడియోలను ఆమె భర్తకు పంపించి బెదిరించాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, ఆ ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. 


ఓ వ్యక్తి ఇద్దరు అక్కా చెల్లెళ్లను టార్గెట్‌ చేశాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో చాట్‌ చేశాడు. వారి న్యూడ్‌ వీడియోలు రికార్డు చేసి, ఫ్యామిలీ గ్రూపులో పెట్టాడు. బెంబేలెత్తిపోయిన ఆ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. 


బిట్‌కాయిన్‌ ట్రేడింగ్‌ బిజినెస్‌ చేద్దామని ఆన్‌లైన్‌లో పరిచయమైన ఓ వ్యక్తి, ఓ యువతితో చనువుగా మాట్లాడి న్యూడ్‌ చాటింగ్‌ రికార్డు చేశాడు. ఆ యువతిని బెదిరించి భారీగా డబ్బు, బంగారు వసూలు చేశాడు. 


అప్రమత్తంగా ఉండాలి..


సోషల్‌ మీడియాలో నేరగాళ్ల బారిన పడుతున్న వారిలో ఎక్కువ మంది ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ విద్యార్థినులే ఉన్నారు. ఇలాంటి కేసులు పలు పోలీస్‌స్టేషన్లలో నమోదు అవుతున్నాయి. విద్యార్థినులు, మహిళలు చాటింగ్‌ చేసేటప్పుడు మితిమీరి ప్రవర్తించరాదు. అవతలి వ్యక్తులు స్ర్కీన్‌ రికార్డు చేసుకుని బ్లాక్‌మెయిల్‌ చేసే ప్రమాదం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ఎంత పరిచయస్థులైనా, దగ్గరివారైనా, ప్రైవేటు ఫొటోలు, వీడియోలు షేర్‌ చేసుకోకూడదు. మహిళల భద్రతే మా బాధ్యత. మీ భద్రత కోసం పోలీసులు ఉన్నారు. ఇలాంటి సంఘటనలు ఎవరికైనా ఎదురైతే ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలి. స్పందనలో గాని, దిశ పోలీస్‌స్టేషన్‌లోగాని, సమీప పోలీస్‌ స్టేషన్‌లో గాని, డయల్‌ 100కు గాని ఫిర్యాదు చేయవచ్చు. బాధితుల వివరాలన్నీ గోప్యంగా ఉంచుతాం. 


- ఎస్పీ సుధీర్‌ కుమార్‌ రెడ్డి

Updated Date - 2021-09-18T05:52:09+05:30 IST