చలికాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి.. ముఖ్యంగా Walking వేళలు మార్చాల్సిందే..!

ABN , First Publish Date - 2021-11-15T18:09:33+05:30 IST

చలి పెరుగుతోంది. ప్రజలకు వణుకు మొదలైంది. సాయంత్రం ఆరు అయిందంటే...

చలికాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి.. ముఖ్యంగా Walking వేళలు మార్చాల్సిందే..!

  • శీతాకాలంలో జాగ్రత్తలు తప్పనిసరి
  • చల్లటి గాలులతో అవస్థలు
  • వృద్ధులు, పిల్లలు మరింత భద్రం
  • వైరస్‌లు దాడి చేసే అవకాశాలు

హైదరాబాద్‌ సిటీ : చలి పెరుగుతోంది. ప్రజలకు వణుకు మొదలైంది. సాయంత్రం ఆరు అయిందంటే చల్లటి గాలులు వీస్తున్నాయి. ఈ కాలంలో ఇన్‌ఫ్లూయెంజా, ఫ్లూ వైరస్‌, రైనో వైరస్‌ దాడి చేసే ప్రమాదముంది. ఈ వైరస్‌ ఆస్తమా, సీవోపీడీ, న్యుమోనియా ఉన్న వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆరోగ్యంగా ఉన్న వారిపైనా దాడి చేస్తోంది. మహిళలకు, వృద్ధులకు, పిల్లలకు ఇది మరింత గడ్డు కాలం. వాతావరణంలో మార్పులకు శరీరం తెల్లగా పొడిబారిపోతుంది. పెదవులు పగిలిపోయి ముఖం కాంతిహీనంగా మారుతుంది. అరికాళ్లు పగిలి అవస్థలు మొదలవుతాయి. ఈ సీజన్‌లో శరీరంలో తేమ శాతం తగ్గిపోవడంతో దురదలు వస్తాయి. చేతులపై పగుళ్ల మాదిరిగా తెల్లటి గీతలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.


5, 10 నిమిషాల్లోనే స్నానం..

ఈ కాలంలో కేవలం 5 నుంచి 10 నిమిషాల లోపే స్నానం ముగించాలి. మూడు నాలుగు సార్లు మాయిశ్చరైజ్‌ చేయాలి. కాళ్లకు చెప్పులు లేకుండా నడవొద్దు. చేతులు, కాలి పాదాలు పగిలితే రోజూ గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పువేసి అందులో కొద్దిసేపు ఉంచుతుండాలి. తర్వాత పాదాలను శుభ్రంగా పొడిబట్టతో తుడిచి సరైన క్రీముతో మర్ధన చేస్తే పగుళ్లు తగ్గుముఖం పడతాయి. అరచేతులు, వేళ్ల సందుల్లో పగుళ్లు ఉంటే ఇదే పద్ధతి పాటించడం మంచిది.


వృద్ధులు జర భద్రం..

- మధుమేహం, గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే వారు ముందుగా వ్యాక్సిన్‌ వేసుకోవాలి.

- దగ్గు, జలుబు రెండు రోజుల్లో తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించాలి.

- త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవాలి.

- నాణ్యమైన క్రీములు, కొబ్బరినూనెతో రోజుకు నాలుగు సార్లు మాయిశ్చరైజ్‌ చేసుకోవాలి. 

- నీళ్లు ఎక్కువగా తాగాలి. ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారపదార్థాలు, నీళ్లు తీసుకోవద్దు.


ఎండ వచ్చాకే జాగింగ్‌.. వాకింగ్‌

- తెల్లవారుజాము వాకింగ్‌, జాగింగ్‌తో కాస్త ముప్పే.

- ఈ కాలంలో స్వైన్‌ఫ్లూ ముప్పు ఉంటుంది. మాస్కులు తప్పని సరి వినియోగించాలి. 

- మాస్కులు వేసుకోలేనివారు స్వైన్‌ఫ్లూ వ్యాక్సిన్‌ వేసుకోవడం మంచిది. 

- శరీరానికి ఎండ తగిలే సమయంలోనే జాగింగ్‌ చేయడం మంచిది. 

- ఉదయం 8 నుంచి 9, సాయంత్రం 4 నుంచి 5 మధ్య వాకింగ్‌ చేసుకోవాలి.

- చెట్లు ఎక్కువ ఉన్న ప్రాంతం కాకుండా కాస్త సూర్యరశ్మి తగిలే ప్రాంతంలో జాగింగ్‌ చేయడం మంచిది.

- తలకు మంకీటోపీలు ధరించాలి. చెవుల్లో దూది పెట్టుకోవాలి.

- వాకింగ్‌ చేసే వారికి షూ, సాక్స్‌ తప్పనిసరి.

- శీతలపానీయాలు, బయట విక్రయించే జ్యూసులు తాగవద్దు.

- పిల్లో కవర్లు మారుస్తూ ఉండాలి. చేతి రుమాలు వినియోగించవద్దు.

- టిష్యూ పేపర్లు వాడి వెంటనే పడేయాలి. 

:- మంచినీళ్లను వేడి చేసి చల్చార్చి తాగాలి. - డాక్టర్‌ టీఎన్‌జే రాజేష్‌, ఇంటర్నల్‌ మెడిసిన్‌, స్టార్‌ ఆస్పత్రి


జాగ్రత్తలు తప్పనిసరి...

- చల్లగాలిలో ఎక్కువ సేపు ఉంటే శ్వాసకోశ వ్యాధులతో పాటు, డస్ట్‌, స్మోకింగ్‌, లంగ్‌, స్కిన్‌ అలర్జీ సమస్యలు వస్తాయి. 

- శ్వాసకోశ సమస్యలున్న వారు చలికాలంలో తిరగవద్దు. 

- ఆస్తమా బాధితులు తప్పనిసరిగా ఇన్‌హేలర్‌ వినియోగించాలి. 

- జలుబు, దగ్గు, జ్వరం ఉంటే ఇంట్లో రెండు, మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలి. 

- మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. 

- దగ్గు, జలుబు వంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ప్రమాదముంది.

- ఆస్తమా, న్యుమోనియాతో  బాధపడే వారు  మందులను వాడకపోతే సమస్య తీవ్రంగా మారే అవకాశముంది. 

- ఆలస్యం చేస్తే క్రమేణా నీరు ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది.  

- బాగా వేడి, చల్లటి నీళ్లు కాకుండా గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి.

- సబ్బుల కంటే సున్నిపిండి, శనగపిండి వాడడం మేలు. 

:- వాహనాలు నడిపే వారు చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి - డాక్టర్‌ నవోదయ, జనరల్‌ ఫిజీషియన్‌, కేర్‌ ఆస్పత్రి.

Updated Date - 2021-11-15T18:09:33+05:30 IST